దీక్షా దివస్ గొప్ప చరిత్రాత్మకం
ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరిగాయి.. ఎన్నో చరిత్రలో చదువుకునే సాక్ష్యాలుగా ఉన్నాయి. అంతకు మించిన భారతదేశ పోరాట చరిత్రలో నవంబర్ 29 దీక్షా దివాస్ ఓ గొప్ప చారిత్రాత్మక రోజు. శాంతియుతంగా చేసిన పోరాటంలో తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ చావు చివరికి దాకా వెళ్లిన రోజు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ఢిల్లీ మెడలువంచి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడానికి మలుపు తిరిగిన రోజు.. భవిష్యత్తు చరిత్రలో ఎప్పటికీ ఓ గొప్ప రోజుగా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. కెసిఆర్ ఆనాడు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధంకాకపోయి ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా పోయేది. అంతటి కుట్రలతో తెలంగాణ వాదాన్ని బలహీనపరిచే కుట్రలను పటాపంచలు చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ ఆకాంక్ష సాకారం కావడానికి మలుపు తిప్పిన రోజు. దీక్షాదివాస్ ప్రపంచ పోరాటాలైనా.. భారతదేశ పోరాటాల చరిత్రలతో సమానంగా నిలిచిన రోజు. దీక్షా దివస్ లేకుంటే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరింత జాప్యం జరిగి ఉండేది. ఆ జాప్యాన్ని గ్రహించి తాను సచ్చినా… తెలంగాణ ఆకాంక్ష సాకారం కావాలని చరిత్రను మలుపుతిప్పిన రోజు నిజంగా ఎంతో గొప్పది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఓ అతి పెద్ద సవాల్.. ఏ రాజకీయ పార్టీ చేయని గొప్ప సాహసం నేటి బిఆర్‌ఎస్ చేసింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకోసం ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చినా.. సవాళ్ల ముందు నిలబడలేకపోయారు… అలాగే సావాసమూ చేయలేకపోయారు, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి పదవులను పొందారు. రాజకీయ అధికారాన్ని అనుభవించారే తప్ప తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడలేకపోయారు. దశాబ్దాల తరబడి అణువణువు తెలంగాణ ఆగం అవుతుంటే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు.. తమ భవిష్యత్తు కోసం చూసుకున్నారే తప్ప తెలంగాణ భవిష్యత్తు తరాలకోసం ఏ మాత్రమూ ఆలోచన చేయలేదు. ఫలితంగా భారతదేశ చరిత్రలోనే భిన్నమైన సంస్కృతి గళ్ల తెలంగాణ.. ఏ స్వార్థం తెలియని తెలంగాణ ప్రజల బతుకులను అంధకారంలో నెట్టేసి తరతరాల సంపదను దోచుకున్నారు.. తెలంగాణ వాదం రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఓ అధికార వాదం అయిందే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షకు రూపం ఇవ్వలేకపోయారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో మహామహులమని చెప్పుకొనే రాజకీయ నాయకులు సైతం తెలంగాణ యెథల గడ్డకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేకపోయారు. ఒకవేళ ప్రశ్నిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఒకటైతే.. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను, సమైక్యాంధ్ర పాలకుల కుట్రలపై ఏనాడు సావాసం చేయలేకపోయారు.
తెలంగాణ, కెసిఆర్ ఈ రెండు పదాలకు భిన్నమైన తేడా ఉండొచ్చు కానీ కెసిఆర్ లేకుంటే మాత్రం తెలంగాణ ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరి ఉండేది కాదనడానికి అనేక సాక్ష్యాలు చరిత్రను గమనిస్తే అర్థం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణను పరిచయం అయ్యేలా చేసింది మాత్రం కెసిఆరే. తెలంగాణ నాటి పది జిల్లాలు పడుతున్న అనేక గోసలను ఏ పత్రికలు, ఏ సమైక్య పాలకునికి కళ్లకు కన్పించలేవు. అధికారం కోసం తెలంగాణను అడుక్కునేలా చేసి.. తెలంగాణ వేరు చేస్తే కోలుకోదనేలా తెలంగాణ ప్రకృతి సంపద, భౌగోళిక వ్యవస్థను అంతా ఛిన్నాభిన్నం చేసి ఓ ఎడారిలా మార్చారు. అటువంటి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న తరువాత పరిపాలన అంత సులువు కాదు అనే బెరుపుతో తెలంగాణ రాజకీయ నాయకులు కూడా రాష్ట్ర ఆకాంక్ష కోసం ముందుకు అడుగువేయలేని సవాళ్లు నాటి తెలంగాణలో.. అయినా ఉద్యమ నేత కెసిఆర్ తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్యమం ప్రారంభించిన నాడు అనేక సవాళ్లు.. రాజకీయ ఒత్తిడిలు, కుట్రలు.. అయినా అవేవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయాయి.
ఎన్ని సవాళ్లు ఎదురైనా కెసిఆర్ అనే మహాశక్తి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఓ వైపు రాజకీయ కుట్రలు అయితే, మరో వైపు విషపు రాతలతో తెలంగాణ ఉద్యమాన్ని ఆగం చేసే చర్యల వంటి ఎన్ని సవాళ్లు ఎదురైనా గులాబీ దళపతి వ్యూహాల ముందు అవేమీ పనిచేయలేకపోయాయి. తెలంగాణ అరవై ఏళ్ల గోసకు 14 ఏళ్ల మడమ తిప్పని పోరాటంతో ఓ పరిష్కారం లభించి రాష్ట్ర ఆకాంక్ష ఏర్పాటు అయింది. కెసిఆర్ ఓ పెద్ద రాజకీయ చాణక్యుడు, రాదనుకొని తెలంగాణ వాదాన్ని ఎందరో విడిచిపెట్టారు.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ అసాధ్యం అని ఉన్న తెలంగాణ సమాజానికి కెసిఆర్ తోనే రాష్ట్ర కల సాధ్యం అనే స్థాయిలో ఆయన పోరాటం నిలిచింది. అంతటి పటిమ, వ్యూహలు కలిగిన నాయకుడు కెసిఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించడమే మా అంతిమ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడను అని మొండి పట్టుదలతో రాష్ట్రాన్ని సాధించారు కెసిఆర్. కెసిఆర్ తెలంగాణ నినాదాన్ని బలంగా మోయకుంటే రాష్ట్రం వచ్చి ఉండేది కాదు.
తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన త్యాగం చరిత్రలో ఎప్పటికీ సువర్ణ అధ్యాయం. తెలంగాణ సాధించడం కోసమే రాజకీయ పార్టీని స్థాపించిన కెసిఆర్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, సమైక్యపాలకుల కృత్రిమ కుట్రలను ఎదుర్కొని ఉక్కు మనిషిగా నిలబడ్డారు. దశాబ్దన్నర కాలం అలసిపోకుండా నడిపిన ఉద్యమం వల్ల రాష్ట్ర ఆకాంక్ష కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో కెసిఆర్‌ను దెబ్బ కొట్టడానికి ఆనాడు చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావు. గులాబీ జెండాను లేకుండా చేయాలని చేసిన ప్రతీ కుట్రను ఛేదించి రాష్ట్రం సాధించడంలో కెసిఆర్ త్యాగం భవిష్యత్తులో ఎప్పటికీ చరిత్రే. తెలంగాణ వచ్చే వరకూ రాజీనామాలు చేస్తూ ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను బలంగా తీసుకెళ్లిన పార్టీ నేటి బిఆర్‌ఎస్. తెలంగాణ కోసమే పుట్టి.. తెలంగాణ సాధించి ఆత్మగౌరవాన్ని పెంచింది. తెలంగాణలోని ప్రజల ఆవేదనలకు రూపమై కొట్లాడింది. అడుగడుగునా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టి సమైక్య పాలకుల కుట్రలను ప్రజలముందు ఉంచింది. తెలంగాణ పడుతున్న గోసను చట్టసభల ద్వారా ఈ భారతదేశానికి గొంతెత్తి విన్పించింది కెసిఆర్ నాయకత్వమే. కెసిఆర్ అనే మూడు అక్షరాల శక్తి తెలంగాణలోని అణువణువుపై అవగాహన పెంచుకొని తెలంగాణ యెథలను ఈ ప్రపంచానికి చాటారు.
అప్పటి వరకూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలేకపోయింది. ఫలితంగా తెలంగాణ గడ్డ చంటి బిడ్డలను అమ్ముకునే దుస్థితి ఒకవైపు అయితే.. వరకట్న చావులు, గల్ఫ్ వలసలు, ఒకటి రెండు కాదు పుట్టెడు శోకంతో తెలంగాణలోని ప్రతీ పల్లె గొల్లుమని ఏడ్చేది. ఏ మనిషిని కదిలించినా పచ్చికుండ లాంటి దుఃఖం గుండెల్లో దాచుకొని బతికిన దుర్భర పరిస్థితులను చూసింది తెలంగాణ. సంవత్సరాల తరబడి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణ దుఃఖాన్ని దూరం చేయలేకపోయాయి.ఇక సంక్షేమం అనేది తెలంగాణ ప్రజలకు దొరకని పరిస్థితి. అంతటి ఘోరమైన ఆవేదనలను కెసిఆర్ వచ్చే వరకూ ఎవరూ దూరం చేయలేకపోయారు. వాస్తవానికి తెలంగాణ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కనీస అవగాహన లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజల యెథలను ఏ ప్రభుత్వం దూరం చేయలేకపోయింది. కెసిఆర్ ఉద్యమ జెండా పట్టుకొని తిరిగి చూసిన తెలంగాణ యెథలపై అవగాహన పెంచుకొని పదేళ్ల కెసిఆర్ పాలనలో పరిష్కారం చూపగలిగారు.
తెలంగాణ పడుతున్న గోసలు తీర్చే మానవీయ పథకాలతో పదేళ్లు కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలిచారు. పుట్టిన చంటి బిడ్డ నుంచి పండు ముసలవ్వ దాకా వారి బాగోగులు చూసే సంక్షేమ పథకాలతో యెథలను దూరం చేశారు. విస్తారమైన బంగారం పండే భూములు ఉన్నా.. చుక్కనీరు రాక ఎండి నెర్రలు బారిన భూముల గొంతు తడిపేందుకు 70 వేల చెరువుల పునరుద్ధరణ చేసి భూగర్భ జలాలు పెరిగేలా చేసి తెలంగాణకు తాగు, సాగునీటి కష్టాలు తీర్చారు. తెలంగాణ లో డిగ్రీ విద్యకు కళాశాలలు లేని దుస్థితి నుంచి నేడు జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలతో తెలంగాణ బిడ్డలు పోటీ పడేలా గుణాత్మక మార్పు తీసుకువచ్చారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేలా పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారింది. పదేళ్ల కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రపంచంలో అత్యుత్తమమైన అవార్డులను, ప్రశంసలను అందుకుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అనుసరించాయంటే కెసిఆర్ ప్రజాసంక్షేమ ఆలోచన ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు.
ప్రాంతీయ పార్టీల్లో బలమైన శక్తిగా ఉన్న బిఆర్‌ఎస్‌ను ఎదగనీయకుండా రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో కుట్ర పన్నాయనడంలో సందేహం లేదు. ఓ ఇంటికి తండ్రి దూరమైతే ఇల్లు దివాలా తీసినట్లు ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అలా తయారైంది. అణువణువు తెలంగాణ కోసం తెలిసిన కెసిఆర్ పాలనలోనే బాగుండేదని అటు మాట్లాడుతున్నారు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు అయిన బతుకమ్మను, తల్లి తెలంగాణ విగ్రహం నుంచి తొలగించడం, తదితర చిహ్నాలను మార్పుచేసి తెలంగాణలో పాశ్చాత్య సంస్కృతికి దారులు వేశారు. ఇటువంటి అనేకమైన ప్రజా అవసరాలకు ఉపయోగపడని నిర్ణయాలతో తెలంగాణ మరింత అప్రతిష్ట పాలుకు కారణం అవుతుంది. వీర చరిత్ర, త్యాగాల చరిత్ర ఉన్న తెలంగాణలో పాశ్చాత్య సంస్కృతికి తెరలేపారు. కెసిఆర్‌ను పదేపదే ద్వేషిస్తూ ఆయన త్యాగాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేయాలని కాంగ్రెస్ చూస్తున్నది.. కానీ కెసిఆర్ అనే మూడు అక్షరాల పేరు… ఈ భూమి ఉన్నంత వరకూ ప్రపంచ పోరాటాల చరిత్రలో ఆయన ఎప్పటికీ ఓ గొప్ప చరిత్రనే.. కెసిఆర్ తెలంగాణ తల్లి విముక్తి కోసం కన్న బిడ్డ.. ఆయనను ఈ పోరాటాల గడ్డ ఎప్పటికీ మరవదు. భవిష్యత్తులో కెసిఆర్ పాలనను తెచ్చుకోవడానికి ప్రజలు ఇప్పటినుంచే సిద్ధ్దమవుతున్నారు.
– సంపత్ గడ్డం
78933 03516