ఎపిలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొల్లూరు మండలం దోనేపూడి వద్ద కొబ్బరికాయల లోడుతో వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కొల్లూరు నుంచి వెల్లటూరు వైపు వెళ్తున్న ఆటో, దోనేపూడి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆటో నేరుగా రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చింతమోటు గ్రామానికి చెందిన చాట్రగడ్డ కాంతారావు (48), పెసర్లంక శ్రీనివాసరావు (55), షేక్ ఇస్మాయిల్ (55) మరణించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందు కున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అధిక వేగమా? డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.