క్వీన్స్‌లాండ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్‌లాండ్ వేదికగా కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. తొలి టి20 వర్షార్పణం అయ్యింది. రెండో పోటీలో ఆస్ట్రేలియా, మూడో టి20లో టీమిండియా జయకేతనం ఎగుర వేశాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 11తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఇలాంటి స్థితిలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కిందటి టి20లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియా కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇరు జట్లలోనూప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్‌తో పాటు ఇప్పటి వరకు ఆడిన రెండు టి20 మ్యాచుల్లోనూ గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. గిల్ వరుస వైఫల్యాలు జట్టును కలవరానికి గురి చేస్తోంది. అభిషేక్ రెండో టి20లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. మూడో టి20లో బాగానే ఆడినా భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో వాషింగ్టన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయం సాధించి పెట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. జితేశ్ కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. తిలక్‌వర్మ, సూర్యకుమార్‌లు కూడా తమవంతు పాత్ర పోషిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
గెలుపే లక్షంగా..
మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్‌ను ఓడించాలనే లక్షంతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. కానీ కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మూడో టి20లో టిమ్ డేవిడ్, స్టోయినిస్, మాథ్యూ షార్ట్ తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు బ్యాట్‌ను ఝులిపించాలనే కసితో ఉన్నారు. హెడ్, మార్ష్, ఇంగ్లిస్, డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, షార్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాతో పోరు భారత్ అంత తేలికేం కాదనే చెప్పాలి.