దీపావళి పండుగలో అపశృతి
దీపావళి బాణాసంచా వల్ల గాయాలు కావడంతో పలువురు నగరంలోని సరోజినీ దేవి ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకు ౫౪ మందికి గాయాలు కాగా, కొందరు చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లి పోయారు. ముగ్గురి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సరోజిని దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదీని తెలిపారు. దీపావళి కావడంతో నగర ప్రజలు సంతోషంగా బాణసంచా కాల్చారు. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు మెహిదీపట్నంలోని సరోజీని కంటి ఆస్పత్రికి వచ్చారు. ఇందులో కామారెడ్డికి చెందిన బాలుడు దుర్గా ప్రసాద్(12), ప్రొద్గుటూరుకు చెందిన అంజయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు.
బాణసంచా వల్ల గాయపడిన వారిలో 15 మంది పిల్లలు, 47 మంది పెద్దవారు ఉన్నారు. దీపావళి పండగ సందర్భంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్ మోదీని తెలిపారు. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బుధవారం ఉదయం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వారిలో 95 శాతం మంది మిర్చి పటాకుల వల్ల గాయాలయ్యాయని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో ప్రతి ఒక్కరు తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.