గాడ్సే ఆరాధకుల కోసమే ‘గాంధీ’ పేరు తొలగింపు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ ఆర్‌ఇజిఎ)నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే ప్రయత్నం, బిజెపి, నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న ప్రజావిరోధి, క్రూరమైన ఉద్దేశాలను స్పష్టంగా బయటపెడుతోంది. ఎం.జి. నరేగా ద్వారా ఇప్పటివరకు 15.5 కోట్ల మంది క్రియాశీల గ్రామీణ కార్మికులకు ఉపాధి లభించింది. వీరిలో దాదాపు 50% మహిళలు. లబ్ధిదారుల్లో అధిక శాతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పీడిత వర్గాలకు చెందినవారే. గ్రామస్వరాజ్యం -ప్రతి గ్రామం స్వయం సమృద్ధిగా ఉండాలన్నది గాంధీజీ కల. ఆ కలను రూపం లోకి తీసుకువచ్చిన చట్టమే ఎం.జి. నరేగా. కానీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ చట్టాన్ని బలహీనపరచడం, క్రమంగా నిర్వీర్యం చేయడం అనే దిశలోనే పని చేస్తోంది. పేదల కోసం అన్నట్లు మాట్లాడే మోడీ ప్రభుత్వం వాస్తవంగా వందమంది కార్పొరేట్ కుటుంబాల అభివృద్ధికే కట్టుబడి ఉంది. నరేగా పై కొనసాగుతున్న దుష్ప్రచారం మొత్తం గోబెల్స్ తరహా అసత్య ప్రచారమే. మహాత్మా గాంధీ పేరు తొలగించడం యాదృచ్ఛిక చర్య కాదు. ఇది గాంధీ హంతకుడు గాడ్సేను ఆరాధించే కాషాయ శక్తులను సంతృప్తి పరచడానికే తీసుకున్న రాజకీయ నిర్ణయం. నరేగా స్థానంలో మరో కొత్త చట్టం తీసుకురావాలన్న ప్రయత్నం కూడా ఇదే అజెండాలో భాగం. కొత్త చట్టంలో: ‘సంవత్సరానికి 100 రోజులు నుంచి 150 రోజులు ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు ఇది కేవలం మోసం. ‘ఖర్చులో 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అని ప్రతిపాదిస్తున్నారు. దీని వల్ల ‘ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలు ఈ భారాన్ని మోయలేకపోతాయి. ‘చివరకు ఉపాధి హామీ పథకం ప్రయోజన రహితంగా కూలిపోతుంది. ఇంకా, గ్రామ పంచాయతీలకు పనుల ఎంపికలో అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఏ పని చేయాలో ఆదేశిస్తుంది. పెరుగుతున్న ధరల మధ్య వేతన పెంపుపై ఒక్క మాట లేదు. ఇది 15.5 కోట్ల గ్రామీణ పేదలపట్ల ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న అమానుష వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది.
ఇప్పటివరకు నరేగా పథకానికి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ. 10 లక్షల కోట్లు. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి మరణాలు, ఉపాధి లేని వారి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. కానీ అదే సమయం లో 2021 -22 వరకు కార్పొరేట్లకు రూ. 8 లక్షల కోట్లు పన్ను రాయితీలు, 2022 -2024 మధ్య మరో రూ. 3 లక్షల కోట్లు, మొత్తం పన్ను రాయితీలు రూ. 11 లక్షల కోట్లు కార్పొరేట్ రుణ మాఫీలు రూ. 16.5 లక్షల కోట్లు. అంటే మొత్తం మీద 100 మంది కార్పొరేట్ మిత్రులకు రూ. 28 లక్షల కోట్లు, 15.5 కోట్ల పేదలకు కేవలం రూ. 10 లక్షల కోట్లు, ఇదే బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల పేదల వ్యతిరేక విధానం. వ్యవసాయ సంక్షోభం-గ్రామీణ విపత్తు, స్వాతంత్య్రం వచ్చి 8దశాబ్దాలు గడిచినా పేదరికం, ఆకలి, నిరుద్యోగం ఇవన్నీ దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవం ఏమిటంటే: గ్రామాలనుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. వ్యవసాయం నష్టాల వృత్తిగా మారింది. కనీస మద్దతు ధరలేదు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉదాహరణలు: కర్నూలు జిల్లాలో టమాటా రైతులు రోడ్లపై పంట పారేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పత్తి రైతులు నష్టాల్లో ఉన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువు ఛాయలు. తీరాంధ్రలో వరదలు, భారీ వర్షాలతో నానిపోయిన ధాన్యం. యుపిఎ 1 ప్రభుత్వ కాలంలో, వామపక్ష పార్టీలే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రతిపాదించాయి. గ్రామీణ నిరుద్యోగుల ఆత్మహత్యలకు చెక్ పెట్టే విప్లవాత్మక ఆలోచన ఇది. అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీవ్రంగా వ్యతిరేకించినా, వామపక్షాల ఒత్తిడితో 2006లో చట్టంగా మారింది. గాంధీజీ కలకు ప్రతీకగా దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టారు. ఉపాధి హామీ దానం కాదు నరేగా డబ్బుల వృథా అన్న ప్రచారం పూర్తిగా అసత్యం. ఇది పని చేయడానికి హక్కు కల్పించే చట్టం. సోవియట్ యూనియన్‌లో లెనిన్ ప్రవేశపెట్టిన ‘సబ్‌బోట్నిక్స్’ ద్వారా ప్రతి పౌరుడిలో శ్రమ విలువను పెంచారు. ఆ స్ఫూర్తితోనే నేను కూడా నా స్వగ్రామం ఐనంబాకంలో నరేగా పనుల్లో 8 గం. పని చేశాను, కార్మికులతో కలిసి అక్కడే భోజనం చేశాను. అవును, అమలు లో లోపాలు ఉన్నాయి. కొంతమంది భూస్వాములు, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నా రు. అలాంటి వారిని అరెస్ట్ చేసి, ఆస్తులు స్వాధీనంచేసుకోవాలి. కానీ అవినీతిపేరుతో చట్టాన్ని చంపడం నేరం. 15 రోజుల్లో వేతనం, సమాన పనికి సమాన వేతనం, వలసలు, ఆత్మహత్యలకు అడ్డుకట్ట. కార్పొరేట్లకు రూ. 28 లక్షల కోట్లు ఇచ్చే ప్రభుత్వం, 15.5 కోట్లపేదల జీవనాధారమైన నరేగాను ఎందుకు రక్షించలేకపోతోంది? మహాత్మాగాంధీ పేరు తొలగించడం పరిపాలనా సంస్కరణ కాదు-అది భావజాల విధ్వంసం. ఈ ప్రగతిశీల చట్టాన్ని కాపాడటం ప్రతి ప్రజాస్వామ్య శక్తి బాధ్యత.
డా. కె.నారాయణ