అసలు క్రిమినల్స్ కంటే వాళ్లు ప్రమాదం: చంద్రబాబు నాయుడు
అమరావతి: కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రజల రక్షణ కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే పోలీసులు అంటే తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ అర్డర్ కంటే ఏదీ ముఖ్యం కాదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఆడ బిడ్డలపై అఘాయిత్యం చేస్తే ఎంతటివాడైనా సరే అదే వాడికి చివరి రోజు కావాలన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం, ప్రజల భద్రత కోసం రాజీ లేని పోరాటం చేశానని, దాని ఫలితమే 2003లో తన మీద 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ ఘటన జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండే పోలీసులకే ఎప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. సిఎం చంద్రబాబు భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు సిఎం నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
పాస్టర్ ప్రవీణ్ హత్య కేసును రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, సిసి కెమెరాల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారని ప్రశంసించారు. సకాలంలో పోలీసు వ్యవస్థ పనిచేసింది కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగామన్నారు. మనం చేసే పనులే శాశ్వతమని, ప్రాణాలకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. కల్తీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పానని, రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవన్నారు.
సమాజంలో అశాంతి సృష్టించి లబ్ది పొందడం కోసం రాజకీయ ముసుగులో కొత్త నేరగాళ్లు బయలు దేరారని, వీళ్లు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదమన్నారు. దొంగ ఒక సారి ఒక్క ఇంటినే దోచుకుంటాడని, కానీ ఈ కుట్ర రాజకీయం చేసే వాళ్లతో, ఫేక్ ప్రచారాలు చేసేవాళ్లతో చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు తెలియజేశారు. ప్రజలు లోతుగా ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ గా మారిందని, ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని, కానీ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిందన్నారు. వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని, దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చారు. కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి వచ్చిందంటే అది ఓ నమ్మకం అని, రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందనే విశ్వాసంతోనే గూగుల్ ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చిందని, ప్రపంచానికే విశాఖ ఓ ఐటి, ఎఐ హబ్ గా తయారవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.