న్యూఢిల్లీ: ఇండిగో విమాన యాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రమ్మోహన్ నాయుడు శుక్రవారం అన్నారు. ఇం డిగో విమానాల రద్దు, విమానాల రాకపోకల జాప్యం నివారణకు, కొత్త విమాన డ్యూటీ నిబంధనలను పక్కన పెట్టామని, వివిధ కార్యాచరణ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా వందలాది ఇండిగో విమానాల రద్దు, జాప్యానికి దారితీసిన కారణాలు కనిపెట్టి, జవాబుదారీ ఎవరద్దని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించేందుకు నిర్ణయించింది. విమానాల షెడ్యూల్ లో, ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల షెడ్యూల్ లో కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అత్యవసర చర్యలు చేపట్టినట్లు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) నిర్దేశించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్ డిటిఎల్) ఆదేశాలను తక్షణమే నిలిపివేశారు. విమాన భద్రత విషయంలో రాజీ పడకుండా, ముఖ్యంగా విమాన ప్రయాణంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు, ఇతర పౌరుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పౌర విమానయాన శాఖమంత్రి ఆదేశాలతో విమాన సర్వీసులు వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు మొదలయ్యాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇండిగో పైలట్ల విధుల నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ : స్వదేశీ సంస్థ ఇండిగో విమాన సర్వీసుల గందరగోళంతో వేలాది మంది ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఇండిగోకు ఊరట కలిగించేలా పైలట్ల విధుల నిబంధనలను సవరించింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచగా, ఇప్పుడు ఈ విశ్రాంతి సమయాన్ని సెలవుగా పరిగణించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు ఈ వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండిగో సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ నిబంధనను ఇండిగో అభ్యర్థనపై సడలించారు. పైలట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ రాత్రి షిఫ్టులు చేయకూడదనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఇండిగో సంస్థ పైలట్లు వారంలో ఆరు నైట్‌డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.న అంతేగాక, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది.
ఇదంతా ప్రభుత్వ గుత్తాధిపత్య ఫలితమే : రాహుల్
న్యూఢిల్లీ : ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోసారి సాధారణ పౌరులో ఈ నిస్సహాయతకు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకాకుండా ఉండేలా విమానయాన రంగంతోసహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలని ,అంతేతప్పమ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదంటూ మండిపడ్డారు . కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్‌ఖేరా విమానాశ్రయాల్లో ఈరోజు గుత్తాధిపత్యమే జరుగుతోందన్నారు. ఇద్దరు వ్యక్తులు పార్టీని నడిపిస్తారు. ఇద్దరు ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఇద్దరు వాణిజ్యాన్ని నిర్వహిస్తారు. అందువల్ల ఏం జరుగుతుంది ? అని ప్రశ్నించారు. ‘విమానయాన రంగంలో 92 శాతం వాటా కేవలం రెండు కంపెనీల ఇండిగో, టాటా చేతుల్లో ఉంది. ప్రభుత్వం వారి ముందు మోకరిల్లుతోంది. ఈ కంపెనీల ఒత్తిడి వల్ల నూతన ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు వదులుకోవలసి వస్తుంది ’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దేశం మొత్తం మీద చాలా సంస్థలు కేవలం కొంతమంది చేతుల్లో ఉంటున్నాయని , అదే ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒకప్పుడు పోటీ ఉండే ఈ పరిశ్రమను కేవలం ఇద్దరి వరకే పరిమితం అయ్యేలా మోడీ ప్రభుత్వం దిగజార్చిందని విమర్శించారు.