ఎస్‌ఐఆర్ అనేది ఎన్నికల సంఘం ప్రత్యేక హక్కు.. సుప్రీం కీలక కామెంట్స్
న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రత్యేక హక్కు. వారికి ఆదేశాలు జారీచేయడం అంటే జోక్యమే అవుతుందని మంగళవారం సుప్రీంకోర్టు పేర్కొంది. మరో ఐదు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను ఎప్పుడు నిర్వహించాలని యోచిస్తున్నారో తెలియజేయాలని ధర్మాసనం కోరిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. ముసాయిదా ఓటర్ల జాబిఆ ప్రచురణ తర్వాత 3.66 లక్షల ఓటర్ల తొలగింపులు, 21 లక్షల మంది ఓటర్ల చేర్పులకు సంబంధించిన డేటాను సంకలనం చేసి గురువారం(అక్టోబర్ 9) నాటికి నోట్ సిద్ధం చేయాలని కూడా కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. ‘అన్ని విధులను మేము చేపట్టాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఎస్‌ఐఆర్ నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రత్యేక హక్కు. మేము మధ్యలో వస్తే, కలుగజేసుకున్నట్లు అవుతుంది’ అని న్యాయమూర్తి సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాలు చేసిన పిటిషనర్ల తరఫున వాదించిన కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిని లక్షలాది మందికి ఆ విషయం తెలుపలేదని అన్నారు. ‘పేర్లు తొలగించిన 3.66 లక్షల మందికి ఎలాంటి నోటీసు అందలేదు. దానికి ఎవరు కారణాలు చెప్పడం లేదు.అయితే అప్పీల్ చేసుకునే ప్రావిజన్ అయితే ఉంది. సమాచారం లేనందున అప్పీల్ చేసుకునే అవకాశమే లేదు’ అని సింఘ్వీ కోర్టుకు తెలిపారు.అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ 47 లక్షల మంది పేర్లను తొలగించారు అని పేర్కొన్నారు. ‘పారదర్శకత పూర్తిగా లోపించింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల గురించిన సమాచారం కోర్టు ఆదేశించాకే లభించింది. మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల కమిషన్ సమాచారాన్ని అప్‌లోడ్ చేయలేదు’ అని తెలిపారు.
దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది మాట్లాడుతూ, పేర్లు తొలగించిన విషయం వారికి తెలియజేశాం. ముసాయిదా జాబితా, తుది జాబితా రెండింటి కాపీలను రాజకీయ పార్టీలకు అందించామన్నారు. కాగా విచారణ సందర్భంగా ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడినట్లు తమకు సమాచారం ఇవ్వలేదని, అప్పీలు దాఖలు చేయలేదని పేర్కొన్న కొంత మంది వ్యక్తుల జాబితాను ఇవ్వాలని సుప్రీంకోర్టు పిటిషనర్లను కోరింది. కోర్టు ఈ కేసు విచారణను గురువారం కూడా కొనసాగించనున్నది.