తాజా వార్తలు,రాష్ట్ర వార్తలు
Auto Added by WPeMatico
అప్పుడు రజినీకాంత్… ఇప్పుడు గజినీకాంత్: హరీష్ రావు
హైదరాబాద్: మార్పు మార్పు అని ప్రజలని ఏమార్చడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి పంచారని, నేడు బాకీ కార్డులను తాము అదే ఇండ్లకు పంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి, ఎన్నికల తర్వాత గజినీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయారని ఎద్దేవా చేశారు. బాకీ కార్డులు విడుదల సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ కార్డు చూపించి ప్రజలు నిలదీయాలని సూచించారు.
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు అని, కటింగ్ మాస్టర్ అయ్యారని హరీష్ రావు చురకలంటించారు. బిఆర్ఎస్ ప్రారంభించిన వాటికి సిఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ అమలు చేసిన పథకాలకు కటింగ్ చేస్తున్నారని, అయితే రిబ్బన్ కటింగ్ లేదంటే సంక్షేమ పథకాలకు కటింగ్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ అక్రమ కేసులతో ప్రభుత్వాన్ని నడపలేవని రేవంత్ కు చురకలంటించారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డరని, రేవంత్ ప్రభుత్వానికి కాలం దగ్గర పడుతుందని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని, బాకీ కార్డుతో అప్పుడు ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకొని అడుగుతారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తామన్నారు. తాము ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని తెలిపారు.
ఆ కార్డుతో కాంగ్రెస్ ను నిలదీస్తాం: కెటిఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడిందో నిలదీసి అడిగేందుకే బాకీ కార్డులకు రూపకల్పన చేశామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ, కౌలు రైతులకు రూ. 15000, రైతు కూలీలకు రూ.12000, ఆటో అన్నలకు దాదాపు రూ.24,000 ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500.. పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూ.4,౦౦౦, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు రూ.500 బోనస్, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? అని అడిగారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని కార్డులలో తెలుపుతామన్నారు. బిఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడమని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వదలిపెట్టమన్నారు.
ప్రయాణికులు ఎంజిబిఎస్ బస్టాండుకు రావొద్దు: సజ్జనార్
హైదరాబాద్: మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజిబిఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిందని టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఈరోజు ప్రయాణికులు ఎంజిబిఎస్ కు రావొద్దు అని సూచించారు. ఎంజిబిఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని తెలియజేశారు. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జెబిఎస్ నుంచి నడుస్తున్నాయని, వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నడుస్తున్నాయని, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. పొరపాటున ఎమ్ జి బిఎస్ కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్ని లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని సజ్జనార్ వివరించారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రయాణికులు వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకు ఎంజిబిఎస్ కు రావొద్దని విజ్ఞప్తి చేశారు.