ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి:కల్వకుంట్ల కవిత
భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తాను చేపట్టిన జనంబాట పర్యటనలో భాగంగా శుక్రవారం మొదటి రోజు కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, మక్తపల్లిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి కోతలు పూర్తయి నెల రోజులు దాటినా ఇప్పుటివరకు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు.మొంథా తుఫాన్ కారణంగా వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి, చాలా జిల్లాల్లో వరి పంట మొత్తం ఒరిగిపోయిందని,
అసలు కోసే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉన్నవి, ఇటీవల అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో పాటు ధాన్యం రాశులు తడిసి ముద్దాయని, అపార నష్టంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన, మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.