ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూరులో శుక్రవారం అత్యధిక సంఖ్యలో అజ్ఞాత నక్సలైట్లు లొంగిపొయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట ఆయుధాలతో పాటు ఆత్మసమర్పణం చేసుకున్న వారిలో పలువురు కీలక సీనియర్ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో పార్టీ సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ అలియాస్ సతీష్ కూడా ఉన్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా రివార్డు ప్రకటితం అయి ఉన్న ఆశన్నతో పాటు మొత్తం 210 మంది వివిధ కేడర్స్‌కు చెందిన నక్సల్స్ ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయి, జనజీవన స్రవంతిలోకి తాము వస్తున్నట్లు ప్రకటించడం సంచలనాత్మకం , ఇదే దశలో మావోయిస్టుల ప్రాబల్య ఉద్యమం బీటలు స, తీవ్రస్థాయి బలహీనతకు అద్దం పటింది. అడవుల నుంచి వీరి తిరోగమనం సంకేతం అయింది. ఇప్పుడు లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. 98 మంది పురుషులు వరుసగా వారి వారి పేర్లను అధికారులు పిలుస్తూ ఉండగా వచ్చి ఆయుధాలు వదిలి సరెండర్ అయ్యారు. మొత్తం 153 ఆయుధాలు వదిలిపెట్టారు.
వీటిలో 19 ఏకె 47 రైఫిల్స్, 17 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, 23 ఇన్సాస్‌లు, 303 రైఫిల్స్ 17 ఎన్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 41 బోర్ షాట్‌గన్‌లు, పిస్టల్స్, నాలుగు కార్బైన్‌లు ఉన్నాయి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నక్సల్స్ చరిత్రలో ఇది సామూహిక సరెండర్ ఘట్టం అయిందని అధికారులు తెలిపారు. కాగా ఈ శుక్రవారం ఓ చారిత్రక దినం అని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ స్పందించారు. ఇప్పటి సరెండర్లతో రాష్ట్రంలో గత మూడురోజులలో లొంగిపోయిన నక్సలైట్ల సంఖ్య 238కి చేరుకుంది. బుధవారం వేర్వేరు చోట్ల 28 మంది వరకూ లొంగిపోయారు. ఇప్పటి లొంగుబాట బస్తర్ ప్రాంతానికే కాకుండా యావత్తూ ఛత్తీస్‌గఢ్‌కు తద్వారా మొత్తం దేశానికి ఒక కీలక మైలురాయి అవుతుందని తెలిపారు. బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రపట్టణం జగదల్పూరులో నక్సల్స్ తమ ఆయుధాలను పోలీసులు, పారామిలిటరీ దళాల అధికారులకు అప్పగించారు. సరెండర్ ప్రక్రియ వేదిక వెనుక బ్యానర్‌లో అడవిబాట నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం అని స్థానిక గిరిజన భాషలో రాసి ఉంచారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం పూర్తి స్థాయి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో సాగిస్తున్న పోరులో ఈ సరెండర్ ముఖ్య అధ్యాయం అయింది. లొంగిపోయిన నక్సల్స్ బృందంతో స్థానిక గిరిజనుల తెగల నేతలు, కొండదేవతల పూజారులు కూడా నిలబడి ఫోటోలు దిగారు. వారికి గులాబీలు అందించారు. నూతన ఆరంభానికి, శాంతియుత జీవిత ఆకాంక్షలతో స్వాగతం పలికారు. ఆ తరువాత సీనియర్ పోలీసు అధికారులు , పారామిలిటరీ అధికారులతో కలిసి గిరిజన తెగలతో కలిసి మరో ఫోటో దిగారు.
నక్సలైట్ల లొంగుబాటు కోసం బస్తర్ పోలీసు అధికార యంత్రాంగం చాలారోజుల క్రితమే పునరావాస కార్యక్రమం పునామార్గెంను చేపట్టింది. ఈ పథకం పరిధిలో లొంగిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలకు హామీ ఇచ్చారు. లొంగుబాట్ల తరువాత సిఎం విష్ణుదేవ్ ఇక్కడనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లొంగిపోయిన కేడర్‌కు సాధారణ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానం అని ప్రకటించారు. ఇంతకాలం తప్పుడు బాట పట్టిన వీరు సమాజానికి దూరం అయ్యారని, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషకరం అని తెలిపారు.రాజ్యాంగం పట్ల విధేయతను, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునారావాస, లొంగుబాట్ల పథకంలో లోంగిన వారికి పలు విధాలుగా మేలు జరుగుతుంది. వారికి ఆర్థిక సాయం ఉంటుంది. భూమి కల్పిస్తారు. నూతన పారిశ్రామిక విధానం పరిధిలో చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఉపాది కల్పన ఏర్పాట్లు కూడా జరుగుతాయని, సరెండర్ అయిన వారికి తమ నుంచి పూర్తి స్థాయి ఆసరా ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో మరింతగా నక్సల్స్ దళాలు సరెండర్ అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
లొంగిపోయిన సీనియర్ నేతల పేర్లు
ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్‌లో అగ్రస్థాయి నక్సల్స్‌లో ఆశన్నతో పాటు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (డికెఎస్‌జడ్‌సి) సభ్యులు భాస్కర్ అలియాస్ రాజ్‌మన్ మండవి, రణిత , రాజు సలాం, ధనూ వెట్టి అలియాస్ సంతూ ఉన్నారు. ఇక ఈ సీనియర్ల జాబితాలోనే ప్రాంతీయ కమిటీ సభ్యులు రతన్ ఎలామ్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్ బృందం తమకు తాముగా 11 బారెల్ గ్రెనెడ్ లాంఛర్లను కూడా అప్పగించారు. దేశంలో నక్సలిజం సమస్యను పూర్తి స్థాయిలో 2026 మార్చి 31 నాటికి నిర్మూలించి తీరుతామని హోం మంత్రి అమిత్ షా ఇటీవలి కాలంలో పదేపదే చెపుతూ వస్తున్నారు.ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ఇటీవలే పెద్ద ఎత్తున నక్సల్స్ అగ్రనాయకులు కేడర్‌తో పాటు సరెండర్ అవుతున్నారు.
రెండు రోజుల క్రితం అత్యంత కీలక నక్సల్స్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ భూపతి 60 మందికి పైగా నక్సల్స్‌తో కలిసి మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్ ఎదుట గడ్చిరోలిలో లొంగుబాట పట్టారు. ఇప్పుడు రెండు మూడు రోజుల తీవ్ర ఉత్కంఠత నడుమ ఇప్పుడు ఆశన్న ఇతర కీలక కేడర్‌తో కలిసి సరెండర్‌కు దిగారు. బస్తర్ దాదాపుగా నక్సల్స్ విముక్తం అయిందని, ఇక మిగిలిన నక్సల్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవల్సి ఉంటుంది. లేదా వారు ఇప్పటికీ గన్‌తోనే తిరుగుతూ ఉంటే తమ భద్రతా బలగాల తూటాలకు బలి కావడం తథ్యమని అమిత్ షా చెపుతూ తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగుతూ వస్తున్న దశలోనే ఇప్పుడు ముందుగా మహారాష్ట్ర సిఎం ఎదుట అగ్రస్థాయి నేత, ఛత్తీస్‌గఢ్ సిఎం ముందు మరో టాప్ లీడర్ సరెండర్ కావడం కేంద్ర హోం శాఖ కీలక వ్యూహాత్మక కార్యాచరణ, ప్రత్యేకించి మావోయిస్టుల్లో తీవ్రస్థాయి భయాందోళనల దిశలో ముందుకు సాగే ప్రక్రియ అని వెల్లడైంది.
లొంగుబాట ఆశన్నది తెలంగాణలోని ములుగు ప్రాంతం
వరంగల్ ఫాతిమా కాలేజీ, ఆర్‌ఎస్‌యూ పూర్వరంగం
నక్సల్స్ బలగం తరఫున పలు భీకర దాడులకు వ్యూహరచన సాగించిన ఇప్పుడు లొంగిపోయిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. దాదాపు 60 సంవత్సరాల వయస్సున్న ఆశన్న 40 ఏండ్ల క్రితం అంటే తన 20 ఏండ్ల వయస్సులోనే పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులు అయి అడవిబాట పట్టారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అనబడే ఈ ఆశన్న విద్యాభ్యాసం ఎక్కువగా లక్ష్మిదేవిపేట ప్రభుత్వ స్కూల్‌లో సాగింది. తరువాత హన్మకొండ కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో ఆ తరువాత వరంగల్‌లో కాకతీయ వర్శిటీలో చదివారు. ఎక్కువగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు నాయకత్వం వహించారు. తరువాతి క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. వరంగల్ కాలేజీల్లోనే ఆయనపై ఎక్కువగా విప్లవోద్యమ ప్రభావం పడింది, ఓ దశలో దండకారణ్య జోనల్ కార్యదర్శిగా రూపేశ్ పేరిట వ్యవహరించినప్పుడు ఆయన నిర్వహించిన దాడులు సంచలనాత్మకం అయ్యాయి.
999లో ఐపిఎస్ ఉమేశ్ చంద్ర , మరుసటి సంవత్సరం హోం మంత్రి మాధవరెడ్డి హత్య ఘటనల ప్రధాన వ్యూహకర్తగా , ప్రత్యేకించి జిలెటిన్ల ద్వారా పేలుళ్లకు దిగడంతో మెరుపుదాడుల కర్తగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అంతకు ముందు నేదురుమల్లి జనార్దన రెడ్డిలపై భారీ స్థాయి పోలీసు బందోబస్తు , అత్యంత నిశిత నిఘా నడుమ కూడా బాంబులు పేల్చి హత్యాయత్నం జరిగిన ఘటనల్లో కూడా ఆశన్నదే కీలక పాత్ర అని నిర్థారణ అయింది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఆశన్న కోసం భద్రతాబలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇటివలికాలంలో మావోయిస్టుల్లో తనకు పైన ఉండే అగ్రస్థాయి నాయకుల వైఖరితో విసిగి వేసారి ఆయన సరెండర్‌కు నిర్ణయించుకున్నట్లు, ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో అణచివేతలు, పైగా తనకు కొన్ని వర్గాల నుంచి అందిన లొంగుబాటు దౌత్యం దశలోనే ఆయన ఇప్పుడు అదునుచూసుకుని ఇతరులతో పాటు లొంగుబాటుకు దిగినట్లు వెల్లడైంది.