మరింత మెరుగ్గా ఆడాల్సింది.. ఆస్ట్రేలియా సిరీస్‌లో నిరాశ పరిచిన భారత్
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌లో ఓటమి పాలైన భారత్ టి20లలో గెలిచి కాస్త ఊరట చెందింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ ౨-1తో సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి. తొలి టి20లో ఆస్ట్రేలియా గెలవగా టీమిండియా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ సిరీస్‌లో భారత్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. వన్డేల్లో, టి20లలో భారత బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారని చెప్పాలి. టి20 వరల్డ్‌కప్‌నకు కొంత సమయం మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో భారత్ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌లు టి20 సిరీస్‌లో పూర్తిగా నిరాశ పరిచారు. వీరు పేలవమైన బ్యాటింగ్‌తో తేలిపోయారు.
ముఖ్యంగా సూర్యకుమార్, శాంసన్ వైఫల్యం జట్టును కలవర పరిచే అంశమే. వరల్డ్‌కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లు శాంసన్, గిల్, సూర్యకుమార్‌ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా సిరీస్‌లో విఫలమయ్యాడు. అతను కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. రానున్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లలోనైనా వీరు తమ ఆట తీరును మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్, శాంసన్‌లు వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికైనా వీరు తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు భారత్ సొంత గడ్డపై 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు టీమిండియాకు చాలా కీలకంగా మారాయి. స్టార్ ఆటగాళ్ల ఫామ్‌ను పరిశీలించేందుకు ఈ సిరీస్‌లో దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో కూడా భారత్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. రోహిత్ శర్మ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. చివరి వన్డేలో విరాట్ కోహ్లి కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. రానున్న సిరీస్‌లలో టీమిండియా ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.