ప్రతిభకు పట్టం కట్టేందుకే మిలియన్ కార్డు: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలో ప్రతిభావంతులకు శాశ్వత నివాసపు పౌరసత్వం కల్పించే 1 మిలియన్ డాలర్ల ట్రంప్ గోల్డ్‌కార్డు విక్రయాలు ఆరంభం అయ్యాయి. అమెరికా అధ్యక్షులు ట్రంప్ గురువారం ఈ ప్రక్రియను అధికారికంగా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రత్యేకించి ఇండియా చైనాకు చెందిన వారు ప్రముఖ అమెరికా వర్శిటీలలో చదివి తిరిగి వారి వారిదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇది సిగ్గుచేటని ట్రంప్ చెప్పారు. ఇంతకు ముందు తాము ప్రకటించిన ఈ గోల్డ్ కార్డుతో కంపెనీలు ఇటువంటి ప్రతిభావంతులను దేశంలోనే ఉండేలా చేసి, ఉద్యోగాలు ఇవ్వడానికి వీలేర్పడుతుందని తెలిపారు. ఈ మిలియన్ గోల్ట్ కార్టుతో అమెరికాకు అత్యధిక స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని ట్రంప్ చెప్పారు.
ప్రతిభకు పట్టం కట్టడం, తద్వారా అమెరికాకు ప్రతిభ ప్రతిష్టను పెంచడం ఈ కార్డుల ఉద్ధేశం అని వివరించారు. తెలివిగల వారు దేశానికి రావడానికి, పౌరులుగా మారడానికి ఇది ఓ ఆహ్వానం అన్నారు. ఇంతవరకూ వారికి ఇక్కడ నివసించే అవకాశం ఉండేది కాదు. వారు ఇక్కడి కాలేజీల గ్రాడ్యుయెట్లు అయిన తరువాత వెంటనే విధిలేని పరిస్థితుల్లో తిరిగి ఇండియాకో, చైనాకో, ఫ్రాన్స్‌కు ఈ విధంగా వారి వారి దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ ఉండలేకపోయే వారు. ఇది మనకు సిగ్గుచేటు, అనుచిత విషయం, దీనిని గుర్తించే తాము ఇప్పుడు వారి బాగోగులను చూసుకుంటామని, వారు ఇక్కడనే ఉండేలా చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఐబిఎం ఇండియన్ అమెరికన్ సిఇఒ అరవింద్ కృష్ణన్, డెల్ టెక్నాలజీస్ కార్యనిర్వాహణాధికారి మైకెల్ డెల్ సమక్షంలో ట్రంప్ గోల్డ్‌కార్డు వెబ్‌సైట్ ఇప్పుడు పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు.
ప్రముఖ కంపెనీలు ట్రంప్ కార్డును కొనుగోలు చేసుకుని, ప్రతిభావంతులైన వారిని ఇక్కడనే కొనసాగేలా చేసుకునేందుకు ముందుకు రావచ్చునని పిలుపు నిచ్చారు. అసలు సమస్య గురించి చాలా సార్లు తనకు ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ తెలియచేశారని, ఇతర కంపెనీల నిర్వాహకులు కూడా ఉత్తమ విద్యార్థులను తీసుకోవడంలో వీసాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విషయాన్ని చెప్పారని, వీటిని పరిశీలించి, పరిగణనలోకి తీసుకునే ఇప్పుడు గోల్డ్‌కార్డు ప్రారంభించినట్లు తెలిపారు. వైట్‌హౌస్ ద్వారా కూడా ఈ మిలియన్ డాలర్ల కార్డుల విక్రయాల ప్రక్రియ ఆరంభం అయింది. ఓ వైపు ప్రతిభ ఇక్కడనే నిలిచిపోతుంది. మరో వైపు బిలియన్ డాలర్లు అంతకు మించి, మరీ అంతకు మించి మనకు ఆదాయం వచ్చిపడుతుంది. ఇది అత్యంత ఉత్తేజభరిత విషయం అన్నారు.