వెనెజువెలా అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెడతారా?
కారకాస్ : తాను తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన చర్చల్లో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో పేర్కొన్నట్టు తెలుస్తోంది.అయితే ఆందుకు ఆయన కొన్నిషరతులు విధించినట్టు సమాచారం. ఈ మేరకు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. గత నెలలో ట్రంప్, మదురోలు 15 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆసమయంలో తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తే, తాను వెనెజువెలాను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని, మదురో తెలియజేసినట్టు సమాచారం.
అమెరికా విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసును మూసివేయడం వంటి వాటి గురించి ప్రస్తావించారు. దీంతోపాటు అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 100 మందికి పైగా వెనెజువెలా అధికారులపై విధించిన ఆంక్షల నుంచి అమెరికా ఉపశమనం కలిగించాలని కూడా ఆయన కోరినట్టు సమాచారం. అయితే మదురోషరతుల్లో చాలా వాటిని ట్రంప్ తిరస్కరించినట్టు రాయిటర్ పేర్కొంది. మదురో తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ట్రంప్ ఒక వారం రోజులు గడువు విధించినట్టు తెలుస్తోంది. అయితే అది శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో వెనెజువెలా భూభాగంపై అమెరికా దళాల సైనిక కార్యకలాపాలను విస్తరించారు.