పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీ కీలకపాత్ర!
ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ
ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాలు
సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
డిఎన్‌ఎ పరీక్ష కోసం ఉమర్ కుటుంబీల శాంపిళ్ల సేకరణ
ఢిల్లీ కేసు ఎన్‌ఐఎకు అప్పగింత, ఉపా చట్టం కింద కేసు నమోదు
న్యూఢిల్లీ/శ్రీనగర్ : ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో ఉమర్‌కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 2900 కేజీల పేలుడు పదార్ధాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలను ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న గంటల వ్యవధిలో ఢిల్లీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పేలుడుకు ఉపయోగించిన కారు కూడా ఫరీదాబాద్ నుంచే ఢిల్లీకి రావడం మరింత బలం చేకూరుస్తోంది.
ఢిల్లీలో పేలుడుకు ఉపయోగించిన హెచ్‌ఆర్ 26సిఇ 7674 నెంబర్ కలిగిన హ్యుండయ్ ఐ20 కారును సోమవారం ఉమర్ నబీ ఒక్కడే నడిపినట్లు, ఎర్రకోటలోని పార్కింగ్ ఏరియాకు మధ్యాహ్నం 3.19 గంటలకు వచ్చినట్టు గుర్తించారు. పేలుడు జరిగింది సాయంత్రం 6.52గంటలకు అంటే సుమారు 3గంటలకుపైగా ఉమర్ మాస్క్ ధరించి కారులోనే ఉన్నట్లు సిసిటివి ఫుటేజీలను బట్టి అర్థమవుతోంది. అయితే రద్దీ సమయంలో పేలుడుకు పాల్పడేందుకు అంతసేపు వేచిచూశాడా, లేకపోతే ఎవరి నుంచైనా ఆదేశాల కోసం ఎదురుచూశాడా అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోటతో పాటు దాని చుట్టుపక్కల సిసిటివి ఫుటేజీలను కూడా విశ్లేషిస్తున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి.
ఆ 11 గంటల ప్రయాణం…
పోలీసులు విచారణ క్రమంలో బదర్‌పూర్ అనే టోల్‌ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్‌లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్‌పూర్ టోల్‌ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్‌ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
డిఎన్‌ఎ నమూనాల సేకరణ…
పేలుడు ఘటనలో ఉమర్ నబీ కూడా మరణించినట్లు దాదాపు నిర్ధారించుకున్న దర్యాప్తు బృందాలు జమ్మూ కశ్మీర్‌లో పోలీసులను అప్రమత్తం చేశాయి. పుల్వామాలో కోయిల్ అనే గ్రామానికి హుటాహుటిన తరలివెళ్లాయి. అతని తల్లితో పాటు ఇద్దరు సోదరుల నుంచి డిఎన్‌ఎ పరీక్షల కోసం నమూనాలు సేకరించాయి. ఢిల్లీ పేలుడు స్థలి నుంచి సేకరించిన మృతదేహాల్లోని ఏదేని నమూనాతో వారి డిఎన్‌ఎ సరిపోలితే కేసు దర్యాప్తు కొలిక్కి వస్తుందని శ్రీనగర్‌కు చెందిన పోలీసు అధికారి వెల్లడించారు. ఇక ఉమర్ తండ్రి గులాం నబీ భట్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అదే సమయంలో కారు అమ్మకం, కొనుగోలుతో ంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఎన్‌ఐఎకు అప్పగింత.. ఉపా కింద కేసులు
ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం. సాధారణంగా ఉగ్రవాద సంబంధిత కేసులను ఎన్‌ఐఎ విచారణ చేపడుతూ ఉంటుంది. మరోవైపు ఈ ఘటనపై ఉపా, పేలుడు పదార్థాల చట్టం కింద ఢిల్లీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తు క్రమంలో ఢిల్లీ పోలీసులు అడుగడునా జల్లెడ పడుతున్నారు. అనుమానితుల కోసం వేట ముమ్మరం చేశారు. అదే సమయంలో ఫరీదాబాద్‌లోని అల్‌ఫలాహ్ విశ్వవిద్యాలయంపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వైద్య అధ్యాపకులు, వైద్యులు పలువురు ఉగ్రవాద నెట్‌వర్క్‌లో పాలుపంచుకున్నట్లు ఇటీవలి అరెస్ట్‌లతో తేటతెల్లం కావడం తెలిసిందే.