నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను మెహిదీపట్నం, సౌత్‌వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4,75,000 నకిలీ రూ.500 నోట్లు, కారు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌వెస్ట్ ఎడిసిపి సిద్ధిఖీ గురువారం మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోస్గి, గుడిమల్ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్ బాబు తాండూరులో ఉంటూ కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సైబరాబాద్, ఫిష్ బిల్డింగ్, సులేమాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ వాహిద్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్ అలియాస్ తాహా, మహ్మద్ సోహైల్, ఎండి ఫహద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, సయిద్ అల్తామాష్ అహ్మద్ డిగ్రీ చదువుతున్నాడు.
తాండూరుకు చెందిన రమేష్ బాబు, అతడి సోదరి రామేశ్వరి కలిసి నకిలీ రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు. ఇద్దరు కలిసి గతంలో కూడా నకిలీ నోట్లను ముద్రించడంతో గుజరాత్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. తాండూరులోని ఇంట్లోనే అన్నా, చెల్లి కలిసి నోట్లను ముద్రించి 1ః4 నిష్పత్తిలో పంపిణీ చేస్తున్నారు. నిందితులు జేకె బాండ్ పేపర్‌పై నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారు. రమేష్ ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేసి కింద తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. వాటిని చూసిన నగరానికి చెందిన నిందితులు సంప్రదించారు. వారికి రమేష్ బాబు నకిలీ నోట్లు ఇవ్వడంతో నగరంలో చెలామణి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు మల్లేషం, సంతోష్ కుమార్ తదితరులు దర్యాప్తు చేశారు.