లొంగుబాటు.. కాకూడదు నగుబాటు
సుమారు అరవై ఏళ్ల క్రితం మన దేశంలో రాజుకున్న నక్సలైట్ల పోరాటానికి తుది ఘడియలను కేంద్ర ప్రభుత్వం రచిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి మావోయిస్టుల వరుస లొంగుబాట్లు దీనికి సంకేతాలు అనవచ్చు. అయితే వీరి అస్త్ర సన్యాస వార్తలు తెలుగువారిని అమితంగా కలవరపరుస్తున్నాయి. సమాజ మార్పు కోసం సాయుధ పంథాను ఎంచుకున్న ఆ కమ్యూనిస్టు పార్టీలో ముందు వరుసలో తెలుగువారే ఎక్కువ. ప్రత్యేకంగా తెలంగాణకు చెందినవారు నాయకత్వ స్థానంలో ఉండడం మూలాన వారి ప్రతి కదలిక, నిర్ణయం ఇక్కడి ప్రజల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య పోలీసుల తూటాలకు వారు బలి అవుతున్న తీరుకు క్షోభ పడుతున్న గుండెల సంఖ్య కూడా ఇక్కడ తక్కువేమి ఉండదు. తెలంగాణ జిల్లాల్లో భూస్వాముల దౌర్జన్యాలను కట్టడి చేసి, నక్సలైట్లు తెచ్చిన మార్పును గమనించినవారు, అలా ఉపశమనం పొందినవారు తప్పకుండా వారిని ఇష్టపడతారు, అభిమానిస్తారు. కళాకారులు, రచయితల్లో కూడా వారి వాదాన్ని సమర్థించి, వారి పక్షాన నిలిచేవారు ఎందరో ఉన్నారు. సాధారణంగా నక్సలైట్లలో వీరత్వాన్ని, ప్రాణాన్ని లెక్కచేయనితనాన్ని మాత్రమే చూసిన, వారి నుంచి అవే ఆశించిన వారికి ఇంత భారీ సంఖ్యలో లొంగుబాట్లు జీర్ణం అయ్యే పరిస్థితి లేదు. తాము ఎంతో ఉన్నతంగా భావించిన సమరభేరి ఇలా చప్పబడడంతో వారిని నిరాశపరుస్తోంది.
మెల్లమెల్లగా ప్రభుత్వ బలగాల పైచేయితో మావోయిస్టుల కోట బద్దలవుతుండగా అగ్రనేతల లొంగుబాటుతో వారి శిఖరమే కూలినట్లు, పునాదులే కదిలినట్లుగా జనం భావిస్తున్నారు. కేంద్ర బలగాల దెబ్బకు మావోయిస్టులు బలహీనపడినా, తమ యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన సందర్భాలే గతంలో కనబడ్డాయి. అయితే సుమారు ఒక ఏడాది క్రితం నుండే వారిలో కొందరికి ప్రభుత్వం ముందు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన కలిగిన విషయం ఈ మధ్య బయటపడింది. ఆ లొంగుబాటు ఆలోచన అగ్ర నాయకులకు కలగడమే ఎవరు ఊహించని విషయం. ఇక పోలీసులతో వేగలేం, లక్ష్యాన్ని చేరుకోలేం, తుపాకులు అప్పగించి బతికిపోదాం అనుకొని తమ అనుచరులతో పెద్ద తలలే వంచుకొని బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు మావోయిస్టులు లొంగిపోయిన విధానం ఎంతో సంకేతాత్మకంగా ఉంది. ఇన్నేళ్లు వారు నమ్మి, ప్రజలను నమ్మించి పోరాడిన సిద్ధాంతాన్ని శత్రువు కాళ్ల దగ్గర సాగిలపరచినట్లుగా అది సాగింది.
లొంగిపోయేవారు తమ ఇష్టానుసారంగా బయటికి వస్తే సరిపోయేది. పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోతామని నిలబడితే చాలు, అంతా వారే చూసుకునేవారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రుల ముందు పెద్ద హంగామాగా ఆయుధాలను అప్పగించి, నవ్వుతూ రాజ్యాంగం ప్రతిని అందుకోవడం ఎన్నో విపరీత అర్థాలకు తావిచ్చింది. పార్టీ ఇచ్చిన తుపాకిని పార్టీకి వాపసు ఇచ్చేసి తమ దారిలో తాము వెళితే అంతా గౌరవప్రదంగానే ఉండేది.పోలీసుల హిట్ లిస్టులో ఉన్నవారు, కేసుల్లో నిందితులు కావాలనుకుంటే లొంగిపోవచ్చు. మిగతావారు పార్టీకి దూరంగా తమ బతుకు తాము బతకవచ్చు. తుపాకీ పట్టినా కేసులు లేనపుడు నేరస్థులు కారు. ఇలా పదుల సంఖ్యలో కొత్త యూనిఫారాల్లో ఆయుధాలతో ప్రభుత్వాల ముందు కవాతు చేయడం చూస్తుంటే ఎలాంటి సిద్ధాంతం లేని బందిపోటు ముఠాలను తలపిస్తోంది. పార్టీని ఎంత బలహీనం చేశామో చూడండి అని ప్రభుత్వం ముందు ప్రదర్శించినట్లుగా వీరి లొంగుబాటు తీరు ఉంది. లొంగిపోయిన ప్రతి చేతికి రాజ్యాంగ ప్రతి వచ్చింది. ఆయుధంతో కన్నా రాజ్యాంగం బాటలో ప్రజలకు మేలు చేయొచ్చు అని వారంతా ఒప్పుకున్నట్లుగా ఆ ప్రహసనం సాగింది. నక్సలైటు ఉద్యమం కన్నా ముందే భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగంలో సూచించినట్లుగా పాలన సాగడం లేదు, అందులో పేర్కొన్న హక్కులు వివిధ జాతులకు, పేదలకు దక్కడం లేదనే విషయం కాలక్రమంగా బయటపడింది. ఇదేం పాలన అని ప్రశ్నించిన గొంతులపై పాలకులు ఉక్కుపాదం మోపారు. పాలకులెవరైనా యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. దొంగదారిలో ఎమర్జెన్సీవచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది.
రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను కాపాడేందుకు ఉద్యమాలు చేపట్టవలసి వస్తోంది. నేరాలకు శిక్షలను వేసే న్యాయ వ్యవస్థను పక్కనబెట్టి పోలీసులు ప్రభుత్వ అనుమతితో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా హక్కును అంగడి సరుకు చేశారు. కనీస వేతనాలు శ్రమజీవి చేతికందవు. కార్మిక హక్కులు కాలరాస్తున్నారు. గిరిజనులకున్న అటవీ హక్కులు పారిశ్రామికవేత్తల పాదాక్రాంతం చేస్తున్నారు. చట్టసభల్లో బలమున్న ప్రభుత్వాలు సవరణల పేరిట తమకు అనుకూల మార్పులు చేసుకుంటున్నాయి. మత స్వేచ్ఛపై నిరంతర దాడి జరుగుతోంది. హిందూయేతరులకు దేశంలో రక్షణ కరువైంది. గత పన్నెండేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తూ మనుధర్మాన్ని అమలు చేస్తున్నది. హిందూత్వశక్తుల పాలనలో పరమత సహనం కనీస స్థాయికి పడిపోయింది.
రాజ్యాంగం ఇప్పుడు కేవలం ప్రదర్శన కోసం అన్ని పార్టీల హస్తభూషణమైది. ఆచరణలో మాత్రం అందరూ దారి తప్పుతున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ఆయుధం అవసరమే ఉండదు. ఆయుధాన్ని అప్పగించి రాజ్యాంగాన్ని అందుకొనే పరిస్థితులు దేశంలో లేవు. ఆయుధానికి రాజ్యాంగ ప్రతి ప్రత్యామ్నాయం కాదు.ఇంకా అలాంటి రోజులు రాలేదు. నలభై ఏళ్లుగా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవారు ఇప్పుడే కొత్తగా రాజ్యాంగాన్ని చూస్తున్నట్లు, దాని అమలు బ్రహ్మాండంగా జరుగుతున్నట్లు పోజులు పెట్టడం చాల మందికి అసహజంగా కనబడింది. ప్రతి వ్యక్తిపై ఆయన గతకాలపు నడవడిక ఆధారంగా జనానికి ఆయనపై కొన్ని అంచనాలు ఉంటాయి. అవి బెడిసికొట్టినపుడు ఆయనపై గౌరవం తగ్గిపోవడం సహజమే. అందుకే ఈ లొంగుబాట్లపై సామాజిక మాధ్యమాల్లో భిన్న కథనాలు వస్తున్నాయి. రాజ్యాంగ ప్రతిని అందుకున్న మాజీ మావోయిస్టులు బాధ్యతగా దాని అమలుకై కొత్తగా కార్యాచరణ మొదలుపెడితే ఈ లొంగుబాట్లను కూడా హర్షించవచ్చు.
బద్రి నర్సన్, 94401 28169