మన తెలంగాణ/హైదరాబాద్ : లిక్కర్ దందా, అవినీతి, దోపిడీలకు కల్వకుంట్ల కుటుంబం పేటెంట్ అని, రాజకీయ పబ్బం గడిపేందుకు కెటిఆర్ ఆరాటపడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ విఆర్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పం దించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నా యకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై పరువు నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. కెటిఆర్ రాజకీయ రంగు పులుముతూ పబ్బం గడుపుతున్నారని, కెటిఆర్ మతిస్థిమితి ఉండే మాట్లాడుతున్నార అని ఆయన ప్ర శ్నించారు. నా చరిత్ర కెటిఆర్‌కు తెలియదా అని ఆయన పేర్కొన్నారు. ఓడిపోయి పదవి ఇస్తానన్న వద్దన్నానని సొంత ఖర్చులతో పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడినా వ్యక్తినని ఆయన గుర్తు చేశారు. శవాల మీద పే లాలు ఏరుకున్న చందంగా అమరుల త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చారని ఆయన బిఆర్‌ఎస్‌పై ధ్వజమొత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నిక లబ్ధికోసం బిఆర్‌ఎస్ నాయకులు బట్టకాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. ఎన్నిక ఏదైనా బిఆర్‌ఎస్‌కు పుట్టగతి ఉండదని, మసిపూసి మారేడుకాయ చేసే బిఆర్‌ఎస్ నైజాన్ని ప్రజలు పసిగట్టారని మంత్రి జూపల్లి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష రూపాయలకు కారు అమ్ముకునే స్థాయి నుంచి నేడు వేల కోట్లకు పడగలెత్తిన బిఆర్‌ఎస్ నాయకులు తనను, సిఎం రేవంత్‌ను వేలు ఎత్తి చూపే స్థాయికి ఎదిగారా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. సొంత చెల్లి లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే ఢిల్లీలో బిజెపి పార్టీ వద్ద మోకరిల్లి మీరు చేసిన పని ప్రజలకు తెలియదా అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
అధికారిగా విధులు నిర్వర్తించడంలో రిజ్వీ విఫలం
సంపాదన కోసం తాను ఏనాడు ఆశ పడలేదని, ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడటం మంత్రిగా తన బాధ్యత అని జూపల్లి తెలిపారు. అధికారిగా విధులు నిర్వర్తించడంలో రిజ్వీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రిజ్వీ విఆర్‌ఎస్‌ను ఆమోదించ వద్దని తాను సిఎస్‌కు లేఖ రాసిన విషయం నిజమేనని మంత్రి జూపల్లి ఒప్పుకున్నారు.
హోలోగ్రాం టెండర్‌లను పిలవడంలో రిజ్వీ అలసత్వం
ఆబ్కారీ శాఖలో హోలోగ్రాంకు సంబంధించి 2014లో ఒక కంపెనీకి అనుమతి ఇచ్చిందని మంత్రి జూపల్లి తెలిపారు. 2014 నుంచి 2019 వరకు అదే అగ్రిమెంట్‌ను పొడిగించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైతం ఇదే విధంగా కొనసాగుతుండంటలో ఆ కంపెనీని మార్చాలని, ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశానని మంత్రి జూపల్లి తెలిపారు. ఇలా అగ్రిమెంట్ పొడిగించడంతో ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు నష్టం వస్తుందని, దీంతో పలుమార్లు హోలోగ్రాంకు సంబంధించి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి జూపల్లి తెలిపారు. దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హోలోగ్రాం, నకిలీ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందని, దీంతో వాటిని పరిష్కరించాలని రిజ్వీని ఆదేశించానని మంత్రి జూపల్లి తెలిపారు. అయినా రిజ్వీ ఈ విషయంలో స్పందించలేదని, విధుల్లో నిర్లక్షం వహించారని మంత్రి జూపల్లి ఆరోపించారు.
రిజ్వీ ఆలస్యంతో ప్రభుత్వానికి రూ.230 కోట్ల నష్టం
దీంతో పాటుగా డిస్టిలరీ పాలసీలపై సంబంధిత మంత్రికి అధికారం ఉంటుందని, డిస్టిలరీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ సమకూరుతుందని సదరు ఫ్యాక్టరీలకు సంబంధించిన ఫైల్ వెంటనే పెట్టాలని రిజ్వీని ఆదేశిస్తే దానిపై ఆయన కొన్నినెలల పాటు ఆలస్యం చేశారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆ ఫైల్‌ను కేబినెట్‌కు పంపారని, మీరు కూడా పంపాలని రిజ్వీ తనకు సూచించారని, అయితే గత ప్రభుత్వ కేబినెట్‌లో ఉన్న ఫైళ్ల వివరాలు తాను అడిగానని వాటికి సంబంధించిన సమాచారాన్ని రిజ్వీ ఇవ్వకపోగా ప్రభుత్వాన్ని, తనను తప్పుదారి పట్టించారని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు బార్ లీజు లైసెన్స్‌ల పొడిగింపు ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ.230 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. అధికారులు విధులు నిర్వర్తించకుండా అడ్డుపడితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రికి ఉంటుందని ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సిఎస్‌కు లేఖ రాశానని మంత్రి స్పష్టం చేశారు.