తాజా వార్తలు,రాష్ట్ర వార్తలు
Auto Added by WPeMatico
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్‌ః పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం నుంచి విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడరాదని సూచిస్తూ బులిటెన్ విడుదల చేశారు.
ఇదిలాఉండగా సోమవారం ఉదయం 11 గంటలకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే బి. ప్రకాష్ గౌడ్ అనర్హత పిటిషన్‌పై విచారణ ప్రారంభమవుతుంది. పన్నెండు గంటలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, మూడు గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరుతూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నందున అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు.