కోడిగుడ్డు ఆల్ టైం రికార్డ్.. పెరుగుతున్న చికెన్ ధరలు
రిటైల్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న కోడిగుడ్లు, చికెన్ ధరలు
కోడిగుడ్డు రూ.8కి పెరిగి ఆల్ టైం గరిష్టం రికార్డ్ నమోదు
చికెన్ ధరలు క్రమేణా పెరుగుతూ రూ.280కి చేరువ
తగ్గిన కోడిగుడ్ల ఉత్పతితో పెరిగిన డిమాండే కారణం
గుడ్డు, చికెన్ ధరల పెరుగుదలతో సామాన్యులు గగ్గోలు
మన తెలంగాణ/హైదరాబాద్: కోడిగుడ్లు, కోడి మాంసం, కూరగాయలు ఇలా ఒకటేంటి అన్నీ రోజు రోజుకీ పెరుగుతుంటే సగటు జీవికి బ్రతుకు భారమవుతోంది. కూరగాయల కన్నా కోడి గుడ్లు ధరలు తక్కువ ఉంది కదా అని సరిపెట్టుకునే వారికి గుడ్డు ధర కూడా రూ.8కి పైగానే రిటైల్ మార్కెట్‌లో ధర పలుకుతుంటే హడలిపోతున్నారు. దీనికితోడు సాధారణ ప్రజలకు తక్కువ ధరలో లభించే మాంసాహారమైన బ్రాయిలర్ కోడి మాంసం ధర కూడా ప్రతి రోజు పెరిగి, ఆదివారం నాటికి కిలోధర రూ.280కి చేరింది. దీంతో చికెన్ ధరలు ఒక వైపు, కోడి గుడ్ల ధరలు మరో వైపు భారీగా పెరుగుతూ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు హడలిపోతున్నారు.
కోడిగుడ్ల హోల్‌సేల్ మార్కెట్ వర్గాల సమాచారం మేరకు ఈ స్థాయిలో ఎప్పుడూ ధరలు పెరగలేదని, ఈ పెరుగుదల ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. సామాన్యుడికి ఎప్పుడూ తక్కువ ధరలో అందుబాటులో ఉండే కోడి గుడ్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్లో రూ.5గా ఉన్న గుడ్డు ధర, క్రమేణా రూ.6కి పెరిగి ఆ తర్వాత పెరుగుతూ వస్తూ ఏకంగా రూ.7.30కి చేరుకుంది. ఆ తర్వాత ఏకంగా గుడ్డు ధర రూ.8కు చేరుకుంది. కొన్నిచోట్ల రిటైల్ వ్యాపారులు ఏడున్నర ఉంటే ఎనిమిది తీసుకుంటున్నారు. దీంతో అవసరాన్ని బట్టి 50 పైసలు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 30 కోడి గుడ్లు ధర (ట్రే) గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు ఉంటే, ఇప్పుడు రూ.210 నుంచి రూ.240కి చేరుకుంది.
మరో రెండు నెలలు ఇవే ధరలు కొనసాగే అవకాశం
మరో రెండు నెలల పాటు ఇవే ధరలు, లేదా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే గుడ్ల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులు షాక్ అవుతుంటే ఫామ్‌ల యజమానులు మాత్రం ధరలు ఇలా రెండు మూడు నెలలు కొనసాగితే తాము నష్టాల బారి నుంచి బయటపడతామని చెబుతున్నారు. కోళ్లు వ్యాధులతో చనిపోవడం ఒకటైతే, కోడి గుడ్లు దిగుమతి కావడం వల్ల మరింత మార్కెట్ క్షీణించి కోడి గుడ్లు ధరల్లేక, కోళ్లు లేక ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. ఇలా కొంచెం ధర పెరిగి కోడిగుడ్ల మార్కెట్ స్థిరంగా కొనసాగితే తాము ఇప్పటికి ఎదుర్కొంటున్న నష్టాల నుంచి బయటపడతామని వెల్లడిస్తున్నారు.
కాగా గుడ్ల ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతుండడం వెనుక అనేక కారణాలను వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం, వసతి గృహాల్లో వినియోగం, బేకరీలు, ఇలా చాలా రకాలుగా కోడిగుడ్ల వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు కూరగాయలకు బదులుగా కోడిగుడ్లు తినే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్ల కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు కోళ్ల దాణా, మక్కలు వంటి ధరలు కూడా పెరగడంతో కోళ్ల ఫారం ఉత్పత్తిదారులకు పెట్టుబడి వ్యయం విపరీతంగాపెరిగిపోయిందని చెబుతున్నారు.
గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. పెట్టుబడి పెరగడంతో చాలా మంది రైతులు ఫారాల కోళ్ల ఫారాలను మూసివేయడం వల్ల గుడ్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయి ఆరు కోట్ల కోడిగుడ్లకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్‌లో కోడిగుడ్డు ధర రూ.7.30, రిటైల్లో రూ.8 పలకడం పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్ టైమ్ గరిష్ఠంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరో రెండు నెలల పాటు ఇదే ధర కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.