మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసనకు యత్నం..
న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జి జిఆర్ స్వామినాథన్‌పై అభిశంసనకు డిఎంకె చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ 56 మాజీ జడ్జీలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు లోని మధురై పర్వత ప్రాంతంపై ఆరోశతాబ్దానికి చెందిన తిరుప్పరన్ కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, ఆ ప్రాంగణం లోనే 14 వ శతాబ్దానికి చెందిన దర్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం కింద ఉన్న స్తంభం వద్ద కార్తీక దీపోత్సవం నాడు భక్తులు దీపం వెలిగించడం వందల ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే డిసెంబర్ 1న ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మధురై బెంచ్ జడ్జి జస్టిస్ స్వామినాథన్ , కింద ఉన్న స్తంభంలో కాకుండా
ఆలయం పైన ఉన్న స్తంభంపైనే దీపం వెలిగించాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు అభ్యంతరం లేవదీశారు. ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చినా కోర్టు అంగీకరించలేదు. దీంతో డిఎంకె నేతృత్వం లోని అనేక మంది ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ జడ్జీని తొలగించాలని కోరుతూ తీర్మానం చేశారు. దీనిపై 56 మంది మాజీ జడ్జీలు శుక్రవారం తీవ్ర నిరసన తెలియజేస్తూ జడ్జి స్వామినాథన్‌కు మద్దతుగా ప్రకటన విడుదల చేశారు. అభిశంసన నిర్ణయం న్యాయవ్యవస్థను బెదిరించడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. అభిశంసనను న్యాయవ్యవస్థ స్వేచ్ఛను కాపాడడానికి ఉపయోగించాలే కానీ , రాజకీయ ఒత్తిడికి కాదని వారు ప్రకటనలో పేర్కొన్నారు.