తీర్ధయాత్రలకు బయలుదేరిన పలువురు వ్యక్తులు కానరానిలోకాలకు వెళ్లిన విషాద సంఘటన భద్రాచలం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామారాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకోవడానికి భద్రాద్రికి వస్తుండగా చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరగిన ఘోర ప్రమాదంలో 9 మంది భక్తులు మృతి చెందగా మరో 21 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన 37 మంది (ఇద్దరు డ్రైవర్లతోసహా) యాత్రికుల బృందం ప్రయివేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని చివరగా అరకు, సింహచలం అప్పనస్వామిని దర్శించుకొని భద్రాచలం వస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామారాజు జిల్లా, చింతూరు మండల కేంద్రానికి 21 కిలోమీటర్ల దూరంలో చింతూరు- మారేడుమిల్లి రోడ్‌లో ఉన్న చైనా వాల్ అని పేర్కొనే ఘాట్ రోడ్డు నుంచి కింద బస్సు మూడు పల్టీలు కొట్టి బోల్తాకొట్టింది.
ఈ ప్రమాదం 9 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 21 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరుగగా బాహ్య ప్రపంచానికి ఆ సమాచారం చేరేసరికి ఉదయం ఐదు గంటలైంది. విషయం తెలుసుకున్న చింతూరు పోలీసులు 108 సహా సాయంతో క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ 21 మందిలో ముగ్గురు మినహా మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో శైలా రాణి (64)తెనాలి, శ్యామల (50) -తిరుపతి , సునంద (50)- పలమనేరు, శివశంకర్ రెడ్డి (52), ఎస్వీ నాగేశ్వరరావు (50)- చిత్తూరు, కావేరి కృష్ణ (55) -రామాలయంనగర్, బెంగళూరు, శీకళ (62)- గిరింపేట చిత్తూరు, దొరబాబు (55) -ముర్గంపేట చిత్తూరు, కృష్ణకుమారి (50) -కెఆర్ పురం, బెంగళూరు మృతి చెందారు.ఈ ప్రమాద స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి,
రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి చింతూరు ఏరియా ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి, ఎస్‌టి కమిషన్ రాష్ట్ర చైర్మన్ బుజ్జి రెడ్డి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దన్ తదితరులు క్షతగాత్రులను పరామర్శించారు. పాడేరు జిల్లా కలెక్టరేట్‌తో పాటు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు మృతదేహాలకు పంచనామాలు నిర్వహించి ఐదు అంబులెన్స్‌లలో మృతదేహాలను చిత్తూరుకు పంపించారు. శుక్రవారం రాత్రి వరకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నౌక్వాల్, వైద్యాధికారులు పోలీస్ అధికారులు పరిస్థితి సమీక్షించి క్షతగాత్రులు అందర్నీ మరో బస్సు ఏర్పాటు చేసి చిత్తూరుకు తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా, బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి రూ.రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియాను హోం మంత్రి అనిత ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు మరో రెండు లక్షల రూపాయలు,
క్షతగాత్రులకు రూ.50 వేలు కూడా చెల్లిస్తామని పకటించారు. బాధితులు అందరికీ ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని విలేఖర్లకు తెలిపారు. కాగా, ఈ బస్సు ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైన ఆదేశాలను జారీ చేశారు