నియామకాల్లో పారదర్శకం
మన తెలంగాణ/హైదరాబాద్: నియామకా ల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంపై దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీ స్ కమిషన్లకు భారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము సూచించారు. నియామకాల విషయం లో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యుపిఎస్‌సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందపని, ఈ కమిషన్ల విషయంలో అంబేడ్కర్ కీ లక పాత్ర పోషించారని వివరించారు. లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉండాలని సూచించారు. నియామకా ల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన ప రిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో శుక్రవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క, టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యుపిఎస్‌సి ఛైర్మన్ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ చైర్మన్లకు స్పష్టం చేశారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
భారత వృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పారదర్శక ఉద్యోగ భర్తీ విధానాల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశంలోనే అత్యంత నమ్మకమైన సంస్థలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. అభ్యర్థుల నిజాయతీ, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జెండర్ సెన్సిటివిటీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కృషి చేస్తోందని, అలాగే వికసిత భారత్ -2047 సాధన కోసం కృషి చేస్తోందని అన్నారు. నైపుణ్యాలు నేర్పవచ్చని కానీ సమగ్రత లోపాన్ని మాత్రం భర్తీ చేయలేమన్నారు. టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కొనేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కమిషన్ చైర్మన్లకు రాష్ట్రపతి సూచించారు. ప్రస్తుత సమయంలో భారత్‌కు అత్యుత్తమ పబ్లిక్ సర్వెంట్లు అవసరం ఉందని చెప్పారు. అలాంటి వారిని నియమించటంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ సదస్సు ద్వారా మరింత మెరుగైన విధానాలను అందిపుచ్చుకుంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు.
పిఎస్‌సిలపై నమ్మకాన్ని పెంచడం అందరి బాధ్యత: యుపిఎస్‌సి చైర్మన్
రాజ్యాంగం, పరిపాలన విభాగంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని యుపిఎస్‌సి ఛైర్మన్ అజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మరింత బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై నమ్మకాన్ని పెంపొందించటం మనందరి బాధ్యత అని సూచించారు. యుపిఎస్‌సి ద్వారా ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దాని ద్వారా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సామర్థ్యం పెంపు, నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
టిజిపిఎస్‌సి పరీక్షలను సక్రమంగా నిర్వహించింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
26వ నేషనల్ కాన్ఫరెన్స్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించటం గర్వంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గతేడాది అన్ని రకాల పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిగ్విజయంగా నిర్వహించిందని కొనియాడారు. సేవా దృక్పథం కలవారిని ప్రతిభ ఆధారంగా, క్యాలెండర్ అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. సమయానికి నోటిఫికేషన్లు ఇవ్వటం, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ఇవ్వటం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని పలు సూచనలు చేశారు.
నేడు ముగింపు..హాజరుకానున్న ఉప రాష్ట్రపతి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నో ఫ్లై, నో డ్రోన్ జోన్‌గా రాచకొండ సిపి సుధీర్‌బాబు ప్రకటించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు.. ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు, పరస్పర సహకారంపై చర్చ సాగింది. ఈ సదస్సు శనివారం (డిసెంబర్ 20)తో ముగియనుంది. ఈ సదస్సుకు భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.