మధుర: యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా మంగళవారం తెల్లవారుజా మున 4.30గంటల ప్రాంతంలో ఎనిమిది బస్సు లు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగి 13మంది కాలిన గా యాలతో మృతి చెందారు. 43మంది గాయపడ్డా రు. బలదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రానొయిడా వైపు యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద దట్టమైన పొగమంచు వల్ల వాహనా లు ఒకదానినొకటి ఢీకొన్నాయని దీంతో మంటలు చెలరేగి, బస్సులు, కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ష్లోక్ కుమార్ తెలిపారు. మృతుల్లో గుర్తించిన ఇద్దరిలో ఒకరు ప్రయాగ్ రాజ్‌కు చెందిన 44 ఏళ్ల అఖిలేంద్ర ప్రతాప్ కాగా, మరొకరు మహరాజ్‌గంజ్ జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్‌పాల్ అని బలదేవ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ రంజన సచన్ చెప్పారు. మూడో వ్యక్తి గోండా జిల్లాకు చెందిన 62 ఏళ్ల సుల్తాన్ అహ్మద్‌గా బృందావన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గుర్తించారు.
కాలిన బస్సులు, కార్లు శిథిలాలుగా మారాయి.రోడ్డుపై నుంచి వీటిని తొలగించడానికి క్రేన్లను రప్పించారు. కాలిన మృతదేహాల డిఎన్‌ఎను భద్రపరిచామని, సంబంధిత కుటుంబీకులు వస్తే వారితో పోల్చి పరీక్షిస్తామని, ఇంతవరకు గుర్తించిన ముగ్గురి మృతుల బంధువులకు తెలియజేస్తున్నామని ష్లోక్ కుమార్ వివరించారు. గుర్తించిన ముగ్గురి మృతుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్ చెప్పారు. ఈప్రమాదంపై దర్యాప్తునకు నలుగురితో బృందాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించ వలసి ఉంది. ఇంకా గుర్తించని డ్రైవర్‌పై బలదేవ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్‌ఎస్‌పి తెలిపారు. మృతదేహాల పోస్ట్‌మార్టమ్‌కు, డిఎన్‌ఎ నమూనాల సేకరణకు, రెండు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆగ్రా లోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం వైద్య చికిత్స కోసం 43 మందిని బృందావన్ లోని జాయింట్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తీసుకురావడమైందని సిఎంఒ తెలిపారు.
యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ముఖ్యమంత్రి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.
పొగమంచుతో మరికొన్ని ప్రమాదాలు
హర్యానా లోని సోనిపట్, నూహ్ జిల్లాల్లో పొగమంచు కారణంగా సోమవారం రోడ్డు ప్రమాదాలు సంభవించి ఇద్దరు పోలీసు అధికారులతో సహా ముగ్గురు మృతి చెందారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలు ఢీకొని సిఐఎస్‌ఎఫ్‌ఇన్‌స్పెక్టర్‌తోసహా ఇద్దరు చనిపోయారు. సోనిపట్‌లో మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తాను ప్రయాణిస్తున్న కారుకు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు.
విమానాల రాకపోకలపై ప్రభావం
వాయు కాలుష్యంతోపాటు దట్టంగా పొగమంచు కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే పలు విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చని, ప్రయాణికులకు సహాయం అందించేందుకు తమ సిబ్బంది అన్ని టెర్మినల్స్‌లో అందుబాటులో ఉన్నారని పేర్కొంది.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే పెట్రోల్ బంద్.. ఢిల్లీ సర్కారు నిర్ణయం
దట్టమైన పొగమంచు రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్యంపై యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా డిసెంబర్ 18 నుంచి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (పియుసి) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా
చేయబడదని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. అంతేకాకుండా బిఎస్6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సేవల్లో లేని ట్రక్కులు, వాణిజ్య వాహనాలకు నగరంలో ప్రవేశం నిరాకరిస్తారు. ల్యాండ్‌ఫిల్ సైట్‌ల ఎత్తును 15 మీటర్లు తగ్గించామని, సుమారు 8 వేల పరిశ్రమలను కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనల కింద తీసుకు వచ్చామన్నారు. కాలుష్యానికి పాల్పడిన పరిశ్రమలకు రూ. 9 కోట్ల జరిమానా విధించామని చెప్పారు.
ప్రజలకు క్షమాపణలు
తొమ్మిది,పది నెలల్లో ఢిల్లీలో కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదని మంత్రి అంగీకరిస్తూ ఈ విషయంలో ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రోజువారీ గాలి నాణ్యత సూచీ తగ్గించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.