ఆయువు తీస్తున్న వాయువు
న్యూఢిల్లీని మరోసారి శీతాకాలపు పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో కంటిచూపు తగ్గుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జనాలకు ఊపిరి సలపడం లేదు. వాయు నాణ్యత సూచిక ప్రమాద స్థాయిలో ఉంది. ఫలితంగా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది. రాజధాని నివాసితులకు ఏటా శ్వాసకు ఇబ్బంది, ఊపిరాడకపోవడం ఓ భయంకరమైన ఆచారంగా మారింది. రాజధానిలో పిల్లలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి తెలియక పొగమంచును రూచిచూస్తూ పెరుగుతున్నారు.శీతాకాలం అంటే చలి మాత్రమేకాక తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందని వృద్ధులు అంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం అత్యవసర చర్యల గురించి చర్చిస్తుంది. కానీ, నిర్లక్ష్యం. తాత్కాలిక ఆలోచనే తప్ప, వాయుకాలుష్య నియంత్రణకు కఠినమైన, శాశ్వత చర్యలు తక్కువ. అయితే ఈసారి సమస్య కేవలం ఢిల్లీకే పరిమితం కావడంలేదు. మైదానాలకు దూరంగా -ఈశాన్య ప్రాంతంలో వాయు కాలుష్య భూతం విస్తరించిన వాస్తవాలు కలవరపెడుతున్నాయి.
సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్‌ఇఎ) చేసిన కొత్త శాటిలైట్ ఆధారిత ఎంపి 2.5 అంచనా దిగ్భాంతి కలిగించే వాస్తవాన్ని వెల్లడించింది. అసోంలోని 11 జిల్లాలు ఇప్పుడు దేశంలోని 50 అత్యంత కలుషిత జిల్లాలలో ఉన్నాయి. ఈ సంఖ్య ఢిల్లీకి సమానం. మరీ ఆందోళన కలిగించే అంశం అసోం లోని 34 జిల్లాలు 2024లో జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాలను దారుణంగా అధిగమించాయి. కాలుష్యం తీవ్రతే కాదు అది కొనసాగడం విధాన రూపకర్తలను ఇబ్బందిపెడుతోంది. భారతదేశంలో ఎక్కువ భాగం వర్షాకాలంలో వాయు కాలుష్యం ప్రక్షాళన జరుగుతుంది, అసోంలో వర్షాకాలంలో కూడా పిఎం 2.5 నిబంధనలను 21 జిల్లాలు ఉల్లంఘించినట్లు రికార్డయింది. త్రిపురలో కూడా ఆరు జిల్లాలలో కాలుష్యం పెచ్చుపెరిగింది. ఇవి ఎపిసోడిక్ స్పైక్‌లను కాక, నిర్మాణాత్మక క్షీణతను సూచిస్తున్నాయి. భారతదేశంలో చక్కటి పర్యావరణానికి పెట్టింది పేరైన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దీర్ఘకాలిక వాయు కాలుష్య ఇబ్బందుల జోన్‌లోకి మారిపోయింది.
ఈ మార్పు అభివృద్ధి కారణం గా వచ్చిన అనివార్య పరిణామంగా చెప్పలేం, కానీ ఈ గణాంకాలను తోసిపుచ్చలేం కదా. దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలు చక్కటి వర్షపాతం, దట్టమైన అటవీ విస్తీర్ణం, తక్కువ పట్టణీకరణ, పరిమితంగా పారిశ్రామికీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలిని అనుభవిస్తూ వచ్చాయి. అయితే నేడు శీతాకాలం, వేసవి, వర్షాకాలం అన్న తేడా లేకుండా దేశంలో ఎక్కువ కాలుష్య ఐదు రాష్ట్రాలలో అసోం, త్రిపుర ఉండడం దురదృష్టకరం. ఇందుకు ప్రధాన కారణం పర్యావరణ రక్షణ చర్యలు లోపించడం, అభివృద్ధి విస్తరణ విషయాలపై నియంత్రణ పేలవంగా ఉండడం, పర్యావరణ సమతుల్యతపట్ల తీవ్ర నిర్లక్ష్యం. చట్టబద్ధమైన ముందస్తు అనుమతుల లేకుండా కార్యకలాపాలు ప్రారంభించే పరిశ్రమలకు ఫోస్ట్ ఫాక్టో పర్యావరణ అనుమతులను అనుమతించడం ద్వారా న్యాయస్థానం తీసుకున్న తిరోగమన చర్యవల్ల ఈ డైనమిక్స్ బయటపడుతున్నాయి.
పోస్ట్- ఫాక్టో పర్యావరణ అనుమతులను నిషేధించే 2025 వనశక్తి తీర్పును సుప్రీం కోర్టు ఈ మధ్య ఉపసంహరించుకోవడం భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రానికి ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బ. పెట్టుబడులు రావాల్సిన అవసరం, ఆర్థిక పరిగణన నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పరిశ్రమలు తరువాత పర్యావరణ పరమైన అనుమతులు కోరవచ్చునని కోర్టు పేర్కొంది. కానీ, ఇది పర్యావరణ నియంత్రణ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఇందుకు ముందు పరిస్థితి అంచనాలు, ప్రజా సంప్రదింపులు వంటి జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఫలితంగా ఉల్లంఘనలు పెరుగుతాయి. పునరాలోచన తర్వాత తీర్పు అక్రమనిర్మాణాలను చట్టబద్ధం చేస్తుంది. వ్యాపార అవసరాలకోసం పర్యావరణానికి హాని జరిగినా ఆమోదించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ తీర్పు ఆర్టికల్ 21 కింద పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం విషయంలో రాజ్యాంగ హక్కును దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో పర్యావరణ దౌర్బల్యం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ, పర్యవేక్షణ తక్కువే. అందువల్ల మరింత శ్రద్ధ అవసరం.
ఈ విస్తృత జాతీయ సందర్భంలోనే సిఆర్ ఇఎ నివేదికను అర్థం చేసుకోవాలి. అసోంలో గాలి నాణ్యత క్షీణత కు కారణం స్థానిక పాలనా యంత్రాంగ వైఫల్యమే కాదు. ఇది పర్యావరణ పరంగా విస్తృత కోతకు సంకేతం. బ్రహ్మపుత్ర వ్యాలీలో థర్మల్ పవర్ నుంచి, పెట్రో కెమికల్స్ వరకూ, సిమెంటు ఫ్యాక్టరీల నుంచి చమురు శుద్ధి కర్మాగారాల వరకూ పలు పరిశ్రమలు విస్తరించడం ప్రధాన కారణం. కఠినమైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉద్గారాలు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్నాయి. ఆధునిక జిగ్‌జాగ్ టెక్నాలజీ, ఉద్గార ఫిల్టర్లు లేకుండా పనిచేసే ఇటుక బట్టీల కారణంగా, మొరిగావ్, నాగావ్, టిన్సుకియా, బొంగైగావ్ వంటి పట్టణాల చుట్టూ దట్టమైన కాలుష్య వలయం ఏర్పడుతోంది. గ్రామీణ జీవనోపాధిలో భాగమైన బయోమాస్‌కు తోడు ఇప్పుడు పట్టణ చెత్త దగ్ధం, ఏడాది పొడవునా సాగే నిర్మాణ పనుల కారణంగా కాలుష్యం మరీ మితిమీరుతోంది. అసోం పట్టణ ప్రాంతాలలో వాహనాల సంఖ్య గణనీయంగా పరిగింది. రోడ్ల విస్తరణ, హైవేల నిర్మాణం, నదీతీర అభిృవృద్ధితో నియంత్రణ లేని ధూళి పెరిగిపోతోంది.
ఈశాన్య ప్రాంతం కాలుష్య కేంద్రంగా మారడానికి ఇవే కారణాలని పూర్తిగా చెప్పలేం. బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ నుంచి సరిహద్దు ఏరో సోల్స్ అసోం బేసిన్ లాంటి ప్రాంతాలలోకి ఎక్కువగా చొచ్చుకువస్తాయి. ఇక్కడి తేమ, తక్కువ గాలి ప్రసరణ కారణంగా కాలుష్య కారకాలు చిక్కుకుంటాయి. అడవుల నరికివేత, తగులపడుతున్న అడవులు, క్వారీయింగ్, నదీగర్భంలో అక్రమ మైనింగ్ ప్రకృతిని దెబ్బ తీస్తున్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, లీనియర్ మౌలిక సదుపాయాలు, రైల్వే డబ్లింగ్, సరిహద్దురోడ్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, ఐదేళ్లుగా విస్తరించాయి. తరచుగా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనాలను దాటవేస్తున్నాయి. పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇప్పుడు చట్టబద్ధం కావడంతో అనుమతులు పొందాలనే షరతు లేదు.
దాంతో ఈశాన్య పర్యావరణానికి ముఖ్యంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగాలనుంచి అన్నివైపులనుంచి ఒత్తిడి తప్పడం లేదు. దారుణం ఏమిటంటే, ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యత ఈ ప్రాంత నివాసితులకు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తోంది. ఈశాన్య ప్రాంతం ప్రపంచం లోని గొప్ప జీవవైవిధ్య హాట్‌స్పాట్ లలో ఒకటి. దాని అడవులు వర్షప్రాంతాన్ని నియంత్రిస్తాయి. నదీ వ్యవస్థలను స్థిరీకరిస్తాయి. మరో చోట లేని అరుదైన జాతులను సంరక్షిస్తాయి. గిరిజనులు, స్వదేశీ సమాజాలు శతాబ్దాలుగా స్థిరమైన భూనిర్వహణ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పర్యావరణ ఆస్తుల నష్టం ప్రాంతీయపరమైన నష్టమేకాదు ఇది జాతీయ నష్టం. కలుషితమైన ఈశాన్యం అంటే అస్థిర రుతుపవాలు, అస్థిర వరదలు, మొత్తం భారత ఉప ఖండానికి ఎక్కువ నష్టం కలిగించే పరిస్థితి. బ్రహ్మపుత్ర లోయ ఇబ్బందిపడినప్పుడు దిగువ మైదానాలకు ఇబ్బందులు తప్పవు.భారతదేశ పర్యావరణ భవిష్యత్‌కు హానికరమే.
సంక్షోభాన్ని గుర్తిండమే కాదు, దేశంలో పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన విధానాలను పునర్నిర్వచించడం ఎదుట ఉన్న సవాల్. కాలుష్య నియంత్రణ బోర్డులను స్వతంత్ర శాస్త్రీయ సామర్థ్యంతో బలోపేతం చేయడం, చట్టబద్ధమైన అధికారాలతో ఈశాన్య పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేయడం, ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేరనే సూత్రాన్ని పునరుద్ధరించడంవంటి చర్యలు ముఖ్యం. జిల్లా స్థాయి క్లీన్ -ఎయిర్ యాక్షన్ ప్లాన్‌ను తప్పనిసరి చేయాలి. శాటిలైట్ ఆధారిత హాట్‌స్పాట్ గుర్తింపునకు సంబంధించి మార్గనిర్దేశం చేయాలి. ఇటుక బట్టీలను ఆధునీకరించడమో, మూసివేయడమే చేయాలి. పరిశ్రమలు నిరంతర ఉద్గారాల పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. డేటా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు స్వచ్ఛమైన ఇంధనం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మాణ కార్యక్రమాలనూ కఠినంగా నియంత్రించాలి. మున్సిపల్ సంస్కరణల ద్వారా చెత్త తగులపెట్టకుండా నియంత్రించాలి.
అడవులు, చిత్తడి నేలలు, గిరిజన భూముల రక్షణ కూడా కీలకం. అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చడం, అటవీ భూమి విషయంలో స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో ఈశాన్య ప్రాంతంలో విస్తారమైన భూభాగాలు రక్షణాత్మక చట్టాల కింద లేకుండాపోయాయి. ప్రభుత్వం నోటీఫై చేసిన అడవుల మాదిరిగానే, కమ్యూనిటీ నిర్వహణ అడవులకు రక్షణ కల్పించే చట్టాలను బలోపేతం చేయాలి. వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతున్నందువల్ల, కఠినమైన పర్యావరణ, అంచనాలు లేకుండా మైనింగ్, నదుల తవ్వకానికి కానీ, రోడ్ల విస్తరణకు కానీ అనుమతించరాదు. ఇందుకోసం అడవులను పణంగా పెట్టకూడదు. కాలుష్య నియంత్రణకు ప్రాంతీయ సహకారం అవసరం, కాలుష్యం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాదు. ఈశాన్యం లోని అసోం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్ ఉమ్మడి కాలుష్య నియంత్రణకు గట్టి సమన్వయంతో కృషి చేయాలి.
బయోమాస్ దగ్ధం, కార్చిచ్చు, అడవులలో మంటల నియంత్రణ, పొరుగు దేశాలతో సరిహద్దులలో పారిశ్రామిక ఉద్గారాలపై ఉమ్మడి ప్రొటోకాల్ మున్ముందు చాలా అవసరం. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా పొగమంచు సంక్షోభం ఓ హెచ్చరిక. కానీ ఈశాన్య ప్రాంతంలో ఏడాది పొడవునా పెరుగుతున్న కాలుష్యం మరింత తీవ్రమైనదిగా చూడాలి. ఒకప్పుడు రుతుపవన అడవులు, నదీ గాలులతో కూడిన ప్రాంతం విషపూరితంగా తయారైంది.దేశవ్యాప్తంగా పర్యావరణ పతనాన్ని అరికట్టగలమా. కోట్లాది సంవత్సరాలుగా పరిరక్షించుకుంటున్న సహజమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోగలమా అన్నది మనం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే, దానికి చెల్లించే మూల్యం గాలి నాణ్యత ఇండెక్స్ లేదా అస్పత్రిలో చేరిన వారి సంఖ్యతో లెక్కించలేం. ఇది భారత వాతావరణ భద్రత, దాని జీవవైవిధ్యం, అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పనకు సంబంధించి రాజ్యాంగం ప్రసాదించిన హామీ అమలుపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు