టాస్ వేయడమే కాదు.. ఆ పని చేయాలి: మాజీ ఓపెనర్
టీం ఇండియా టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సూర్య కనీసం అర్థ శతకం సాధించి చాలాకాలమే అయింది. దీంతో అతడిపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ అంటే కేవలం టాస్ వేయడమే కాదు అని ఆకాశ్ అన్నాడు. ‘‘కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం. బౌలర్లతో ఓవర్లు వేయించడం. వ్యూహాలు రూపొందించడమే కాదు. టాప్-4లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయడం కూడా ప్రధాన బాధ్యతే. సూర్యకుమార్ కొన్ని నెలలుగా చాలా మ్యాచుల్లో రాణించలేదు. 17 ఇన్నింగ్స్‌లో యావరేజ్ కేవలం 14 మాత్రమే. స్ట్రైక్‌రేటు కూడా బాగా లేదు. ఒక్కసారి కూడా అర్థ శతకం చేయలేదు. రెండుసార్లు మాత్రమే 25కి పైగా స్కోర్ చేశాడు’’ అని ఆకాశ్ విమర్శించాడు.
అయితే 2026 టి-20 ప్రపంచకప్‌కి ముందు కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు.. వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా ఫామ్ కోల్పోవడం భారత్‌కు మంచి సంకేతం కాదని ఆకాశ్ పేర్కొన్నాడు. మూడు లేదా నాలుగో స్థానంలో ఆడుతూ నిలకడగా పరుగులు చేయకపోతే.. ప్రపంచకప్ మొదలైనప్పుడు వాళ్లకి అంత నమ్మకంగా ఉండదు అని తెలిపాడు. కెప్టెన్ సూర్య కుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరుగులు చేయడం చాలా అవసరమని ఆకాశ్ విశ్లేషించాడు.