తిరువనంతపురం కార్పొరేషన్ లో సగం వార్డులు కమలానివే
త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీల్లో బీజేపీ ఘనవిజయం
తిరువనంతపురం: కేరళలోని మొత్తం 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు, 941 గ్రామ పంచాయతీలకు, 152 బ్లాక్ పంచాయతీలకు డిసెంబర్ 9, 11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మొత్తం స్థానిక సంస్థల్లో చాలా చోట్ల బీజేపీ హవా కనిపిస్తుండగా, సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్ వెనుకబడడం కేరళ రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన పరిణామం. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డిఎ కైవసం చేసుకోవడం కామ్రేడ్ కోటలో కాషాయం జెండా ఎగురవేయడమే . లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధిపత్యం వహిస్తున్న కేరళ రాజకీయ క్షేత్రంలో ఇది చెప్పుకోదగిన మార్పు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్వంత జిల్లా తిరువనంతపురంలో రాష్ట్ర రాజధానిలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)తోపాటు కాంగ్రెస్ సారథ్యం లోని నేషనల్‌డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)కు గట్టిదెబ్బ తగిలింది. బీజేపీ సారథ్యం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది.
ఎల్‌డీఎఫ్ 29 వార్డుల్లో గెలుపు సాధించగా, 19 వార్డులను యాడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్‌లో నిర్ణయాత్మకమైన మెజార్టీ సాధించడానికి బీజేపీకి ఒక స్థానమే తక్కువైంది. ఈ విజయం 2026 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి నూతన శక్తిని అందించింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో పట్టు నిలదొక్కుకునేలా చేసింది. ఇంతకు ముందు 2020లో తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకోగా, బీజేపీ సారథ్యం లోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి. ఎర్నాకులం జిల్లా త్రిపునిధుర మున్సిపాలిటీలో కూడా ఎన్‌డిఎ కీలక మైన విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 53 కౌన్సిల్ స్థానాల్లో 21 స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంది. ఎల్‌డిఎఫ్‌కు 20 స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మూడోస్థానానికి దిగజారి 12 స్థానాలకే పరిమితమైంది. ఎ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంటున్న త్రిపునిధుర మున్సిపాలిటీ దశాబ్దాలుగా ఎల్‌డిఎఫ్, లేదా యుడిఎఫ్ పాలనలో ఉంటోంది.
తాజా ఫలితాలు ఆ ఆనవాయితీ నుంచి బయటపడేలా చేశాయి. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిపునిధుర మున్సిపాలిటీ 49వార్డుల్లో సిపిఎం అతిపెద్ద పార్టీగా 23 స్థానాలను గెలుచుకుంది. అప్పుడు బీజేపీ 17 స్థానాలనే దక్కించుకోగలిగింది. అయితే ఈ ఏడాది ఈ మున్సిపాలిటీని ఓటరు ప్రాధాన్యం బట్టి 53 వార్డులకు విస్తరించారు. పలక్కాడ్ మున్సిపాలిటీని కూడా ఎన్‌డిఎ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఈ మున్సిపాలిటీలో బీజేపీయే ఏకైక భారీ పార్టీగా 25 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. యుడిఎఫ్ 18,ఎల్‌డిఎఫ్ 9 స్థానాలను మాత్రమే దక్కించుకున్నాయి. త్రిస్సూర్ కార్పొరేషన్‌లో 8 వార్డులను బిజేపి గెల్చుకుంది. త్రిస్సూర్ నుంచి గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సురేష్ గోపీ ఎన్నికైన సంగతి తెలిసిందే. కొడుంగల్లూరు మున్సిపాలిటీలో 46 వార్డులకు 18 బీజేపీ గెల్చుకుంది. గురువాయూరు, వడక్కంచెర్రి మున్సిపాలిటీల్లో చెరో రెండేసి వార్డులను గెల్చుకుంది.కున్నంకూలం మున్సిపాలిటీలో 7 వార్డులు, ఇరింజలకూడ మున్సిపాలిటీలో 6 వార్డులు, చలకుడి మున్సిపాలిటీలో ఒకటి వార్డులు బీజేపీ కైవసం అయ్యాయి.
గ్రామ పంచాయతీల్లో
ఇక బ్లాక్ పంచాయతీల్లో 4 వార్డులు, గ్రామపంచాయతీల్లో 167బీజేపీ దక్కించుకోగా, త్రిస్సూర్ జిల్లాలో ఏ పంచాయతీ బీజేపీకి దక్కలేదు. బీజేపీ నేతృత్వం లోని ఫ్రంట్ 1085 గ్రామ పంచాయతీ వార్డులను, 44 బ్లాక్ పంచాయతీ వార్డులను గెలుచుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కొల్లాం కార్పొరేషన్‌లో 11 వార్డులు, కోజికోడ్ కార్పొరేషన్‌లో 13 వార్డులు, కన్నూర్ కార్పొరేషన్‌లో 4 వార్డులు, కొచ్చి కార్పొరేషన్‌లో 6 వార్డులు, బీజేపీ పరమయ్యాయి. తిరువనంతపురం కార్పొరేషన్‌లో ఎల్‌డిఎఫ్ హయాంలో అవినీతి బాగా జరిగిందని బీజేపీ చేసిన ప్రచారం ఎక్కువ ప్రభావం చూపించింది. శబరిమల బంగారం స్కామ్ పై ప్రచారం అయ్యప్ప క్షేత్రం నెలకొన్న పథనం మిట్ట జిల్లాలోని 142 గ్రామ పంచాయతీ వార్డులు, ఆరు బ్లాక్ పంచాయతీ వార్డులు, 21 మున్సిపల్ వార్డులు బీజేపీ విజయం పొందడానికి దోహదం చేశాయి. పథనం మిట్ట జిల్లాలో పందలం మున్సిపాలిటీ లోని పందలం టౌన్ లోని 9 వార్డులు, పందలం బ్లాక్ పంచాయతీ లోని 3 వార్డులు బీజేపీ కైవసమయ్యాయి.
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర: ప్రధాని మోడీ
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషివల్లనే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ను ఓడించగలిగినట్టు పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి బీజెపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి: శశిథరూర్
ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించారు. విజయం సాధించిన బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ చేస్తున్న అక్రమాలను చాలాసార్లు ప్రశ్నించానని, వారి పాలన నుంచి బయటపడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు ఈ ఫలితాలతో తేలిందన్నారు.
అనుకున్న ఫలితాలు సాధించలేక పోయాం: పినరయి విజయన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం మీద ఘనవిజయం సాధిస్తామని అంచనా వేశామని , కానీ అనుకున్నట్టు సాధించలేకపోయామని అన్నారు. దీనికి కారణాలేమిటో విశ్లేషించుకుని అవసరమైన సవరణలు చేసుకుని, ముందుకు వెళ్తామన్నారు. వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు , మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 45 ఏళ్ల తరువాత కామ్రేడ్ కోటలో బీజేపీ పాగా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేరళ స్థానిక సంస్థలకు డిసెంబర్ 9,11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.మొదటి దశలో70.91 శాతం, రెండో దశలో 76.08 శాతం పోలింగ్ జరిగింది.