పైరసీ… ఈ మధ్యకాలంలో తరచుగా వినబడుతున్న మాట ఇది. సినిమా ఇలా వి డుదలైందో లేదో అలా పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్న ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ పై అంతటా చర్చ రాజుకుంది. కొత్త సినిమాలను పైరసీ చేయడం ద్వారా తెలుగు సిని మా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రవి కోట్లాది రూ పాయల నష్టం కలిగించాడని సినీ పరిశ్ర మ వాపోతోంది. మరోవైపు, ఆ కాశాన్నంటుతున్న టికెట్ ధర లు, థియేటర్లలో అందుబాటులో లేని టీ, స్నాక్స్, శీతల పానీయాల ధ రలతో కుదేలవుతున్న పేద, మధ్యతరగతి వ ర్గాల పాలిట ఐబొమ్మ రవి దేవుడనే వారూ లేకపోలేదు. సినీ నిర్మాతలు, థియేటర్ల యా జమాన్యాలు తమ లాభాలు తాము చూసుకుంటున్నప్పుడు వేలల్లో డబ్బు వెచ్చించి, మ ల్టీప్లెక్స్ కు వెళ్లలేని సగటు మనిషి పైరసీ సిని మా చూస్తే తప్పేమిటన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి అరెస్టయినంతమాత్రాన పైరసీ ఆగినట్టేనా? పైరసీ సినిమాలు ఆగాలంటే సినీ పరిశ్రమ తీసుకోవలసిన చర్యలేమిటి? వంటి అంశాలపై ప్రముఖుల అభిప్రాయాలను మీకందిస్తోంది ‘సమగ్ర’
సినిమా పైరసీ ఇప్పట్లో ఆగేది కాదు
పైరసీ అనేది ప్రపంచవ్యాప్త దృగ్విషయం. ఇది ప్రపంచమంతటా ఉంది. దీనిని పూర్తిగా నిర్మూలించడం ఆచరణాత్మకంగా అసాధ్యం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఈ రోజు ఐబొమ్మను పట్టుకున్నారు. ఇంతకు ముందు కూడా మరొకరిని పట్టుకున్నారు. వారిని పట్టుకున్నంతమాత్రాన పైరసీ ఆగిపోతుందా? ఐ బొమ్మ రవిని పట్టుకున్న తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఐ బొమ్మతోనో లేదా మరొకరితోనో ఇది ఆగదు. పైరసీ వల్ల నష్టం ఎంత? ఎంత నష్టం జరుగుతుంది? నాకు తెలిసినంత వరకు, వీడియో సినిమా వచ్చినప్పుడు సినిమారంగంలో పైరసీ మొదలైంది. అంతకు ముందు వీడియో సినిమా 16ఎంఎంలో చేసేవారు. 35 ఎంఎం సినిమాను 16ఎంఎంలో చేసి రోడ్ల మీద, పండుగల సమయంలో రాత్రిపూట రోడ్డు మీద ప్రదర్శించేవారు. కాబట్టి అప్పట్లో అది ఒక రకమైన పైరసీ. తర్వాత వీడియోలు వచ్చిన తర్వాత, వీడియో పార్లర్లలో వీడియోలు వేసేవారు. నగరాల్లో ప్రదర్శించేవారు. వీడియో క్యాసెట్లను అద్దెకు తీసుకుని ఇంట్లో సినిమాలు చూసేవారు. తర్వాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. ఈ విధంగా, పైరసీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, అది ఆగదు. అది ఆగలేదు కూడా. ఈ పైరసీ ఎక్కడి నుండి వస్తోంది? అన్నింటికంటే ముందు, ఇది ఎక్కడ పుడుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేదు. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడా పైరసీ పెరిగింది. పైరసీ నాణ్యత పెరిగింది. ఇంతకు ముందు, థియేటర్ ప్రింట్ ఉన్నప్పుడు, థియేటర్లో నేరుగా ప్రదర్శించేవారు. దానిని నేరుగా కాపీ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు దీనికి ప్రక్రియ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇది చాలా సులభం అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చాక, ఇది మునుపటి కంటే సులభం అయింది. ఇది కాకుండా, మన సినిమా థియేటర్లన్నింటిలోనూ శాటిలైట్ల ద్వారా సినిమాలు పంపే కొత్త ప్రక్రియ ఉంది. కాబట్టి బహుశా సినిమా పరిశ్రమకు చెందిన కొందరు కూడా పైరసీ చేస్తూ వారికి సహాయం చేస్తున్నారేమో. వాళ్ళు హార్డ్ డిస్కులు ఇస్తున్నారు కదా? అక్కడి నుండి కూడా జరగవచ్చు. అయితే, థియేటర్ నుండి తీసేది మరో రకం. ఇలా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. వారికి సినిమా ఎక్కడి నుండి వస్తోంది? ఎలా తీసుకువస్తున్నారు? ఎవరు తీసుకువస్తున్నారు? అసలు సమస్య ఏమిటంటే, దీని మూలం ఎక్కడి నుండి వస్తుందో అక్కడే ఉంది. దాన్ని తొలగించనంతవరకు, పైరసీ ఆగదు. పైరసీ బయటకు వచ్చింది. దొంగ అసలైన వాడు కాదు. చూసినవాడిని పట్టుకుంటామని అంటారు, లేదా అమ్మిన వాడిని పట్టుకుంటారు. ఇచ్చిన వాడిని పట్టుకుంటారు. కానీ అది ఎక్కడి నుండి వచ్చింది? ఐ బొమ్మకు ఎవరు సరఫరా చేశారు? సరఫరా చేసిన వాడు థియేటర్లో తీసిన వాడు కాదు. థియేటర్లో తీసిన వాడు వేరే. కానీ అసలు ప్రింట్ వారికి ఎలా వచ్చింది? కాబట్టి, ఇప్పుడు మనం థియేటర్లకు కంటెంట్ ఇస్తున్నాం కదా? కంటెంట్ ప్రొవైడర్లు ఉంటారు కదా? వారి నుండి వెళ్ళాలి. లేకపోతే, మన ఎడిటింగ్ రూమ్ల నుండి వెళ్ళాలి. అది మరో పద్ధతి. కాబట్టి పైరసీ ఎక్కడ జరుగుతోందో స్పష్టత లేదు. బహుశా ఆ స్పష్టత ఇప్పట్లో రాకపోవచ్చు. ఇప్పటివరకు చాలా సినిమాలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఎడిటింగ్ రూమ్ నుండి వెళ్ళాయని చెప్పారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ అలా జరిగిందని చెప్పారు. ‘టాక్సీవాలా’ సినిమా కూడా అంతే. ఆ మొత్తం సినిమా బయటకు వచ్చింది. నిజానికి, ‘అత్తారింటికి దారేది’ సినిమా 3/4వ భాగం బయటకు వచ్చింది.
ఇవే కాకుండా, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలన్నీ ఇలానే బయటకు వస్తున్నాయి. ఇది ఎలా జరుగుతోంది? నేను అది కూడా చెప్పాలి. దీనివల్ల వేల కోట్ల నష్టం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, పైరసీ వల్ల ఆదాయం 30% నుండి 40% పడిపోయిందని చెబుతున్నారు. నేను వ్యక్తిగతంగా దాన్ని నమ్మను. ఎందుకంటే సినిమా అనేది ఒక థియేట్రికల్ అనుభవం. అది ఒక విభిన్నమైన అనుభవం. దానిని సెల్ ఫోన్లో చూసినా లేదా టీవీలో చూసినా, అది సరైన ప్రింట్ కాదు. సినిమాకు మంచి ప్రింట్ వస్తే, అది టీవీలో కూడా మంచి నాణ్యతతో ఉంటుంది. కానీ సెల్ ఫోన్లో చూసే చిన్న బొమ్మ సాధ్యం కాదు. సినిమా బాగుంటే, వారు ఖచ్చితంగా మళ్లీ థియేటర్కు వెళ్తారు. ఈ సినిమాలను ఫోన్లో లేదా టీవీలో చూసే వ్యక్తులు, వారిలో 80% మంది సినిమాకు వస్తారు.
ఇది ఉచితంగా వచ్చే బ్యాచ్. వీరు టిక్కెట్లు కొనే బ్యాచ్ కాదు. ప్రేక్షకులలో 20% నుండి 30% మంది తగ్గిపోవడంవల్ల, మా ఆదాయం నష్టపోతున్నాం. దీనికి అదనంగా థియేటర్ ఖర్చు.. అంటే టికెట్ ధర, ముఖ్యంగా ఆహార పదార్థాల ధర, అది పాప్కార్న్ అయినా, సమోసాలైనా సరే. గతంలో మనకు ఒకటిన్నర రూపాయల టికెట్ ఉంటే, టీ లేదా చిప్స్, సమోసాలు దొరికేవి. వాటిని బండి మీద అమ్ముతుంటే గేటు దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళం. ఆ తర్వాత థియేటర్లలో మనకు ఏసీ వచ్చింది. రూ.500కు పాప్కార్న్, రూ. 200నుంచి 300వరకూ ఖర్చు చేస్తే సమోసాలు దొరుకుతున్నాయి. అదే సమోసా బయట 5 నుంచి10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నేను ప్రతిరోజూ కనీసం రెండు సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నెలకు ఒక సినిమా చూడటం కూడా కష్టంగా ఉంది. నేను థియేటర్కు వెళ్తే, రోజూ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. నెలకు ఒక్కసారి వెళ్లినా కూడా నాకు 700 రూపాయలు ఖర్చు అవుతుంది. థియేటర్లలో ధరలు తగ్గించాలి. ఇది మాత్రమే కాదు, వాళ్ళు విడుదలయ్యే సినిమాలకు ధరలు పెంచుతున్నారు. టికెట్ల ధర వేలల్లో ఉంటోంది. అది అన్యాయం. ఇదంతా పైరసీకి లాభదాయకంగా మారుతోంది. అందుకే, అయూబ్ అమ్మూ ఒక హీరో అయ్యాడు. రాబిన్ హుడ్ లాగా, అతనికి ఒక ఫాలోయింగ్ వచ్చింది. కాబట్టి, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలి.- తమ్మారెడ్డి భరద్వాజ (సినీ నిర్మాత, దర్శకుడు)
ఐబొమ్మ రవిని ‘హీరో’ చేసిందెవరు?
ఐ బొమ్మ రవి. ఈ పేరుకు ఈ మధ్య కాలంలో మంచి ప్రాచుర్యం వచ్చింది. రవి చేసింది తప్పే. సినిమా ఇండస్ట్రీకి నష్టమే. చట్టం ప్రకారం శిక్షార్హమే. అయినా.. సామాన్యులు మాత్రం ఆయనను ‘రాబిన్ హుడ్’ లేదా ‘మధ్యతరగతి దేవుడు’ అని కొనియాడుతున్నారు. సినీ ప్రముఖులు రవిని తప్పు బడుతున్నారు. పోలీసులు రవి వెనుక ఉన్న కథ మొత్తం బయట పెడతామని చెప్పినా.. సామాన్యుల్లో మాత్రం రవికి మద్దతు తగ్గటం లేదు. పైరసీ తప్పే అని చెబుతూనే మధ్య తరగతి సినీ అభిమానులు రవికి అండగా నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కాదు. ప్రధాన కారకులు సినీ ప్రముఖులు. రవిని ఇంతలా సాధారణ ప్రజలు అభిమానిస్తున్నారంటే సినీ ప్రముఖులు అలర్ట్ కావాల్సిందే. అసలు రవి సినిమాల వైపు మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయం సినీ ప్రముఖులకు తెలియదా? తెలిసినా తెర మీద నటించినట్లుగానే బయట నటిస్తున్నారా? తమ రెమ్యునరేషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని హీరోలు.. ఖర్చు విషయంలో ఆలోచన చేయని దర్శకులు.. అవసరానికి మించి ప్రతిష్ఠకు పోయి అప్పుతెచ్చి మరీ సినిమాలు తీసుకున్న నిర్మాతలు.. ప్రేక్షకులను తమ ధరలతో భయపెడుతున్న సినిమా హాళ్లు.. అందులోని రేట్లతో కొనకుండానే షాక్ కొట్టే క్యాంటీన్లు.. ఇలా ఎక్కడ చూసినా అంతు లేని దోపిడీ. బలి అవుతుందని సామాన్యుడే.
థియేటర్‌లలో అమ్మే పాప్‌కార్న్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, అలాగే స్క్రీన్‌పై రన్ అయ్యే ప్రకటనలు ఈ మొత్తం ఆదాయానికి నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదని, వాటిలోనుంచి ఒక్క రూపాయి కూడా నిర్మాత జేబులోకి రాదని ప్రముఖ నిర్మాత ఎస్.కే.ఎన్. (శ్రీనివాస కుమార్) తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక సగటు కుటుంబం సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు మొత్తం 2,178 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ మొత్తం నుండి నిర్మాతకు కేవలం రూ. 372 మాత్రమే వస్తుందని ఆయన వివరించారు. మిగిలిన డబ్బు ఎక్కడికో ఎలా వెళ్తుందన్న వివరాలు ఇలా ఉన్నాయి: టికెట్ షేర్, మెయింటెనెన్స్ ఫీజు, థియేటర్‌లో అమ్మే F&B (Food & Beverages) ద్వారా మల్టీప్లెక్సులు మొత్తం రూ.1,545.33 వరకూ తీసుకుపోతాయి. ప్రభుత్వానికి జిఎస్‌టి రూపంలో రూ.182 వెళ్తుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన బిఎంఎస్ అయితే రూ. 78.67 వసూలు చేస్తుంది. మొత్తంగా చూస్తే నిర్మాతకు వచ్చే వాటా కేవలం 17% మాత్రమే అని ఆయన ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే, ఎస్.కే.ఎన్ చేసిన ఈ పోస్టుపై సినీ ప్రేక్షకులు ప్రశ్నల వర్షం కురిపించారు. థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న విషయాన్ని చర్చకు తెచ్చిన అభిమానులు థియేటర్‌లో ఒక చిన్న పాప్‌కార్న్ కోసం మూడు వందలు, కూల్ డ్రింక్ రెండు వందలు, వాటర్ బాటిల్‌కే 150 వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ దోపిడీపై మీరు మాత్రం ఏమీ చెప్పడం లేదెందుకు? అని ప్రశ్నించారు. తినుబండారాల ధరలపై నియంత్రణ మీ చేతుల్లో లేకపోతే, ఆ ధరల వల్ల ఇబ్బందిపడుతున్న ప్రేక్షకుల తరఫున పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి మాట్లాడటం, పరిష్కారం కోరడం మీ బాధ్యత కాదా? నిర్మాతకు ఆ ఆదాయంలో వాటా లేకపోతే, ప్రేక్షకులను రక్షించేందుకు కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదని అభిమానులు మండిపడ్డారు. ఇక్కడ ఒక్కటే స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరి లాభాలు వారికి కావాలి. ఒకవైపు సినీ పరిశ్రమ సాధారణ ప్రేక్షకుడి శ్రమ దోచుకోవటానికి అలవాటుపడితే, మరోవైపు సామాన్యుడి బలహీనత సొమ్ము చేసుకునేందుకు ఐ రవి లాంటి వారు ఎంట్రీ ఇచ్చారు. అంతే, సామాన్యుడు కోరుకుందీ.. రవికి కావాల్సింది ఒక్కటే.
రవి పైరసీ చేయటం నేరమే. శిక్షకు అర్హుడే. మరి.. సినిమా అభిమానించే ప్రేక్షకులు ప్రీమియర్ షో.. బెనిఫిట్ షో.. ప్రత్యేక షోల పేరుతో వందల రూపాయాల టికెట్లు వసూలు చేయటం ఏమనాలి? సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీ వైపు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని వాదిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొని మొదటి రెండు వారాల పాటు టికెట్లు రేట్టు పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే పాప్‌కార్న్ రేట్ల విషయంలోనూ జిఎస్‌టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ 2023లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, పాప్‌కార్న్, బెవరేజస్ లూజ్ సేల్స్ పేరుతో రూ.150 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. రూ.30 ఉండే పాప్ కార్న్ రూ.700 వరకు అమ్ముతుంటే, సినిమాలు ఏ విధంగా చూడాలని నిలదీస్తున్నారు. ఐ బొమ్మ సినిమాలు చూడటం కోసం వ్యక్తిగత సమాచారాన్ని లాగిన్ కోసం ఇచ్చి మరీ చూస్తున్నారంటే సినిమా కోసం టికెట్ల నుంచి ధియేటర్ల వరకు జరిగే దోపిడీ కంటే ఇది డేంజర్ కాదని ప్రేక్షకులు డిసైడ్ అయినట్లుగానే భావించాలేమో. సినీ పెద్దలు మాత్రం ఐ బొమ్మను తప్పు బడుతున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. సినీ పరిశ్రమ ఇలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తే దోచుకుంటున్నంత కాలం వారు ఐ బొమ్మ లేకుంటే ఓటీటీ… అదీ కాకుంటే టీవీల్లో వచ్చే వరకూ వేచి చూస్తారు. ఈ సినిమా పేరుతో జరిగే దోపిడీ భరించే సహనం ప్రేక్షకుడు కోల్పోయాడు. ఇప్పటికైనా నిర్మాత నుంచి థియేటర్ యజమాని వరకు తీరు మార్చుకోవాలి ఐ బొమ్మ రవి వ్యవహారం స్పష్టం చేస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఐ బొమ్మ రవిని ప్రేక్షకులు రియల్ హీరోగా చూడటం వెనుక వారి ఆవేదన ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. ఇది రీల్ హీరోలకు అర్దం అవుతుందా… లేదంటే మరో ఐ బొమ్మ పుట్టుకురావాల్సిందేనా.-బాలకృష్ణ ఎం(సీనియర్ జర్నలిస్ట్)