వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహం లభ్యం
మంచిర్యాల జిల్లా, ముల్కల్ల గోదావరి నది కి వెళ్లె రహాదారి ప్రక్కన వ్యవసాయ భూమిలో అమ్మవారి విగ్రహ ప్రతిమ బయటపడింది. ఇటీవల ముల్కల్ల గోదావరి తీరానికి అఘోరాలు, సాధువులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో అమ్మవారి శక్తి ఉందని స్థానికులకు తెలపడంతో పాటు అమ్మవారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వెళ్లారు. దీంతో గ్రామస్థులు, పూజారులు గత రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టారు. పాత మంచిర్యాలకు చెందిన ఒక రైతుకు చెందిన భూమిలో తవ్వకాలు చేపట్టగా సోమవారం అమ్మవారి విగ్రహ పతిమ లభించింది. వెంటనే అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి నిలబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ నుండి వచ్చిన సాధువులు ముల్కల్ల గోదావరి తీరప్రాంతంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో వారి రాకతో
ఒక్కసారిగా ఏదో శక్తి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, వారు చెప్పడమే కాకుండా ఆ స్థలాన్ని గుర్తించి వెళ్లడంతో స్థానికులు, పూజారులు విగ్రహం కోసం తవ్వకాలు చేపట్టారు. స్వామీజీలు చెప్పిన ప్రదేశంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు చేపట్టారు. సోమవారం స్వామిజీలు చెప్పిన విధంగానే అమ్మవారి విగ్రహం భూమిలో లభించడంతో భక్తి పారవశ్యంతో ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముల్కల్ల గోదావరి తీరంలో అమ్మవారి వెలిసిందని తెలియండంతో చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. అప్పుడే అమ్మవారి గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. అమ్మవారి విగ్రహం లభించిన చోట గుడికట్టేందుకు భూ యజమానితో సంప్రదింపులు చేస్తున్నారు.