అమరావతి: ఎపిలో ఐదేళ్ళు విధ్వంసం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధాని పనులను పునః ప్రారంభించారని చెప్పారు. రూ.1,334 కోట్లతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని, పనులు వేగవంతానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య కారణమని అన్నారు. తమ కంటే వేగంగా అమరావతికి రూ. 15 వేల కోట్ల నిధులిచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల గాడిన పెడుతూ వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక్కడున్న ఫైనాన్సియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదని, వినూత్న నగరాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. బ్యాంక్ కార్యాలయాన్ని ఒకేచోట ఉండటంతో ఎన్నో ప్రయోజనాలని, 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 3వ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నామని, రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని అన్నారు. అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో ప్రభుత్వం పడిపోయిందని, వెంటిలేటర్ పై ఉన్న ఎపిని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారని చెప్పారు. ఎపి ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందని, అమరావతి నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుందని, సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్ గా అమరావతి తయారవుతుందని సూచించారు. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతామని, 2028 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాల పూర్తికి కార్యాచరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.