‘హద్దు’ మీరిన వివాదం
దక్షిణ తూర్పు ఆసియాలోని రెండు చారిత్రక పొరుగు దేశాలు. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు మరోసారి తలెత్తాయి. సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో థాయి సైనికుడు ఒకరు, నలుగురు కంబోడియా పౌరులు మరణించారు. ఎనిమిదిమంది థాయి సైనికులు గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య గల వివాదాస్పద సరిహద్దుపై రేగిన పోరుకు కారణం మీరంటే, మీరు అంటూ ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి దాదాపు 35 వేల మందిని ఖాళీ చేయించారు. ఈ వేసవిలో ఇరుదేశాల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన పోరులో ఇప్పటికే 43 మంది మరణించారు. ఇరు వైపులా కలిసి దాదాపు మూడు లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇది కేవలం సైనిక ఘర్షణ మాత్రమే కాదు. ఇది శతాబ్దాల చరిత్రలో రగిలిపోతున్న సరిహద్దు వివాదం. థాయ్‌లాండ్-, కంబోడియా సరిహద్దు వివాదం 1904- 1907 మధ్య ఫ్రాన్స్- సియాం ఒప్పందాల నుండి మొదలైంది. అప్పట్లో థాయ్‌లాండ్ (సియాం) రాజ్యం, ఫ్రెంచ్ ఇండోచైనా (కంబోడియా, లావోస్, వియత్నాం) మధ్య సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. ఫ్రెంచ్ కార్టో గ్రాఫర్లు డాంగ్రెక్ పర్వతాల వర్షపతన రేఖకు విరుద్ధంగా మ్యాపులను గీసారు.
దీనిలో ‘ప్రేహ్ విహేర్ ఆలయం’ కంబోడియా భూభాగంలో ఉన్నట్లు గీయబడింది. అయితే థాయ్‌లాండ్ ఈ మ్యాపులను మొదట అంగీకరించింది. కానీ, ఆ తర్వాత కాలంలో వాటిని తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో థాయ్‌లాండ్ జపాన్‌తో కలసి ఉండి ఈ ప్రాంతాన్ని తిరిగి తీసేసుకుంది. కానీ 1946లో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ వివాదం చేరడంతో థాయిలాండ్ దానిని తిరిగి కంబోడియాకు ఇచ్చేసింది. 1953లో కంబోడియా స్వాతంత్య్రం పొందిన తర్వాత, థాయ్ సైన్యం మరోసారి ఆలయాన్ని ఆక్రమించింది. దీనికి ప్రతి స్పందనగా కంబోడియా 1959లో అంతర్జాతీయ న్యాయస్థానం లో కేసు వేసింది. 1962లో అంతర్జాతీయ కోర్టు తీర్పు కంబోడియాకు అనుకూలంగా ఇచ్చింది ‘ప్రేహ్ విహేర్’ కంబోడియా భూభాగమని ప్రకటించింది. అయితే థాయ్‌లాండ్ దశాబ్దాలుగా ఈ సరిహద్దు మ్యాపులకు అభ్యంతరం చెప్పలేదు. కానీ చుట్టూ 4.6 చ.కి.మీ. ప్రాంతం గురించి వివాదం మాత్రం కొనసాగింది. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు థాయ్ ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది వారి జాతీయ గౌరవానికి దెబ్బగా భావించింది. ఈ వివాదం చిలువలు పలువులుగా కొనసాగుతూ 2008లో మరింత ఉధృతమైంది.
కంబోడియా ‘ప్రేహ్ విహేర్’ ను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా జాబితా లో చేర్చగలిగింది. దీనిని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా 2008- 2011 మధ్య ఘర్షణలు జరిగాయి. 30 మందికి పైగా మరణించారు. ఈ కాలంలో రెండు దేశాల్లోనూ రాష్ట్రీయవాద రాజకీయాలు ఊపందుకున్నాయి. థాయ్‌లో యెల్లో షర్ట్ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. కంబోడియాలో ‘హన్ సేన్’ ప్రభుత్వం జాతీయవాదాన్ని ఉపయోగించుకుంది. ఈ ఘర్షణలతో ఇరుదేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పర్యాటకం, వాణిజ్యం ఆగిపోయాయి. అయినప్పటికీ, ఏషియన్ మధ్యవర్తిత్వంతో 2011లో తాత్కాలిక శాంతి వచ్చింది. కానీ 2025లో ఈ పాత గాయం మరోసారి తలెత్తింది. మే 2025లో రెండు దేశాల సరిహద్దుల దళాల మధ్య గన్ ఫైట్ జరిగింది. క్రమంగా ఇది జులైలో పూర్తి యుద్ధంగా మారిపోయింది.
గత సంవత్సరం జూలై 24 నుండి 28 వరకు ఐదు రోజులు భారీ యుద్ధం జరిగి, 40 మందికి పైగా మరణించారు. 2 లక్షల మంది అభయారణ్యం కోరారు. ఈ ఘర్షణలు ‘ప్రేహ్ విహేర్’, ‘తామున్ థామ్’ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. థాయ్‌లాండ్, కంబోడియా మొదట కాల్పులు ప్రయత్నించిందని ఆరోపించింది. దీనికి ప్రతిగా కంబోడియా సోవియట్ -(పిఎంఎన్ -2 )ల్యాండ్‌మైన్‌లు వేసిందని ఆరోపించింది. ఈ యుద్ధంలో చైనా, అమెరికా వంటి శక్తులు తలదూర్చాయి. చైనా కంబోడియాకు మద్దతుగా నిలిచింది. అమెరికా థాయ్‌లాండ్‌ను సమర్థించింది. జులై 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాల నాయకులతో ఫోన్ కాల్స్ చేసి సీజ్ ఫైర్‌కు ప్రయత్నించాడు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో ట్రంప్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి విస్తృత శాంతి ప్రకటనకు సంతకం చేశారు. కానీ మధ్యలోనే నవంబర్‌లో థాయ్‌లాండ్ శాంతి చర్చలను ఆపేసింది.
దానితో డిసెంబర్‌లో మరోసారి దాడులు మొదలయ్యాయి. ఈ యుద్ధం 500 మైళ్ల సరిహద్దులోని అనిర్ణిత ప్రాంతాల నుండి ఉద్భవించింది, ఫ్రెంచ్ మ్యాపులు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి.ఈ కారణాలు బహుముఖాలు. మొదట, వలస వారసత్వం. ఫ్రెంచ్ మ్యాపులు థాయ్‌లాండ్‌కు అన్యాయమని భావిస్తున్నారు. రెండవది, సాంస్కృతిక గుర్తింపు సమస్యలు ‘ప్రేహ్ విహేర్ ఖ్వమర్’ (కంబోడియా), ఖ్మేర్-సియాం (థాయ్) చరిత్రలో పాలుపంచుకుని ఉంది. ఇది రెండు దేశాల్లోనూ గౌరవ యుద్ధంగా మారింది. నిజానికి… ఈ ఘర్షణలు కేవలం సైనిక సమస్య కాదు. ఇది రాష్ట్రీయవాద సమస్యలు. రెండు దేశాలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పును పూర్తిగా అమలు చేసి, సరిహద్దు మ్యాపులను తిరిగి సవరించాలి. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు మధ్యవర్తిత్వం చేయాలి. శాంతి చర్చలను పునఃప్రారంభించి, ఆలయాన్ని ఉమ్మడి వారసత్వంగా చేస్తే, ఈ ప్రాంతం సమృద్ధి సాధించగలదు. లేకపోతే, ఈ ఘర్షణలు మరిన్ని నష్టాలకు దారితీస్తాయి.
– డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496
