కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని చెప్పారు. సిద్దిపేటలో ట్రాక్టర్లు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే వడ్డెర సోదరులపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బిల్డింగులు నిర్మించే వడ్డెర సోదరులకు చేతినిం పని దొరికేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదని.. వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని మండిపడ్డారు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ బిడ్డ,జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడుకున్నారో చూశారని.. కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు తిట్టుకున్నారని ఆరోపించారు. మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాదులో కెసిఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూలగొట్టించాడని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చొద్దంటే, హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొట్టినా ప్రజలు తనకే ఓటేశారని రేవంత్ రెడ్డి విర్రవీగుతారని అన్నారు.
ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని గ్యారెంటీ కార్డు ఇచ్చారని గుర్తు చేశారు. రెండు వేల పెన్షన్ రూ. 4000 చేస్తామన్నారు, చేశారా..? అని ప్రశ్నించారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను కెసిఆర్ రూ. 2000 చేశారని కొనియాడారు. మహిళలకు రూ. 2500 రావాలన్నా, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రావాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌తో మాట్లాడి వడ్డెర సోదరులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగాపైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని ఇచ్చారు. ఆరోజు అడగకపోయినా హైదరాబాద్‌లో వడ్డెర సంఘానికి కెసిఆర్ ఎకరం భూమి ఇచ్చారని గుర్తు చేశారు. కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లో వడ్డెర ఆత్మగౌరవ భవనానికి స్థలాలను కేటాయించిందని.. దాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సిఎం అంటే కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఎక్కడా కొత్త స్కీమ్ పెట్టింది లేదని.. కొత్త భవనం కట్టింది లేదని విమర్శించారు. కెసిఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు, బిల్డింగ్‌లకు రిబ్బన్లు కట్ చేయడం, కెసిఆర్ పెట్టిన స్కీములను కటింగ్ చేయడం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ కిట్టు, బతుకమ్మ చీర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అన్ని పథకాలకు కత్తెర పెట్టాడని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయి చిన్నపిల్లలతో ఉన్నారని.. గోపీనాథ్ చనిపోతే ఆ కుటుంబాన్ని అనాధలుగా వదిలేయమంటారా..? అని ప్రశ్నించారు. భర్త చనిపోతే ఏడ్చిన ఆడపడుచుని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఓటు 11వ తేదీన రోజు పోలింగ్ బూత్‌కు పోయి సునీతమ్మకు ఓటు వెయ్యాలని కోరారు. కారు మీద ఓటు గుద్దితే రేవంత్ రెడ్డి గువ్వ గుయ్యిమనాలని అన్నారు.