అమెరికాలో షట్‌డౌన్ ట్రంప్ పుణ్యమే!
అమెరికా షట్‌డౌన్ గందరగోళంలో పడింది. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడపడానికి కావలసిన నిధులు చట్టసభ సభ్యులు (హౌస్ అండ్ సెనేట్) ఆమోదించకపోతే పరిస్థితి సంక్షోభంలో పడినట్టే. సాధారణంగా అమెరికా కాంగ్రెస్‌లోని ప్రధాన పార్టీలు అయిన రిపబ్లికన్స్, డెమొక్రాట్స్ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షునికి, కాంగ్రెస్‌కు మధ్య ఒప్పందం కుదరకపోతే ప్రభుత్వానికి నిధులు లభించవు. ఇలాంటి సమయంలో ఖర్చులను తగ్గించుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం షట్‌డౌన్ ప్రారంభిస్తుంది. ఈ సంవత్సరం బిల్లుల ఆమోదంలో రిపబ్లికన్లకు, డెమొక్రాట్లకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ప్రభుత్వాన్ని మూసివేయాల్సిన (షట్‌డౌన్) పరిస్థితికి దారి తీసింది. రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టగా, డెమొక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపును కోరారు. ఆరోగ్య సంరక్షణకోసం వందల బిలియన్ డాలర్ల నిధులను పునరుద్ధరించాలని డెమొక్రాట్లు కోరుతున్నారు.
ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చలనుంచి వేరుగా చర్చించాలని రిపబ్లికన్లు సూచించగా, డెమొక్రాట్లు అంగీకరించలేదు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు రావాలి. రిపబ్లికన్ల నుంచి 55 ఓట్లు వచ్చినప్పటికీ అవి సరిపోలేదు. దీంతో బిల్లులు వీగిపోయాయి. అలాగే డెమొక్రాట్లు ప్రతిపాదించిన మరో బిల్లు కూడా 47 53 తేడాతో వీగిపోయింది. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక చిక్కుల్లోపడింది. దీంతో గడచిన ఆరేళ్లలో తొలిసారిగా షట్‌డౌన్‌ను ఎదుర్కొన్న 15వ ప్రభుత్వంగా ట్రంప్ పరిపాలన రికార్డుకెక్కనుంది. డెమొక్రాట్ల డిమాండ్లను కొన్నిటికి ట్రంప్ అంగీకరిస్తే షట్‌డౌన్‌ను నివారించవచ్చని సెనేట్ రిపబ్లికన్ నాయకుడు జాన్ థూన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ విధానం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. షట్‌డౌన్ జరిగితే తన పాలనలో చాలా మంది ఫెడరల్ ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తానని, అప్పుడు ఎక్కువ మంది డెమొక్రాట్లు ఉంటారని హెచ్చరికలు పదేపదే చేస్తుండడం సంచలనం కలిగిస్తున్నాయి.
ఈ షట్‌డౌన్ మొత్తం అమెరికా మీద విపరీత ఆర్థిక ప్రభావం చూపనుంది. అనేక ఫెడరల్ ఉద్యోగ సంస్థలు మూతపడనున్నాయి. పరిశోధనలు, ప్రయోగశాలల నుంచి చిన్న వ్యాపార సంస్థల వరకు ప్రతీదీ మూతపడుతుంది. ఇప్పటి అంచనాల ప్రకారం దాదాపు లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు తక్షణం రాజీనామా చేయవచ్చు. అంతేకాదు 7 లక్షల 50 వేల మంది సమాఖ్య కార్మికులను తొలగించే చర్యలు చేపట్టవచ్చు. ఫలితంగా అమెరికా ప్రభుత్వానికి ప్రతి రోజూ 400 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. షట్‌డౌన్ కొనసాగే ప్రతి వారానికి ఆర్థిక వృద్ధి 0.1 నుంచి 0.2 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో 85% నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పాస్‌పోర్ట్, వీసా, పబ్లిక్ మీడియా, ఆరోగ్యబీమా సబ్సిడీలు తదితర సేవలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈసారి నిధుల వివాదంలో ఆరోగ్య సంరక్షణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది.
ఈ సబ్సిడీలు ముగిస్తే దాదాపు 2.4 కోట్ల మంది అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఒక్కసారిగా పెరగనున్నాయి. జిడిపి, ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచికలు వంటి కీలక డేటా సేకరణలు నిలిపి వేయబడతాయి. ఫలితంగా మార్కెట్‌ల్లో అనిశ్చితి పెరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. భారత్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి అమెరికన్ ఇన్వెస్టర్లు తమ డబ్బులను వెనక్కు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటే స్టాక్ మార్క్‌ట్ బలహీనపడుతుంది. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడే వీలుంది. ఎక్కువగా మన దేశానికి సంబంధించిన ఐటి కంపెనీలు అమెరికా లోని ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులను పొంది సర్వీసులు అందిస్తుంటాయి. ఈ సర్వీసులకు సంబంధించిన బిల్లులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా భారతీయ ఐటి రంగం కూడా అమెరికా షట్‌డౌన్ వల్ల తీవ్ర ప్రభావానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ షట్‌డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. గతంలో అమెరికా 1981 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. అయితే ఇవన్నీ తక్కువ రోజుల్లోనే పరిష్కారమయ్యాయి. 2018 లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల పాటు షట్‌డౌన్ సాగింది. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజుల షట్‌డౌన్ అని చెప్పవచ్చు. ట్రంప్ సర్కారు కన్నా ముందు రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, ఒబామా ప్రభుత్వాల కాలంలోనూ షట్‌డౌన్ పరిస్థితులు ఎదురయ్యాయి. బిల్‌క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1995లో 21 రోజులపాటు షట్‌డౌన్ సాగింది. క్లింటన్ మొదటిసారి ప్రభుత్వ కాలంలో హౌస్‌తోపాటు సెనేట్‌లో కూడా రిపబ్లికన్లు ఆధిపత్యం ప్రదర్శించారు. భారీ బడ్జెట్‌ను పాస్ చేయాలని భావించారు. మెడికేర్ ఖర్చులను తగ్గిస్తూ ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇబ్బంది వచ్చింది. బరాక్ ఒబామా ప్రభుత్వం 2013లో హెల్త్‌కేర్ బిల్లును వ్యతిరేకించడంతో 16 రోజుల పాటు షట్‌డౌన్ ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆరోగ్య సంరక్షణ విషయమే వివాదం కావడం గమనార్హం.. రోనాల్డ్ రీగన్ దేశాధ్యక్షుడుగా రెండుసార్లు ప్రభుత్వాన్ని నిర్వహించారు. ఆయన హయాంలో ఎనిమిది సార్లు ప్రభుత్వం షట్‌డౌన్ అయింది.