సిడ్నీ ఉగ్రదాడి ఘటన.. నిందితుడికి హైదరాబాద్‌లో మూలాలు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్టు ఆస్ట్రేలియ అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్‌పోర్టు పొందినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ కార్యాలయం సాజిత్‌అక్రమ్ హైదరాబాద్ వ్యక్తి అని వెల్లడించింది.
“బికామ్ చదివిన సాజిద్ 27 ఏళ్ల క్రితం 1998 లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, కుమార్తె, వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులే, సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నాడు. అయితే హైదరాబాద్‌తో అతడికి అతి తక్కువ కాంటాక్ట్ ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వలస వెళ్లినసాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చాడు. కుటుంబ, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల కోసమే ఇక్కడకు వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఉగ్రవాదులతో సాజిద్‌కు సంబంధాలపై తమకేమీ తెలియదని హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులు తెలిపారు” అని తెలంగాణ డిజిపి కార్యాలయం తమ ప్రకటనలో వెల్లడించింది.
ఇస్లామిక్ స్టేట్ ప్రభావం
ఈ ఉగ్రదాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ ప్రభావం ఉందని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బార్రెట్ మంగళవారం వెల్లడించారు. నిందితులు తండ్రీ కొడుకులని, తండ్రి కాల్పుల్లో మృతి చెందగా, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వారి దగ్గర లభించినసాక్షాల ఆధారంగా వారు ఇస్లామిక్ స్టేట్ ప్రభావితులని మొదటిసారి తాము వెల్లడిస్తున్నామని పాత్రికేయుల సమావేశంలో వివరించారు.
ముగ్గురు భారతీయ విద్యార్థులకు గాయాలు
ఈ ఉగ్రదాడి కాల్పులకు గాయపడినవారిలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం 40 మంది గాయపడ్డారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిపేర్లు కానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి కానీ బయటకు వెల్లడి కాలేదు.