రాగాల వాగ్దేవి రావు బాలసరస్వతి
పట్టుకుచ్చుల లాంటి రెక్కలు విప్పి పైకెగరడమే పాట లక్షణం. భావమెంత బరువైనా వినేవారి గుండెల్లోకి సులువుగా దూసుకెళ్ళి కదిలించటం దాని స్వభావం. అది భావగీతమైనా, లలితగీతమైనా, జానపదమైనా, సినిమా పాటైనా, విన్న వెంటనే అందులోని భావం శ్రోతకి స్ఫురించి, పులకింపజేయడం పాట నైజం. చిన్నమాటలతో పెద్దభావాన్ని చెప్పడం పాట కుండాల్సిన ముఖ్యమైన నేర్పు. ఒకటీ రెండు కఠినమైన పదాలు కవి వాడాల్సి వచ్చినా, వాటికి బాణీ కూర్చేవారు సంగీతంలోకి వొది గేలా మలుస్తారు. అప్పుడది మెత్తగా శ్రోతకి చేరుతుంది. 1920ల తర్వాత భావకవిత్యోద్యమం వల్ల కవులందరూ అన్ని ప్రక్రియలకంటే పాట (గేయం) రచించడానికి ఉత్సా హంగా ముందుకురికారు. పద్యాలు, పద్యకావ్యాలు, నాట కాలు… ఏది వ్రాయాలని వ్రాస్తున్నా, తోచినప్పుడు ఒక పాట కూడా వ్రాస్తూ వచ్చారు. పాటంటూ వ్రాస్తే దానికి బాణీ కూర్చుకుని పాడే గాయకులు కావాలి. పాట పాడితేనే అందం… ఉత్తినే పాటలోని మాటలు చదివితే తృప్తిగా ఉండదు… అందమూ రాదు. ఒక పక్క రేడియో, మరొక పక్క గ్రామఫోను, ఇంకొక పక్క సినిమా తెలుగు పాటకి గొప్ప ఆలంబనాలయ్యాయి. ఆ సమయంలోనే గొప్ప ప్రతిభావంతులైన గాయనీగాయకులు పాటలు పాడేందుకు ముందుకొచ్చి తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు.
గ్రామఫోను కంపెనీవారు అప్పటికే క్లాసికల్ సంగీతం రికార్డులుగా తీసుకొచ్చి, సంగీత ప్రియులకు వీనులవిందు చేస్తున్నారు. వారే లలిత(భావ)గీతాలను రికార్డులుగా తీసుకురావడం మొదలు పెట్టారు. అప్పట్లోనే రావు బాలసరస్వతీదేవి పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 1928, ఆగస్ట్టు 28న పార్థసారథి, విశాలాక్షి దంపతులకు మద్రాసులో అపురూపంగా జన్మించింది అందాల బాలసరస్వతీదేవి. ఆ తర్వాతవారు గుంటూరులో ఉండేవారట. నాన్నగారు పార్థసారథికి ఒక సినిమా థియేటర్ ఉండేదట. తల్లి విశాలాక్షి గొప్ప సంగీతజ్ఞురాలు. ఆమెకి సంగీతమన్నా, పాటలన్నా పట్టరాని మక్కువ. అందుకే ఇంటి నిండా సంగీతమయంగా, ఎన్నో గ్రాముఫోను రికార్డులు, వాటిలోని సంగీతం ముఖరితమవుతుండగా పెరిగిన బాల సరస్వతి తనూ పాడటం మొదలు పెట్టారు. గ్రామ ఫోను రికార్డుల్లో కపిలవాయి రామనాథశాస్త్రి, స్థానం నరసింహారావు లాంటి గొప్పగొప్ప వాళ్ళు పాడిన పాటలామెకి అవలీలగా వచ్చేసేవి. ఆమె వాటిని గొంతెత్తి హాయిగా పాడేవారు. మూడునాలుగేళ్ళ వయసు చిన్నారిగా బాలసరస్వతి నాటకానికి వెళ్ళి మామూలుగా తల్లి ఒళ్లో కూర్చున్నారు.
రంగస్థలం మీద రామనాథశాస్త్రి పాట మొదలుపెట్టగానే హాలంతా పాటతో మారుమోగడం మొదలైంది. ఒళ్ళో కూర్చున్న బాలసరస్వతి తనూ వెళ్ళి పాట పాడుతానని మారంచేయడం మొదలుపెట్టింది. ఆమెను సముదాయిం చడం ఆ తల్లి వల్ల కాలేదు. ఇంతలో విషయం తెలుసుకున్న రామనాథశాస్త్రి స్వయంగా వేదిక దిగివచ్చి, బాలసరస్వతిని ఎత్తుకుని తీసుకువెళ్ళి ‘పాడమ్మా పాడు’ అన్నారు. ఆమె వెంటనే జంకూ గొంకూ లేకుండా ‘నమస్తే ప్రాణనాథా’ అంటూ, అంతక్రితమే ఆయన పాడిన పాటనే మొదలుపెట్టి అత్యంత అద్భుతంగా పాడేసరికి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులై విన్నారు. ఆయన ఆ చిన్నారిని ఆశీర్వదించి, ‘ఈ పసిపాప గొప్ప గాయని అవుతుంది’ అంటూ దీవించారు. 1935లో ఆమెకు బాలనటిగా ‘సతీ అనసూయ’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ధృవ విజయం’, ‘బాల యోగిని’, ‘భక్త తుకారాం’ మొదలైన చిత్రాలలో నటించారు. ‘భక్త కుచేల’లో కృష్ణుడిగా చేసి గొప్పపేరు పొందడమే కాకుండా, ఆమె పాడటంలోని ప్రత్యేకతను అందరూ గుర్తించేలా చేశారు. ఆ తర్వాత సాలూరి రాజేశ్వరరావుగారితో కలిసి ‘ఇల్లాలు’ చిత్రంలో నటించారు. ఏడేళ్ళ వయసుకే గ్రామఫోను రికార్డిచ్చిన బాలసరస్వతీ దేవి కేవలం పదిహేనేళ్ళ వయసులోపునే పదమూడు సినిమాల్లో నటించి పాడారు. అదీకాక లలిత సంగీతం తెలుగు నాట వెల్లివిరుస్తున్న తరుణంలో భావగీతాలు పాడటంలో ఒక ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో రాజేశ్వరరావుగారితో కలిసి ఆమె పాడిన ఈ పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉన్నాయి.
‘పాట పాడుమా కృష్ణా – పలుకు తేనెలొలుకునటుల’
‘కలగంటి కలగంటి – కమల రేకుల’ వంటి ఈ రెండు పాటలు శ్రీసాలూరి వారితో కలిసి పాడారు రేడియోలో. కానీ ఈ పాటలు హెచ్.ఎమ్.వి కంపెనీ రికార్డు తీసుకొచ్చినప్పుడు రాజేశ్వరరావుగారు ఒక్కరు మాత్రమే పాడారు. అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే లలితగీతాలు పాడుతూనే ఆమె సినిమా పాటకీ ఒక ప్రత్యేకతని చేకూర్చారు. రావు బాలసరస్వతీదేవి మరొకరికి తన గళాన్నిచ్చిన మొట్టమొదటి తెలుగు నేపథ్యగాయని (ప్లేబాక్ సింగర్). 1943లో శ్రీరేణుకా ప్రొడక్షన్స్‌వారు ‘భాగ్యలక్ష్మి’ చిత్రం నిర్మించారు. అందులో హీరోయిన్ కమలా కొట్నీస్, ఆ సినిమాకి సంగీతం భీమవరపు నరసింహారావు (బిఎన్ ఆర్) ఆ సినిమా కోసం -‘తిన్నెమీద చిన్నోడ వన్నెకాడా/ తేనె తుట్టిలాంటి ఓ చిన్నవాడా’ అనే సముద్రాల రాఘవాచార్య రచన మొట్టమొదటి సారిగా నేపథ్య గీతంగా రికార్డు చేశారు. ఆ పాటను రావు బాలసరస్వతీదేవి పాడి, మొట్టమొదటి నేపధ్యగానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆమె ఎన్నో పాటలు సినిమాలకి పాడుతూనే ఉన్నారు. ఆమె పదహారో ఏట ఆమెని హార్స్ రేస్ గ్రౌండ్లో కోలంకి రాజావారు చూశారు. రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దర్’ అయిన ఆ కోలంక జమీందారు ఆమెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఆమెకి పదహారేళ్ళు, ఆయనకి నలభై ఏళ్ళు. అలాగని మొదటి వివాహమూ కాదు. విశాలాక్షిగారికి తన కూతురికి పెళ్ళికుదరడం ఎంతో ఆనందం కలిగించింది. పార్థసారధిగారికి కళలయందు ఎంత ఇష్టం ఉన్నా, ఆ గొప్ప సంబంధం, కోరుండి, ఎదురొచ్చేసరికి ఆయనా ఆనందపడ్డారు. బాలసరస్వతికి పెద్ద ఆలోచించుకునే శక్తీలేదు. అవకాశమూ లేదు. 1944లో (సుమారుగా) పెళ్ళయితే కొంతకాలం ఆమె సినిమాల్లో పాటలు పాడారు. కానీ ఎన్నో ఆంక్షల మధ్య, పరువు పరదాల చాటున మగ్గుతూనే మద్రాసు వచ్చి పాటలు పాడుతూండేవారుట. అంతవరకు స్వేచ్ఛగా రాత్రీ, పగలూ షూటింగ్లు, రికార్డింగులు చేసి, జనాల మధ్య గొప్ప ఆకర్షణతో, కీర్తి ప్రతిష్టలతో, ధనార్జనతో మసులుకున్న బాలసరస్వతీదేవి ఒక్కసారి బందిఖానాలో పడిపోయినట్లు, ఊపిరాడనట్లు బాధపడ్డారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’ సినిమా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో, సంగీతం కూడా అంత ఉన్నత స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా బాలసరస్వతీ దేవి పాడిన మూడు పాటలూ ఆణిముత్యాలై నిలిచాయి. సి.ఆర్. సుబ్బరామనికి శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టిందీ ‘దేవదాసు’ సినిమా. సినీరంగంలోకి ప్రవేశించినప్పుడు లలితగీతాలు, కొన్ని సినిమా పాటలు సాలూరి రాజేశ్వరరావుగారితో పాడినా, ఆ తర్వాత కాలంలో ఆమె ఆయన సంగీత దర్శకత్వంలో పాటలు పాడినట్లు కనిపించదు.
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధులైన సంగీత దర్శకులు బి.ఎన్.ఆర్. (భీమవరపు నరసింహారావు), గాలిపెంచెల నరసింహారావు, అద్దేపల్లి రామారావు, సి.ఆర్. సుబ్బరామన్, పెండ్యాల నాగేశ్వర రావు, సాలూరి హనుమంతరావు, రమేష్ నాయుడు, టి.వి. రాజు, ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.వి. మహదేవన్, ఎమ్.ఎస్. విశ్వనాథన్, రజని… ఇలా ఇలా ఎందరెందరో ఆ గాత్రం మీద మోజుతో, ఇష్టంతో పాటలు పాడించారు. సుమారు ఇరవై సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత రావు బాలసరస్వతీదేవి బయట ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టారు. రాజాగారి మరణం తర్వాత ఆమె మళ్ళీ సంగీతం వైపు దృష్టి పెట్టారు. ఏ భోగభాగ్యాలు, హోదాలు, ఆస్తిపాస్తులు ఆశించి ఆమె కఠోర నిర్ణయం తీసుకున్నారో అవి ఆమెకి పెద్దగా లభించనేలేదు. రాచరిక వ్యవస్థలోని మోసాలు, దగాలు ఆమె చవిచూసారు. ఇద్దరు పిల్లలతో ఆమె నిరాడంబరంగా బయటకొచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశంలోని సంగీతాభిమానులందరూ ఆమెని సాదరంగా ఆహ్వానించారు. కొంత వయసు మీద పడినా ఆమె చక్కగా పాడగలుగు తూండటం వల్ల సంగీత దర్శకులు రమేష్ నాయుడుగారు ఆమెని ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో పాడించి గౌరవించారు.
తరువాత ఆమె సి. నారాయణరెడ్డిగారు రచించిన మీరా భజన్లు, రమేష్ నాయుడు సంగీతంలో పాడి, క్యాసెట్ విడుదల చేశారు. ఆమె సినిమా రంగంలోకి మళ్ళీ ప్రవేశించే నాటికి సినిమా పాట స్వరూప స్వభావాలు చాలా మారిపోయాయి. కాలానుగుణంగా ఆమె చేత పాడించేవీలు కూడా తగ్గిపోయింది. రావు బాలసరస్వతీదేవి ఆనాటి నుంచీ పరిశ్రమలోనే ఉండి ఉంటే మరికొన్ని మంచి పాటలు పాడగలిగే వారేమో గానీ, మధ్యలో ఖాళీ వల్ల, పూర్వస్థితిని చేరుకోవడం కష్టమే అయింది. ఆ సమయంలోనే ఆమె పాడిన పాటలన్నీ క్యాసెట్లుగా వచ్చాయి. ఆమె అభిమానులందరూ మళ్ళీ ఆమె గాత్రం విని ఆనందించారు. అయితే అప్పట్లో ఆర్థికంగా కూడా బాగా లేకపోవడం, పిల్లలు చిన్నవారు కావడం, రాజావారి ద్వారా ఆమె కొచ్చిన ఆస్తి చిక్కులు తీసుకురావడం ఆమెని బాధించాయి. అయినా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. ఆమె బొంబాయిలో వసంత్ దేశాయ్ దగ్గర కొన్నాళ్ళు శిక్షణ పొందారు. సున్నితంగా పాడే విధానం, మెత్తని కంఠ స్వరం, స్పష్టంగా పలికే కళలు, సాహిత్యాన్ని భావంతో పలికే తీరు అక్కడి సంగీత దర్శకుల్ని ఆకర్షించాయి. నౌషాద్ సంగీత దర్శకత్వంలో తయారవుతున్న ‘ఉడన్ ఖటోలా’ తమిళ వర్షన్‌లో పాటలు పాడేందుకు బాలసరస్వతి కంఠాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆమెని బొంబాయి పిలిపించుకుని రెండు పాటలు రికార్డు చేశారు. హిందీలో లతామంగేష్కర్ పాడిన పాటలు తమిళంలో ఈమె పాడటం కొంత సంచలనాన్ని సృష్టించింది -ఆమె పాడిన పాటలు అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాతేం జరిగిందోగానీ మిగిలిన పాటలు రికార్డు కాలేదు. ఆ తర్వాత ఆమె పాడలేదు.
ఇంద్రగంటి జానకీబాల
(రచన మాసపత్రిక సౌజన్యంతో)