ఆత్మవిశ్వాసంతో టీమిండియా
గెలుపే లక్షంగా ఆస్ట్రేలియా
నేడు తొలి వన్డే
పెర్త్: ఆసియా కప్ గెలుచుకుని జోరుమీదున్న టీమిండియా మరో సమరానికి సిద్ధం అయ్యింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. అందులో భాగంగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వన్డే సారథిగా శుభ్‌మన్ గిల్‌కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఏడు నెలల అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో అందరి చూపూ మాజీ కెప్టెన్ రోహిత్, కోహ్లీ మీదే ఉంది. 2027 ఐసిసి వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కెప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం అతనిపై మరింత ఉండే అవకాశం లేకపోలేదు.
ఈ మూడు మ్యాచ్‌లలో ఏ మాత్రం రాణించకపోయినా వారి కేరీర్‌కు ఎండ్ కార్డు పడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 50 ఓవర్ల ఫార్మట్ లో సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్‌లో దిగడం ఇదే తొలిసారి కూడా. స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా భావించే నంబర్ 4 స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగొచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ దళాన్ని మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడపాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి మొదటి వన్డే మ్యాచ్‌లో ఆడొవచ్చు.
ఆస్ట్రేలియాకు గాయాల బెడదా..
మరోవైపు- మిచెల్ మార్ష్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఆస్ట్రేలియా.. టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. గాయాలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మాట్ రెన్‌షా, మిచ్ ఓవెన్ మిడిల్ ఆర్డర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. జోష్ ఫిలిప్ 2021 తర్వాత తన తొలి వన్డే ఆడనున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్ కూడా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. స్వదేశంలో ఇదే అతనికి తొలి మ్యాచ్. అయినా వారు దేశవాళీలో రాణించిన అనుభవం లేకపోలేదు. ట్రావీస్ హెడ్, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, మాట్ రెన్షా, జోష్ ఫిలిప్, మిఛెల్ ఓవెన్ వంటి బ్యాటర్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. మిఛెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాట్ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం సయితం ప్రమాదకరంగా ఉంది. దీంతో ఆసీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక, వారికి సొంత గడ్డ, సొంతం మైదానం కాబట్టి వానికి కలిసొచ్చే అవకాశాలూ ఉన్నాయి.