రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉండే కాలంలో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే ఆయన లేదా ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీకే ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని వదిలేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ మృతి చెందిన ఆ నేతకు గౌరవంగా నివాళులు అర్పించేవారు. క్రమక్రమంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అనే మాట అంతరించిపోయి బద్ధ శత్రువులు మిగిలారు. ఇటీవలి కాలంలో, అవి జాతీయ రాజకీయాలైన, ప్రాంతీయ రాజకీయాలైనా అన్ని పార్టీలు ఒకరినొకరు శత్రువులుగానే పరిగణిస్తూ ఉండటం చూస్తున్నాం.
ఇప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు పోటీని ‘స్పోర్టివ్’గా తీసుకోవడం మానేశాయి. అవతలి పక్షాన్ని ఓడించి తామే గెలవాలన్న పట్టుదల పెరిగింది. ఇది యుద్ధంలో శత్రువులు ఎంత మందినైనా చంపి విజయం సాధించాలన్న రాజ్యకాంక్ష వంటిది. అది ఇప్పుడు మనకు ఎల్లెడలా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఉచ్చనీచాలు మరిచిపోయి, స్థాయిని విస్మరించి అవతలిపక్షం వారిని అవమానించే విధంగా మాట్లాడటం, ప్రకటనలు చేయడం పరిపాటి అయింది. ఈ పక్షం ఆ పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అట్లానే తయారవుతున్నాయి. ఇక ఎన్నికల అప్పుడు సరే సరి. పోటీలు పడి వ్యక్తిగత విమర్శలు, అవతలి వారి వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని స్థితి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరపవలసిన అవసరం ఏర్పడింది. నిజానికి ఇది పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం. దీని పరిధిలో జూబ్లీహిల్స్ లేకపోవడం ఓ విచిత్రం. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా ఈ ఉపఎన్నిక జరపవలసి వచ్చింది. గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై పార్టీ మారి భారత రాష్ట్ర సమితిలో చేరి ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి.
ప్రస్తుతం ఆయన సతీమణి సునీత భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే యువ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా లంకల దీపక్ రెడ్డిని పోటీలోకి దింపింది. ఇక్కడ అంత ప్రాముఖ్యం లేకపోయినా ఒక విషయం సరదాగా అయినా గుర్తు చేసుకోవాలి. ఈ ముగ్గురు అభ్యర్దులూ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీతో సంబంధం ఉన్న వారే. ముందే చెప్పుకున్నట్టు బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీత భర్త మాగంటి గోపినాద్ మొదట తెలుగు దేశం శాసన సభ్యుడే కాగా బీజేపీ ప్రస్తుత అభ్యర్థి రాజకీయ ప్రస్తానం కొంత కాలం చంద్రబాబు నాయుడు పార్టీలోనే.
ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను 2019కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో పార్టీలో చేరడానికి శ్రీశైలం యాదవ్ తీసిన ఊరేగింపును ఆనాటి హోంమంత్రి ఏ. మాధవ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కూడా. ఆరోజుల్లో అది పెద్ద చర్చనీయాంశం కూడా అయింది. సరే ఇప్పుడిక్కడ ఆ పార్టీకి పెద్ద ప్రాముఖ్యత లేదనుకోండి, అయినా మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చాను, సెల్ ఫోన్ నేనే తెచ్చాను అన్న చందంగా అన్ని పార్టీల అభ్యర్ధులను నేనే తెచ్చాను అని కూడా చంద్రబాబు చెప్పుకోగలరు.
ఇక ప్రస్తుతానికి వొస్తే, సానుభూతి పవనాలు వీచి తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం, ఈ రెండేళ్లలో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అన్న అభిప్రాయంతో తమ గెలుపు తధ్యమని అభిప్రాయంలో బిఆర్‌ఎస్ ఉంటే, ఉప ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన ఫలితాలనిస్తాయని ఒక అభిప్రాయంతో పాటు తాము వెనుకబడిన తరగతుల 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి చూపిన చొరవ, చిత్తశుద్ధి పనిచేసే తాము నియమించిన యువ బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం అని భావిస్తున్నది అధికార కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లలో దాదాపు 1,20,000 ఓట్లు మైనారిటీలవి ఉండడం, ఈసారి మజిలీస్ పార్టీ పోటీ చేయకుండా అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం కూడా తనకు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్న పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చునని అభిప్రాయం సర్వత్ర ఉన్నది.
సరిగ్గా మరో రెండు వారాలకు ఎన్నిక జరగనున్న ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పక్షాలు పట్టుదలగా పనిచేయడానికి కారణాలు ఉన్నాయి. వాటిని గురించి చర్చించే ముందు ప్రత్యర్థులు శత్రువులుగా మారి పోటీలు పడుతున్న ఈ తరుణంలో ప్రజలలో సానుభూతి అనే అంశం అంతగా ప్రభావం చూపడం లేదని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు వివిధ కారణాల చేత ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జనం భిన్నమైన ఫ లితాలని రాజకీయ పక్షాలకు రుచి చూపించారు. 2016 లో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో, ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం బీఆర్‌ఎస్ పరమయింది. అట్లాగే పాలేరులో కూడా కాంగ్రెస్ స్థానం బీఆర్‌ఎస్ వశమైంది. ఇక్కడ సానుభూతి పనిచేయలేదు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి టిఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికై మంత్రి అయ్యారు. 2019లో లోకసభకు ఎన్నికైన కారణంగా ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినందు వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు.
2020లో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణిస్తే ఆయన సతీమణిని బీఆర్‌ఎస్ పోటీకి నిలిపినా అక్కడ అనూహ్యంగా ప్రజలు బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించారు. దుబ్బాకలో సానుభూతి పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పక్షమే గెలుస్తుందన్న వాదన కూడా పటాపంచలైంది. ఇక 2021లో నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య మరణిస్తే ఆయన కుమారుడు నగేష్ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే జనం ఓట్లు వేసి గెలిపించారు. ఇట్లా దుబ్బాక నాగార్జునసాగర్‌లలో ఫలితాలు పూర్తి భిన్నంగా రావడానికి ఇతరేతర కారణాలు ఉంటాయి.
అదే సంవత్సరంలో హుజరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక గురించి, ఆ వెనువెంటనే 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌ను అకారణంగా, అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించడం, పార్టీ నుండి వెలివేయడం, అవినీతి కేసులు పెట్టడం వంటివి చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయాన్ని వ్యతిరేకించి హుజరాబాద్ ప్రజలు బిజెపి టికెట్ తెచ్చుకున్న ఈటెల రాజేందర్‌ను గెలిపించారు. దళిత బంధు వంటి బీఆర్‌ఎస్ జిమ్మిక్కులు కూడా అక్కడ పని చేయలేదు. బిజెపి ఘనత కంటే ఈటెల రాజేందర్‌కు ప్రజలలో ఉన్న వ్యక్తిగత పలుకుబడి, కేసీఆర్ నిర్ణయాల పట్ల పెరిగిన వ్యతిరేకత బాగా పనిచేసాయి.
అదే మునుగోడు దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి ప్రజలు బిఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. అయితే మునుగోడులో భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ ఒకసారి తన సహజ మిత్రులని కౌగిలించుకొని భవిష్యత్తులో ఇంకెప్పుడు వారితో మిత్రత్వం వదులుకోబోనని కెసిఆర్ బోలెడు వాగ్దానాలు చేసిన కారణంగా ఆ పార్టీకి సంబంధించిన పదివేల ఓట్లు పడి అంతే తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థి బయటపడి కెసిఆర్, బీఆర్‌ఎస్ పరువు దక్కినట్టు అయింది . హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు సానుభూతి పనిచేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అది ఏ మాత్రం సాయం చేయలేదు.
ఇక ఈ క్రమంలో జరిగిన చివరి ఉప ఎన్నిక 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే మరణించిన గడ్డం సాయన్న కూతు రు లాస్య నందిత ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎ మ్మెల్యేగా గెలిస్తే ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మ రణించాక ఆమె సోదరి నివేదితని పోటీకి నిలిపితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ సానుభూతిని కాదని అధికారం గెలిచింది. ఓ పక్క 2023లో అధికారం కోల్పోయి, 2024లో ఒక్క లోక్‌సభ స్థానం గెలుచుకోలేకపోయిన బిఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్ ఓటమి మూలి గే నక్క మీద తాటి పండు పడ్డ సామెతగా తయారైంది.
ఇక ఎవరి బలం ఎంతో స్పష్టంగానే ఉన్న సమయంలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు పట్టుదలకు పోతున్నాయి అంటే, బీఆర్‌ఎస్‌కు ఇద అగ్ని పరీక్ష వంటిది. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ చుట్టుపక్కల గల నగర నియోజకవర్గాలన్నీ గెల్చుకున్నది. అధికారంలోకి వొచ్చాక కాంగ్రెస్ ఇది దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం దాని చుట్టూ చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అయితే పార్టీ మనుగడ కష్టం కాబట్టి జూబిలీహిల్స్‌ను నిలుపుకోవాలన్న పట్టుదల బీఆర్‌ఎస్‌ది. స్థానిక ఎన్నికల ముంగిట్లో జూబ్లీహిల్స్ గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుందన్న ఆలోచన కాంగ్రెస్‌ది.