సిబిఐ కోర్టుకు జగన్ హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువా రం సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హా జరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాం పల్లిలోని సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసు లో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ మోహన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టు కు ప్రత్యక్షంగాహాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలోనే శుక్రవారం లోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్ను
కోర్టు ఆదేశించడంతో ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే, కోర్టు సిబ్బంది ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచిన వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం, న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్‌ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణనలోకి తీసుకుని, సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది. అనంతరం ఆయన లోటస్‌పాండ్ లోని తన నివాసానికి చేరుకున్న కాసేపు ఉన్న అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు.
తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తలు
ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద, నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో హల్ చల్ చేశారు. వైసీపీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ మోహన్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ‘2029లో రప్ప రప్పా’ అంటూ జగన్ అభిమానులు నినాదాలు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే నాంపల్లి కోర్టు సమీపంలో కేసు విచారణకు వచ్చిన జగన్ కోసం వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.