జోరుగా ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రంలో జోరుగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ
80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ ద్వారా
కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
ఇప్పటికే 8,433 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్లలో రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు చేయడంతో వ్యవసాయ సాగులో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా అంతకంతకు పెరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈసారి జోరుగా పెరుగుతోంది. ఈ వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండించిన ధాన్యంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,433 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ మొత్తం రూ.13,661 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 26.37 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం కాగా, 25.49 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యమని ప్రభుత్వం తెలిపింది.
గత వానాకాలం తరహాలోనే ఈసారి కూడా సన్నాల ఉత్పత్తి పెరిగింది. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తుండటంతో సన్నరకాల సాగుకు రైతులు మొగ్గుచూపారు. ఇప్పటి వరకు రూ.314 కోట్లు ప్రభుత్వం సన్నాలకు బోనస్‌గా చెల్లించింది. ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలుస్తుండడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (జిఎస్‌విఏ) వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ.1,00,004 కోట్లు నమోదవ్వగా, 2024-,25 అంచనాల ప్రకారం రూ. 1,06,708లకు చేరింది.
2024,-25 సీజన్‌లో 220.77 లక్షలకు పెరిగిన సాగు విస్తీర్ణం
2023-,24 సీజన్ లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2024,-25 సీజన్ లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. తెలంగాణలో ప్రధాన పంటైన వరి 2023-,24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేశారు. 2024,-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేళ్లుగా ఒకే తీరుగా ఉంది. రెండేళ్లలో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.