ఉగ్రవాదభూతం పీచమణచాలి
దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపాయి. అంతకుమించి, ఉగ్రవాదులు తమ విధ్వంసకాండను అమలుపరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఓ మెట్రోస్టేషన్ వద్ద మొన్న రాత్రి పొద్దుపోయాక ఒక కారులో జరిగిన భారీ పేలుడు పదమూడు మందిని బలిగొనగా, మరో 24మందిని గాయాలపాలు చేసింది. పేలుడు తీవ్రత పరిసర జనాలను కకావికలం చేసింది. అనేక వాహనాలు ధ్వంసం కాగా, చుట్టుపక్కల దుకాణాలు సైతం దెబ్బతిన్నాయి. ఇంతటి భారీ పేలుడుకు కారణం ఉగ్రవాదమే అయి ఉంటుందనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు, అదే రోజు భారీ ఉగ్ర కుట్రను మన పోలీసులు భగ్నం చేశారు. మూడు రాష్ట్రాలలో ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి, ఆరా తీయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు భారీయెత్తున మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు, విద్యావంతుల్ని తమవైపు తిప్పుకుని, వారి సహాయంతో విధ్వంసకాండకు ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నారని తేలడం విస్తుగొలుపుతోంది. హస్తినలో కారుబాంబు పేలుడుకు పాల్పడినది ఉమర్ అనే ఒక వైద్యుడని, శక్తిమంతమైన అమోనియం నైట్రేట్‌ను ఉపయోగించి ఆత్మాహుతికి పాల్పడి ఉండవచ్చునని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ రెండు సంఘటనలకూ ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులకు లభించిన పేలుడు పదార్ధాలలో భారీయెత్తున అమోనియం నైట్రేట్ ఉండటమే కాదు, ఆ కేసులో అరెస్టయిన వైద్యులతో ఆత్మాహుతి చేసుకున్న వైద్యుడికీ సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజధాని హస్తినలో విధ్వంసం సృష్టించి, దేశంలో శాంతిభద్రతలకు సవాల్ విసిరేందుకు ఉగ్రవాదులు సాగిస్తున్న ప్రయత్నాలు ఈనాటివి కావు.
1985లో ట్రాన్సిస్టర్ బాంబులతో 49మందిని బలిగొనడం ద్వారా తమ దాడులను ఆరంభించిన ముష్కరులు, పార్లమెంటుపై దాడి సహా పలుమార్లు హింసాకాండకు తెగబడ్డారు. ఈ నలభయ్యేళ్లలో ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 92 మందికి పైగానే అసువులు బాసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ చేపట్టిన అధ్యయనంలో తేలింది. అయితే కొంతకాలంగా ఉగ్రవాదం కోరలు పెరికివేసేందుకు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటా బయటా చేస్తున్న ప్రయత్నాలతో ఊపిరి సలపని ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తాజాగా వెలుగుచూసిన ఉగ్రకుట్రతో వెల్లడైంది. భారతదేశంలో తమ ఆటలు ఇక సాగవని తెలుసుకున్న జైషే మహమ్మద్, ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఎజియుహెచ్ ఉగ్ర సంస్థ.. ఉన్నత విద్యావంతులను లోబరచుకుని, వారి సహాయంతో ధ్వంసరచన అమలుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళా వైద్యురాలితో సహా ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేసి, వారినుంచి భారీయెత్తున పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఫరీదాబాద్‌లో అరెస్టయిన ఒక డాక్టర్ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్ధాలు లభ్యం కావడాన్ని చూస్తే, విద్యావంతులు సైతం ఉగ్రవాదం వైపు ఎంతలా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతుంది. హైదరాబాద్‌కు చెందిన మరో డాక్టర్ స్వయంగా ఒక విషాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషాలలో ఒకటిగా పేర్కొనే రిసిన్ అనే విష ద్రావకాన్ని ఆలయ ప్రసాదాలలోనూ, మంచినీళ్లలోనూ కలిపి అమాయకుల ప్రాణాలు హరించడమే సదరు వైద్యుడి పథకమని వెల్లడి కావడం గమనార్హం. అంటే, బాంబులు, ఆత్మాహుతి దాడులతోనే కాకుండా, సామూహిక విషప్రయోగాలు చేసి, వేలాదిమంది అమాయకుల ప్రాణాలను కబళించాలన్నది ఉగ్రవాదుల దుర్మార్గపుటాలోచనగా తెలుస్తోంది. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటున్నట్లు తాజా సంఘటనలను బట్టి విశదమవుతోంది. ప్రాణాలను రక్షించవలసిన వైద్యులే ఉగ్రవాదులై అమాయకుల ప్రాణాలను కబళించబూనడం అమానుషం. మొక్కై వంగనిది మానై వంగదన్నట్లు మొగ్గ దశలోనే ఈ తరహా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టకపోతే, భరతజాతి ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటుందనడంలో సందేహం లేదు. ముందుగా, ఢిల్లీ పేలుళ్లకు కారకులెవరో, వారివెనుక ఉన్నదెవరో కూపీలాగి, వారి భరతం పట్టాలి. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని, వారికి ఊతమిచ్చింది దాయాది దేశమేనని తేలిన పక్షంలో అంతర్జాతీయ సమాజాన్ని జాగృతం చేసి, గట్టి గుణపాఠం చెప్పాల్సిందే. భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఫలితమెంత దారుణంగా ఉంటుందో ఈసారి దాయాదికి మరింత స్పష్టంగా తెలియజేయాలి.