అంతర్గత చర్చల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి
పునరావాసానికి అంగీకరిస్తాం
కేంద్ర కమిటీ సభ్యుడు సోనూదాదా నిర్ణయంతో ఏకీభవిస్తున్నాం
పిఎల్‌జిఎ వారోత్సవాలు కూడా నిర్వహించబోం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు
మావోయిస్టుల ప్రతిపాదన స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్, చర్ల: మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కీల క ప్రకటన చేసింది. మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ పేరు తో బహిరంగ లేఖ రాసింది. గడువు ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటించింది. అప్పటి వరకు భదత్రా దళాల కూబింగ్ నిలిపివేయాలని కోరింది. ఇంకా లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పో రాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. సిసిఎం సతీష్ దాదా, మరొక సిసిఎం కామ్రే డ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. ఎంఎంసి(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) స్పెషల్ జో నల్ కమిటీ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. తాము ఆయుధాలు విడిచిపెట్టడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సమయం ఇవ్వాలనిఅభ్యర్థించింది.
పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాన్ని అందరితో పంచుకోవడానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి, పార్టీ పద్దతి ప్రకారం ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కోరింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమ యం ఇవ్వాలని అభ్యర్థించింది. సమయం కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదని, సమాచారం చేరవేసేందుకు ఈ సమయం కోరామని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మావోయిజం నిర్మూలనకు విధించిన గడువు (మార్చి 31, 2026)లోపే తాము కోరిన సమయం ఉందని, అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది.
కాగా, పిఎల్‌జిఏ వారోత్సవాలు నిర్వహించబోమని, ఈ క్రమంలో రాబోయే పిఎల్‌జిఏ వారంలో ఎటువంటి కార్యకలాపాలను కూడా ప్రభుత్వం నిర్వహించకూడదని, ఇన్‌ఫార్మర్ల కార్యకలాపాలను సైతం నిలిపివేయాలని, ఇతర సమాచారం ఆధారంగా దళాలను నియమించకూడదని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇరువైపులా ఇలాంటి ప్రయత్నాలతో సంభాషించుకోవడానికి మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి సాధ్యమవుతుందని, ఆహ్లాదకరంగా, సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు జోన్‌ల్ కమిటీలు తమ కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలోని సారాంశాన్ని మీడియా ద్వారా సహచర మావోయిస్టులకు తెలియజేయాలని అనంత్ కోరారు.
ఆయుధ విరమణపై త్వరలోనే తేదీ ప్రకటిస్తాం
ఆయుధ విరమణపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాలని కోరారు. సమిష్టిగా ఆయుధ విరమణ చేసి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల కార్యకలాపాలను నిర్ణీత తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అనంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తామని లేఖలో తెలిపారు. సహచరులు సోను దాదా, సతీష్ దాదా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తగిన సమయం ఇవ్వాలని కోరారు.