బీహార్‌లో నేడు రెండోదశ పోలింగ్
పాట్నా : బీహార్‌లో మంగళవారం (నవంబరు 11)జరగనున్న రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరగ్గా, మిగతా 122 స్థానాలకు రెండవ, తుది దశ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాల్లో 40,173 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 1302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.7 కోట్ల ఓటర్లు నిర్ణయించనున్నారు. తూర్పు, పశ్చిమ చంపారన్ జిల్లాలు, సీతామర్హి, మధుబని,సుపౌల్, అరేరియా, కిషన్‌గంజ్ ఈ జిల్లాల నియోజకవర్గాల్లో ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. ఈ జిల్లాలన్నీ నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి.
దాదాపు 4 లక్షల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువ జిల్లాలు ముస్లిం జనాభా అత్యథికంగా ఉన్న సీమాంచల్ రీజియన్‌లో ఉన్నాయి. ఇటు ఎన్‌డిఎకు, అటు ఇండియా కూటమికి సవాలుగా నిలిచే పోరుగా మారాయి. ఇండియా కూటమి మైనార్టీ సమాజాల మద్దతుపై ఆధారపడగా, చొరబాటుదార్లను విపక్షకూటమి ప్రోత్సహిస్తోందని ఎన్‌డిఎ ప్రచారంలో ఆరోపించింది. రాష్ట్ర కేబినెట్‌లో సీనియర్ మంత్రి, జెడి(యు) నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తన సుపౌల్ స్థానాన్ని తిరిగి ఎనిమితోసారి దక్కించుకుని రికార్డు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన సహచర మంత్రి, బీజేపీ నేత ప్రేమ్‌కుమార్ , గయటౌన్ నుంచి 1990 నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిగతా మంత్రుల్లో బీజేపీ కి చెందిన రేణుదేవి (బెట్టియా), నీరజ్‌కుమార్ సింగ్ “బబ్లు”(ఛాటపూర్), జెడి(యు)కు చెందిన లెషి సింగ్ (ధండహా) , షీలా మండల్ (ఫుల్‌పరస్), జమఖాన్ (’చైన్‌పూర్ ) పోటీలో ఉన్నారు. బీజేపీకి చెందిన మరో ప్రముఖ నేత , మాజీ డిప్యూటీ సిఎం టర్కిషోర్ ప్రసాద్, కథియార్ నుంచి ఐదో సారి కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షతో ఉన్నారు. కథియార్ జిల్లాల్లో బలరాంపూర్, కద్వా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన మెహబూబ్ ఆలం, షకీల్ అహ్మద్ ఖాన్ క్రమంగా హాట్‌ట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ రెండవ , తుది దశ పోలింగ్ మైనర్ ఎన్‌డిఎ భాగస్వాములైన హిందుస్థాన్ అవాం మోర్చా ( హెచ్‌ఎఎం) అధినేత , కేంద్ర మంత్రి జితన్ రామ్ మంఝీ, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా కు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చాలకు అగ్నిపరీక్ష కానుంది. ఈ రెండు పార్టీలకు చెరో ఆరు స్థానాలున్నాయి. హెచ్‌ఎఎంకు చెందిన ఆరుస్థానాలు ఈ రెండోదశలో పోలింగ్‌కు సిద్ధం అయ్యాయి. వీటిలో నాలుగు ఇమంగంజి, బారాఛట్టి, టికారి, సికంద్ర స్థానాలకు సిటింగ్ ఎమెఎల్‌ఎలే పోటీలో ఉన్నారు. గత ఏడాది గయ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన వరకు మాంఝీ ఇమాంగంజి స్థానం నుంచే ప్రాతినిథ్యం వహించేవారు.
ఉప ఎన్నికలో ఈ స్థానం తిరిగి ఆయన కోడలు దీపాకు దక్కింది. బారాఛట్టి స్తానం నుంచి దీపా తల్లి జ్యోతిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రీయ లోక్‌మార్చ్ అభ్యర్థులకు కుష్వాహా భార్యస్నేహలత, ఆయన విశ్వసనీయ సహచరుడు మాధవ్ ఆనంద్‌తోసహా ఎవరికీ రాష్ట్ర కేబినెట్‌లో రెండేళ్ల క్రితం వరకు ఎలాంటి చోటు దక్కలేదు. ససరాం, మధుబని నుంచి వారు అరంగేట్రం చేశారు. పార్టీ రంగం లోకి దింపిన ఆరుగురిలో నలుగురు రెండోదశలో పోటీలో ఉన్నారు. మరో ముఖ్యమైన అభ్యర్థి , రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ , తన రిజర్వుడ్ కుటుంబ స్థానాన్ని వరుసగా రెండోసారి సాధించగలనన్న ఆశతో ఉన్నారు.
ఫిరాయింపుదారులు కూడా…
ఎన్నికల బరిలో పార్టీల ఫిరాయింపుదారులు కూడా ఉన్నారు. 2020లో ఆర్‌జెడి అభ్యర్థిగా గెలిచిన మొహనియా ఎంఎల్‌ఎ సంగీత కుమారి, ఇప్పుడు బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. నవడా ఎంఎల్‌ఎల విభాదేవి ఇటీవలనే విపక్షం నుంచి బయటపడి జెడి (యు) లో చేరారు. మహాఘఠ్ బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తరఫున మంత్రిగా పనిచేసిన మురారి గౌతమ్ గత ఏడాది నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్‌డిఎ లో చేరారు. ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థిగా లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థిగా తన స్థానం చెనారి నుంచి పోటీ చేస్తున్నారు.
ఎన్నికల ముందు ఆర్‌జేడిలో చేరిన చాణక్యప్రసాద్ ఇప్పుడు విపక్ష పార్టీ చిహ్నంతో బెల్‌హర్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 1.75 కోట్లలో సగానికి సగం మంది 30 నుంచి 60 ఏళ్ల లోపు వారు కాగా, 7.69 లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల గ్రూపు వారు. నవడా జిల్లా లోని హిసుయా స్థానంలో 3.67 లక్షల సంఖ్యలో భారీ ఎత్తున ఓటర్లు ఉన్నారు. లారియా, చనపాటియా,రక్సాయుల్,త్రివేణిగంజ్,సుగౌలి, బాణముఖి స్థానాల్లో ఒక్కొక్క స్తానం నుంచి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం విశేషం. మొదటిదశలో 121 నియోజకవర్గాల నుంచి 65 శాతం వరకు పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగింది.