ఎడిటోరియల్
Auto Added by WPeMatico
పాక్ ఖనిజాలపై ట్రంప్ కన్ను
స్థానిక ఎన్నికలు సీతక్కకు అగ్నిపరీక్షే
స్వయం సమృద్ధ భారత్ సాధ్యమా?
వరద నివారణ ప్రణాళిక తప్పనిసరి
మానవాభివృద్ధికి దోహదపడని ఆర్థిక ప్రగతి దేనికి?
నేతల అంచనాలు తలకిందులు
నదీనదాలు.. ప్రజోపయోగ నిధులు
నదుల సంరక్షణపై పోరాడిన బ్రిటీష్ కొలంబియాకు చెందిన నదుల సంరక్షణ సంస్కర్త మార్క్ ఏంజిలో స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితి ఏటా సెప్టెంబర్ 4వ ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుతున్నది. వందకు పైగా దేశాల్లో జరిగే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం నదులను కాలుష్యం నుండి కాపాడడం, వాతావరణంలో సంభవిస్తున్న అవాంఛనీయ మార్పులకు అడ్డుకట్టవేయడం. ఇప్పటికే దేశం లో నదీజలాల పంపిణీ విషయంలో అంతరాష్ట్ర వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అధిక వర్షాలతో అపారమైన జలసంపద కడలి పాలై నిరుపయోగంగా మారుతున్నది. నదుల కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. నదులు అంతర్ధానం కాకుండా, నదులను కాలుష్య రహితంగా మార్చి సాగునీటికి, తాగునీటికి లోటులేకుండా చేయాలి. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలు, మితిమీరిన నీటి వినియోగం, కాలుష్యం వలన భవిష్యత్తులో నదులు అంతరించే అవకాశముంది. వీటితోపాటు అడవులను నరికి వేయడం, వర్షాభావం, పర్యావరణాన్ని పట్టించుకోకుండా నిర్మించే ఆనకట్టల వల్ల నదులు నిర్జీవంగా మారే ప్రమాదం పొంచి ఉంది. గంగా నదీ కాలుష్య ప్రక్షాళన దాదాపుగా విఫలమైనది.
యమునా నది కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచ మానవాళికి నదులు చేస్తున్న మహోపకారం మరువలేనిది. అపారమైన జలసంపదతో తులతూగే నదులను పరిరక్షించుకోవడం మన కనీస బాధ్యత. గతం వర్తమానంగా, వర్తమానం భవిష్యత్తుగా పరివర్తన చెందడం సహజ ప్రక్రియ. ‘గతం గతః’ అని, ‘గతజలసేతు బంధనంబు..తగదు’ అంటూ గత విషయాలను వదిలేస్తే వర్తమానం దుర్భరంగా, భవిష్యత్తు అంధకార బంధురంగా మారక తప్పదు. గతం వర్తమాన, భవిష్య కాలాలను శాసించే శిలాశాసనం. ఇప్పటి వరకు మనం నదుల విషయంలో, నదీ జలాల విషయంలో శ్రద్ధ చూపలేకపోయాం. గతంలో జరిగిన తప్పిదాలు ఇక ముందు పునరావృతం కారాదు. నదుల్లో నీరు వృథాగా పోవడం రాబోయే సంక్షోభానికి సూచనగా ఎంతోమంది జలవనరుల నిపుణులు దశాబ్దాల నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయినా పట్టించుకోని పాప ఫలితమే ప్రజలపాలిట శాపమై కూర్చుంది. ఇకనైనా నదీజలాల సక్రమ వినియోగం, నదుల సంరక్షణపై తగిన శ్రద్ధ వహించకపోతే రాబోయే కాలమంతా ప్రజలు తీవ్ర నీటిఇబ్బందులకు గురికాక తప్పదు. నదుల్లో కాలుష్యం అరికట్టకపోతే జలచరాలన్నీ అంతరించిపోగలవు. మానవవిజ్ఞానం ఎంత పెరిగినా, మనిషి హృదయం తరిగిపోయి, అత్యాశ పెరిగిపోయి తన పతనానికి తానే బాటలు వేసుకుంటున్నాడు. పచ్చదనం నశించింది, పర్యావరణం చెడింది. భూతాపం పెరిగింది. కాలుష్యం కట్టలు తెంచుకుని, వరద గోదారిలా జనజీవనాన్ని ముంచెత్తుతున్నది. నదులన్నీ తరిగిపోతున్నాయి. నదుల్లో కాలుష్యం తారస్థాయికి చేరింది. ఇంతటి విపత్తును మునుపెన్నడూ కనలేదు. మానవ మనుగడకు ఆధారమైన నదులను పరిరక్షించకపోతే భవిష్య పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి.
నదులు ప్రకృతి ప్రసాదించిన వరం. నదులే నాగరికతకు చిహ్నాలు. నదీ తీరప్రాంతాల్లోనే జనజీవనం అధికం. ప్రపంచంలో ఎన్నో నదులున్నాయి. నైలు నది, మిసిసిపి, హోయాంగ్ హో, అమెజాన్, కాంగో వంటి నదులు ప్రపంచంలో పేరొందిన నదులు. ఈజిప్టును నైలునదీ వరప్రసాదం అంటారు. ఈ నది ప్రక్కనే అనేక చారిత్రక కట్టడాలు వెలిసాయి. నదులు శక్తి వనరులు. సింధు నాగరికత, హరప్పా మెహంజదారో నాగరికత గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. నదీసంపద నిలకడగా ఉంటే ఏ దేశ అభివృద్ధి అయినా స్థిరంగా ఉంటుంది. అలాంటి నదీజలసంపద కడలిపాలవుతున్నది. భారత దేశంలో నదులకు కొరతలేదు. జీవనదులు, వర్షాధార నదులతో భారత ఉపఖండం ప్రకృతి మాత ఒడిలో పూదండ లా రాణిస్తున్నది. భారత దేశంలో ఎన్నో నదులు, ఉపనదులున్నాయి. నదీ వ్యవస్థకు భారతదేశం పుట్టినిల్లు. అందుకే భారత్ ను ‘లాండ్ ఆఫ్ రివర్స్’ గా పిలుస్తారు. నదీ తీరంలో అరణ్యాలు, జంతుసంపద ఏర్పడుతున్నాయి. తాగునీటికి, రవాణాకు, మత్స్య సంపదకు నదులే సోపానాలు. జలవిద్యుత్, సాగునీటికి నదులే ఆధారాలు. నదుల వలన కలిగే ప్రయోజనాలు అపారం.
నదులు ప్రకృతి సంపదలో ఒకభాగం. ఎక్కడైతే నదులు, నీటి ప్రవాహాలు ఉంటాయో, అక్కడే మానవ ఆర్ధిక వికాసం వెల్లివిరుస్తుంది. నదులు, నీటి వనరులు లేక పోతే మానవ జీవనం దుర్భరం. అలాంటి నదులను కాలుష్యంతో నింపేస్తున్నాం. నదీ పరీవాహక ప్రాంతాల్లో వెలసిన గ్రామాలు, నగరాల వలన కాలుష్య సమస్య తలెత్తింది. వినియోగించిన నీటిని నదుల్లోకి శుద్ధి చేయకుండా వదిలేయడం, వాడి పారేసిన ప్లాస్టిక్ వంటి వ్యర్ధ పదార్ధాలను నదుల్లో వదలడం ఘోరం. దీనివలన నదీజలాలు కలుషితమైపోతున్నాయి. నదులనుండి సముద్రాల్లో కలిసే నీటి వలన సముద్ర జలాలు కలుషితం కావడం, సముద్ర జీవరాశులు చనిపోవడం, పర్యావరణ విధ్వంసం జరగడం భావ్యం కాదు.
ఇలాంటి పరిస్థితులను నిలువరించి, నదులను పరిరక్షించాలనే ధ్యేయంతోనే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నదుల సంరక్షణపై అనేక కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ప్రజల్లో నదులపట్ల, నీటిపట్ల చక్కని అవగాహన కోసం జరిగే ఒక ముఖ్యమైన సందర్భమే ప్రపంచ నదుల దినోత్సవం. నదులను పరిరక్షించి ప్రపంచ మానవాళి మనుగడను కాపాడాలన్న ధ్యేయంతో జరిగే ప్రపంచ నదుల దినోత్సవం రాబోయే ఉపద్రవానికి అడ్డుకట్ట వేయాలి. నదుల పరిరక్షణ విషయంలో అశ్రద్ధను వీడి బృహత్తర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలి. ఏదిఏమైనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ నదుల సంరక్షణ విషయంలో సమష్టి బాధ్యత వహించాలి.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463
(నేడు ప్రపంచ నదుల దినోత్సవం)