ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ.. పట్టుబడిన రాజకీయ ప్రముఖులు
పోలీసుల అదుపులో 25 మంది యువకులు, 8 మంది యువతులు
లింగంపల్లి సప్తగిరి ఫామ్‌హౌస్‌లో గుట్టుగా నిర్వహణ
రూ.2.45 లక్షల నగదు, విలువైన మద్యం సీసాలు, 11 కార్లు స్వాధీనం
పట్టుబడిన వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు
అయినా..పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు
మీడియాకు సమాచారం ఇచ్చేందుకు పోలీసుల నిరాకరణ
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
మన తెలంగాణ/మంచాల: నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ సమీపంలో గల సప్తగిరి ఫామ్‌హౌస్‌లో బుధవారం రాత్రి కిట్టీ పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మంది యువతులు, 25 మంది యువకులు ఉన్నారు. వారి నుండి రూ.2.45 లక్షల నగదుతో పాటు 11 కార్లు, 25 సెల్‌ఫోన్లు, విలువైన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
ఫామ్‌హౌస్ నిర్వాహకుడు రుద్రశెట్టి సప్తగిరి ఈ ముజ్రా పార్టీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ముజ్రాపార్టీలో పాల్గొన్న యువతీ, యువకుల పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ మధు తెలిపారు. కాగా, ముజ్రా పార్టీ నిర్వహిస్తూ పట్టుబడిన వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. దీంతో నిందితులను మీడియా కంట పడకుండా పోలీసులు ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్ నుండి పంపించి వేశారు. మీడియా ప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ముజ్రా పార్టీలో పట్టుబడిన వారి పట్ల పోలీసులు చూపిన ప్రేమ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.