51 కోట్ల మంది ఓటర్ల హక్కు నిర్థారణ ప్రక్రియ
తమిళనాడు, కేరళ , పశ్చిమ బెంగాల్‌లో వడబోతలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితాల విడుదల
పారదర్శకత, అక్రమవలసదార్ల ఆటకట్టుకే
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఓటర్ల జాబితా సవరణ (సర్) నెండో దశ చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సర్వంసమాయత్తం అయింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ సర్ బృహత్ విన్యాసం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) జ్ఞానేష్ కుమార్ సోమవారం తెలిపారు. నిర్ణీత ప్రకటన మేరకు ఆయన ఈరోజు సర్‌పై వివరణకు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీహార్ సర్ తరువాత జరిగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇదే. ఇప్పుడు జరిగే రెండో దశ సర్‌లో భాగంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్ , గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్‌ల్లో ఓటర్ల జాబితా వవరణలు జరుగుతాయి.
ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. వీటిలో సర్ ప్రక్రియ పట్ల ఇప్పటికే తమిళనాడు, బెంగాల్ సిఎంలు తమ వ్యతిరేకత, తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడిగా ప్రకటిస్తారని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాల పారదర్శకతనే కీలకం. న్యాయంగా ఓటు హక్కు పొందే వారికి భరోసాగా ఉండేందుకు ఈ ప్రక్రియ అని తేల్చి చెప్పారు. రెండో దశ సర్ ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీన ఆరంభం అవుతుంది. ముందుగా ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఇది డిసెంబర్ 4 దాకా ఉంటుంది. తరువాత అదే నెల 9న ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను వెలువరిస్తుంది. అభ్యంతరాలు, ఇతరత్రా విషయాలను పరిగణనలోకి తీసుకున్నతరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన తుది ఎన్నికల ఓటర్ల జాబితాలు (ఎఫ్‌ఇఆర్)లు విడుదల చేస్తారని సిఇసి చెప్పారు.
ఇక అసోంకు సంబంధించి ప్రత్యేకంగా పౌరసత్వ చట్టం నిబంధన వర్తింపచేస్తారని తెలిపారు. అక్కడున్న పౌరసత్వ చట్టం పరిధిలో రెండు రకాల నిబంధనలు అవసరం ఏర్పడింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణ క్రమంలోనే అక్కడ పౌరసత్వ తనిఖీలు పూర్తి చేస్తారు. ఈ పరిధిలోనే అక్కడ సర్ ఉంటుంది. ఇంతకు ముందటి సర్ ఆదేశాలు మొత్తం దేశానికి సంబంధించినవని వెల్లడించారు. అస్సాంకు సంబంధించి విడిగా సర్ తేదీలను ప్రకటిస్తారు. ఇంతకు ముందు దేశంలో ఓటర్ల జాబితా సవరణలు 20022004 మధ్యలో జరిగాయి. ఇక స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే ఇది తొమ్మిదవ సర్ ప్రక్రియ అవుతుంది.
581 కోట్ల మంది ఓట్ల ఖరారు ప్రక్రియ
ఇప్పుడు చేపట్టే సర్ రెండవ దశ పరిధిలో దేశంలో మొత్తం మీద 51 కోట్ల మంది ఓటర్ల సంబంధిత ఓటు హక్కు ఖరారు ప్రక్రియగా నిలుస్తుంది. ఇందులో ప్రధానమైన ఘట్టం ఓటర్ల లెక్కింపు అంశం. ప్రాంతాల వారిగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అనేది ఆరాతీయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్లి వివరాలను తెలుసుకుంటారు. తమకు బెంగాల్ లేదా తమిళనాడు ప్రభుత్వంతో ఎటువంటి తగవు లేదని సిఇసి స్పష్టం చేశారు. అక్కడ మమత బెనర్జీ సారధ్యపు టిఎంసి సర్ అనుచితం అని, దీనితో కొన్నివర్గాల ఓట్లు గల్లంతు అవుతాయని పేర్కొంటోంది, ఇదే వాదనను ఒక్కరోజు క్రితం తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా ప్రస్తావించారు.
సర్‌కు సిబ్బంది కల్పన బాధ్యత రాష్ట్రాలదే
రాష్ట్ర ప్రభుత్వాలే విధిగా సర్ కోసం అయినా ఎన్నికల నిర్వహణకు అయినా తగు విధంగా ఉద్యోగులను తమకు కేటాయించాల్సి ఉంటుందని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అక్కడ సర్ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ వస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. అక్కడ ఇప్పటికైతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని బదులిచ్చారు. వివాదాస్పదమైన బీహార్ సర్ విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు.
ఇది కొందరు అనుకుంటున్నట్లు వివాదాస్పదం కాదు. అంతా పారదర్శకం అన్నారు. అక్కడ ఓటర్ల జాబితాల సవరణ లేదా ప్రక్షాళన పూర్తి అయింది. ముందుగా చేయాల్సిన సమీక్షలన్ని చేసిన తరువాత తుది జాబితా వెలువరించాం. ఈ మేరకు అక్కడ దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే నెలలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఈ జాబితా పరిధిలోనే జరుగుతాయని వివరించారు. రెండుదశల ఎన్నికలు నవంబర్ 4, నవంబర్ 11 తేదీల్లో జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి.
ఇప్పటి సర్ విజయవంతానికి తాము రెండు దశల్లో రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో సమావేశాలు నిర్వహించామని, వారికి ఈ విషయంలో సమాయత్తానికి ఆదేశించామని సిఇసి తెలిపారు. వారి నుంచి తగు స్పందన ఉందన్నారు. సర్ ప్రధాన ఉద్ధేశం విదేశీ అక్రమ వలసదార్లు జాబితాల్లో చేరకుండా చేసేందుకు. ఇక వారి పుట్టిన స్థలాల తనిఖీలు నిర్వహించడం, అక్రమ వలసదార్ల ఆటకట్టుకు పలు రాష్ట్రాలు తీసుకుంటున్న వేగవంతం అయిన పటిష్ట చర్యల నేపథ్యంలో సర్ ప్రక్రియ కీలకం అవుతుందని జ్ఞానేష్ కుమార్ వివరించారు.