మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అం బేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం గ్రామంలోని లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డా యి. పేలుడు ధాటితో పాటు మంటల నుంచి బయటకు రాలేక ఊపిరాడక మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి, మరొకరిని చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఆరుగురు మృతుల్లో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. యజమాని వెలుగుబంటి సత్యనారాయణతో పాటు పాకా అరుణ, చి ట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పి.శేషారత్నంగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీపావళి సమీపిస్తోన్న నేపథ్యంలో
ఇక్కడ బాణసంచా తయారీని కార్మికులు ముమ్మరంగా చేపట్టారు. బాణాసంచాను తయారు చేస్తోన్న సమయంలో హఠాత్తుగా మంటలు చెల రేగాయి. అక్కడున్న రసాయ నాలు, గంధకం, భాస్వరం..ఇవన్నీ కూడా మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి దోహదం చేసేవే. దీంతో మంటలు ఒక్క సారిగా ఫైర్ వర్క్ భవనాన్ని చుట్టుముట్టాయి. పేలుడు సమయంలో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఈ భారీ పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలి పోయింది. గోడ శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని సమాచారం. అగ్ని కీలలు శరవేగంగా వ్యాపిం చాయి. ఆ సమ యంలో అక్కడ పలువురు కార్మికులు బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నవారు. వారందరూ సురక్షితంగా బయటపడే సమయం కూడా దొరకలేదంటే మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంటల ధాటికి అక్కడ నిల్వ ఉంచిన బాణాసంచా పేలిపోయింది. అనేక మంది కార్మికులు లోపల చిక్కుకు పోవడంతో మృతుల సంఖ్య పెరిగింది.
పేలుడు తీవ్రతకు ఈ తయారీ కేంద్రానికి సమీపంలో ఉన్న రిటైల్ షాపు కూడా ధ్వంసం అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నా రు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పివేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చాలా కష్టంగా మారాయని పోలీసులు వెల్లడిం చారు.జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యలను పర్యవేక్షిం చారు. కనీస భద్రతా చర్యలు కొరవడటం, రసాయనాలను సరిగ్గా నిల్వ ఉంచక పోవడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద ఘటనా స్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరి శీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్నిమాపక నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నా మని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు.
విచారం వ్యక్తం చేసి ప్రధాని మోడీ
ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలానే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కాగా ప్రమాద ఘటనపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.