ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి
శీతాకాలం వచ్చిందంటే ఉత్తరభారతం ఊపిరి సలపలేక ఉక్కిరిబిక్కిరి అవుతుండడం ఏటా పరిపాటి అవుతోంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడుతున్నాయి. దీనికి తోడు పొగమంచు దట్టంగా వ్యాపించడంతో కళ్లకు దారి కనిపించక అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క మంగళవారం (16.12.2025 ) రోజునే ఉత్తరభారతంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి 25 మంది మృతి చెందడం అత్యంత శోచనీయం. పొగమంచు వల్లనే విమాన సర్వీస్‌లు ఆగిపోవడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. సోమవారం ఉత్తరభారతంలో మొత్తం 300 విమాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 131 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ శీతాకాలంలో గ్యాస్ ఛాంబర్‌గా మారిపోతోంది. వృద్ధులు, పిల్లలు అస్వస్థులవుతున్నారు. ఎక్కడా లేని అనారోగ్యం ఢిల్లీలో కనిపిస్తోంది.
వైద్య చికిత్స కావాలంటే ఢిల్లీ నగరాన్ని విడిచిపెట్టి మరెక్కడికైనా వెళ్లిపోండని వైద్యులు సిఫార్సు చేస్తున్నారంటే ఇది ఢిల్లీ పాలనపై హేయమైన ఆరోపణగానే భావించాలి. గాలిలో కాలుష్యానికి కారణమయ్యే వివిధ రకాల వాయువులు, రసాయనాల మిశ్రమాన్ని ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎంపి)గా పేర్కొంటారు. దేశంలో సగటున క్యూబిక్ సెంటీమీటర్‌కు ఎయిర్‌బోర్న్ పర్టిక్యులర్ మేటర్ (ఎంపి) 2.5 మైక్రోగ్రామ్స్ గాను, గాఢత 54.4 మైక్రోగ్రామ్ గాను సాగుతోంది. కానీ సోమవారం ఢిల్లీలో సరాసరి వాయు నాణ్యత 427 వరకు సూచించగా, మంగళవారం నాటికి 381 వరకు తగ్గి కొంత మెరుగు కనిపించింది. అయినా ఇంకా ‘వెరీ పూర్’ కేటగిరిలోనే ఢిల్లీ వాయు నాణ్యత కొనసాగుతుండడం గమనార్హం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గాలి నేలను తాకి కాలుష్యాలను వెదజల్లుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, రసాయన వాయువులు, పంట వ్యర్థాల దహనాలు, నిర్మాణాల దుమ్ముధూళి ఇవన్నీ ఏటా ఢిల్లీని శీతాకాలంలో నివసించలేని నగరంగా మారుస్తున్నాయి.
దీనికి పరిష్కారం అసాధ్యమేమీ కాదు. పాలక వర్గాలు కొన్ని చర్యలు తీసుకుంటే ఈ కాలుష్య భూతాన్ని అరికట్టవచ్చు. ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం ఢిల్లీకి కాలుష్య నివారణ మార్గదర్శకాలను దశల వారీగా అందించడానికి సంసిద్ధమైంది. చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని’గా రికార్డుకెక్కినప్పటికీ దశాబ్ద కాలం లోనే ఆ అపఖ్యాతి నుంచి బయటపడగలిగింది. చైనా, భారత్ ఈ రెండు దేశాలు కాలుష్యంతోపాటు విపరీత నగరీకరణతో పోరాడుతున్నాయని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ పేర్కొనడం గమనార్హం. స్వచ్ఛమైన గాలిని పొందడం రాత్రికి రాత్రి సాధ్యం కాదు. కానీ దశలవారీగా తగిన నియంత్రణ చర్యలు చేపడితే సత్ఫలితాలు లభిస్తాయి. ఈ మేరకు జింగ్ కొన్ని సూచనలు చేశారు. యూరో 6 నిబంధనల ప్రకారం బిఎస్ 6 ప్రమాణాలు పాటించాలని ఆమె సూచించారు.
అత్యధిక కర్బన ఉద్గారాలను వెదజల్లే పాత వాహనాలను దశల వారీగా తొలగించడం, వాహనాల పెరుగుదలను నియంత్రించడం, వాహనాల నంబర్ ప్లేట్ చివరి అంకె ఆధారంగా సరిసంఖ్య, బేసిసంఖ్య చూసి వారం లోని నిర్దిష్ట రోజుల్లో మాత్రమే వాటిని నడపడానికి అనుమతించడం, ప్రమాణాల ప్రకారం బస్సుల నిర్మాణం జరిగేలా చూడడం ఇవన్నీ తక్షణ అవసరాలని ఆమె సూచించారు. సంప్రదాయ ఇంధనం వాహనాలకు వినియోగించకుండా మెథేన్, సిఎన్‌జి, హైడ్రోజన్ వంటి హరిత ఇంధనం వినియోగించాలన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. ఖాళీ అయిన ఫ్యాక్టరీలను పార్కులుగా, వాణిజ్య జోన్లుగా, సాంస్కృతిక, సాంకేతిక హబ్‌లుగా తీర్చి దిద్దాలి. దీనికి ఉదాహరణగా చైనాలో షౌగాంగ్ అనే పరిశ్రమల కాంప్లెక్సును 2022 నాటి శీతాకాల ఒలింపిక్ క్రీడోత్సవాల ప్రాంగణంగా వినియోగించారు. బీజింగ్‌లో జనం రద్దీని తగ్గించడానికి హోల్‌సేల్ మార్కెట్లను, లాజిస్టిక్ హబ్స్‌ను, కొన్ని విద్య, వైద్య సంస్థలను నగరానికి దగ్గరగా వేరే చోటకు తరలించారు.
బీజింగ్ నుంచి సాధారణ ఉత్పత్తి, తయారీ సంస్థలను హెబెయి ప్రావిన్స్‌కు తరలించినప్పటికీ, అత్యున్నత పరిశోధన, అభివృద్ధి, సేవా రంగాలను బీజింగ్ పొందగలిగింది. 2013 లో చైనా కాలుష్య నివారణకు ఐదేళ్ల జాతీయ కార్యాచరణ ప్రణాళిను అమలు చేయడం ప్రారంభించింది. బీజింగ్‌లో బొగ్గుతో మండే బాయిలర్‌లను మూసి వేయించింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించింది. హరిత ఇంధనం వాహనాలను పరుగెత్తించింది. పెట్రోలు, డీజిల్ వంటి కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధనానికి స్వస్తి పలికింది. కొన్నేళ్ల పాటు కఠినంగా వీటిని అమలులోకి తేవడంతో విజయం సాధించింది. ఇప్పుడు చైనా దౌత్య కార్యాలయం ఈ చర్యలను సూచించడం ఢిల్లీ స్వాగతించవలసిందే. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు విన్న ఈ సూచనలు అమలు లోకి తీసుకు రావడమే అగ్నిపరీక్ష. వీటిలో కొన్నైనా ఢిల్లీ పాలక వర్గాలు అమలు చేయగలిగితే కొంతవరకు విజయం సాధించగలుగుతారు. దేశంలో బిఎస్ 6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలను, తయారీని 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే సుప్రీం కోర్టుకు విన్నవించినా ఎంతవరకు ఇది అమలైందో మనకు తెలిసిందే.