రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు ఎటువంటి గడువులు విధించలేమని సుప్రీంకోర్టు గురువారంనాడు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడం పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు వివరాణాత్మక సమాధా నం ఇచ్చింది. సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో, గవర్నర్లు ఆర్టికల్ 200 కింద వారికి ఇచ్చి న అధికారాల పరిధిని మించి బిల్లులపై సుదీర్ఘకాలం పాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండలేరని కూడా తీర్పుని చ్చింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసే అధికారం గవర్నర్ల కు ఉందని కూడా తాము భావించడం లే దని ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవా య్, నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్‌నాథ్, పి.ఎస్. నరసింహ, ఎఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో గవర్నర్లకు సమయపాలన నిర్ణయించడం రాజ్యాంగం అందించిన అధికారాలకు విరుద్ధమని కూడా ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు మూడు ఆప్షన్లు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అన్నారు.అవి 1.అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపడం, 2. బిల్లులను రాష్ట్రపతికి సూచించడం 3. అనుమతిని నిలిపివేసి వాటికి తన వ్యాఖ్యలతో అసెంబ్లీకి తిరిగి పంపడం అని పేర్కొన్నారు. ఈ మూడు ఆఫ్షన్లలో దేనినైనా ఎన్నుకునేందుకు గవర్నర్ కు విచక్షణాధికారం ఉందని, అందుకు న్యాయస్థానాలు గడువు విధించడం సబబు కాదని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా నిర్దేశించిన కాలపరిమితులు, గవర్నర్ అధికారాన్ని వినియోగించే విధానం లేనప్పుడు ఆర్టికల్ 200కింద అధికారాలను వినియోగించాలని ఈ కోర్టు న్యాయపరంగా సూచించడం సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని విచారించిన జస్టిస్ జె.బి. పార్ధివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్ లో గవర్నర్లు, రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీ లు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు మూడు నెలల వ్యవధిని నిర్ణయించింది.
ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 కీలకమైన ప్రశ్నలపై చర్చించడానికి సుప్రీం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అంగీకరించింది. అరుదుగా ఉపయోగించే ఆర్టికల్ 132(1)కింద తన అధికారాలను వినియోగించుకుంటూ, ప్రజా ప్రాముఖ్యత గల అంశాల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం సముచితమని భావించినట్లు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగ అధికారాల వినియోగం, రాష్ట్రపతి లేదా గవర్నర్ ల ఆదేశాలను ఆర్టికల్ 143 కింద ఏ విధంగానూ కాదనలేమని గురువారం ధర్మాసనం వివరించింది. ఏ కేసులోనైనా పూర్తి న్యాయం చేయడానికి ఏదైనా ఆదేశాన్ని జారీ చేయడానికి ఆర్టికల్ 142 అత్యున్నత న్యాయస్థానానికి అపారమైన అధికారాన్ని ఇస్తుందని పేర్కొంది. గవర్నర్ల విధుల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోబోవు. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలం బిల్లులను పెండింగ్ లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత వివక్షతతో వ్యవహించవచ్చు నని, రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ఆర్టికల్ 361ని ప్రస్తావిస్తూ, గవర్నర్ ను వ్యక్తిగతంగా న్యాయపరమైన చర్యలకు గురిచేయడానికి సంబంధించి, న్యాయ సమీక్షపై సంపూర్ణ నిషేధం ఉందని కోర్టు పేర్కొంది.





