అమెరికా అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ నిరసనలు
ఉధృతం 50కి పైగా నగరాల్లో వీధుల్లోకి మిలియన్ల కొద్దీ జనం
విదేశాల్లోని రాయబార కార్యాలయాల వద్ద ఆందోళనల వెల్లువ ట్రంప్
ఎదురుదాడి తనను తాను చక్రవర్తిగా చిత్రీకరిస్తూ ఎఐ ఫొటో విడుదల
న్యూయార్క్: అమెరికాలో క్రమేపీ పలు ప్రధాన నగరాలలో ట్రంప్ విధానాలకు నిరసనలు ఉ ధృతం అవుతున్నాయి. నో కింగ్స్ పేరిట జనం ప్లకార్డులతో వీధుల్లోకి తరలివస్తున్నారు. మహా నగరం న్యూయార్క్, వాషింగ్టన్ డిసి, చికాగో, మియామి, లాస్ ఏంజెలిస్‌ల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నో కింగ్స్ ఉద్యమంలో మిలియన్ల కొద్దీ పాల్గొంటున్నారు. న్యూయార్క్‌లో ఎక్కడ చూ సినా నో కింగ్స్ బ్యానర్లు వెలిశాయి. జనం పెద్ద పెట్టున స్థానిక చారిత్రక ప్రతీకాత్మక టైమ్స్ స్కేర్ వద్ద గుమికూడారు. తమకు ప్రజాస్వా మ్యం ప్రాణం, రాచరికం కాదంటూ చెలరేగిన నినాదాలతో వీధులు మార్మోగాయి. కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద కూ డా ట్రంప్‌పై నిరసనల వెల్లువలు సాగాయి.
అమెరికాలోనే ఒక్కరోజే 50కి పైగా నగరాలలో ఈ నిరసనలు చెలరేగాయి. త్వరలోనే అమెరికా అంతటా 2500కు పైగా ర్యాలీలు తీస్తామని నో కింగ్స్ పేరిట ఆరంభమైన ఉద్యమ నిర్వాహకులు ప్రటించారు. ట్రంప్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు , దేశీయ విదేశీ విధానాలు , అమెరికా ఫస్ట్ పేరిట వలసల నియంత్రణ క్రమంలో అనాలోచిత , అరాచక చర్యలకు దిగుతున్నారని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ కానీ మరెవ్వరైనా కానీ అమెరికాలో రాజ్యాంగం కాదని వ్యవహరిస్తే కుదరదు, రాజ్యాంగం అనేది ఐచ్ఛిక్కం అనుకుంటున్నారా? ఇది అనివార్యం, అవశ్యం, తప్పనిసరి అని జనసంద్రపు మహానగరం న్యూయార్క్‌లో వెల్లువెత్తిన నో కింగ్స్ జనం హెచ్చరించారు. రాజుల కాలం, తమ మాటలనే చలామణి చేయించుకోవాలనే ధోరణి కుదరదని స్పష్టం చేశారు. పలు విశ్వవిద్యాలయాలకు నిధుల కోత, ప్రత్యేకించి డెమెక్రాట్లు ప్రాబల్యంతో ఉన్న లేదా ఈ పార్టీ గవర్నర్లు ఉన్న రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ట్రంప్ నేరుగా తన అధీనంలోని నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపడం వంటి చర్యలు నో కింగ్స్ ఉద్యమానికి దారీతీశాయి. బారోహ్ పట్టణంలో లక్షకు పైగా జనం గుమికూడారని స్వయంగా న్యూయార్క్ పోలీసు విభాగం తెలిపింది.
ఇండివిజబుల్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్ బర్గ్ ఇక్కడ నిరసనలకు నాయకత్వం వహించారని అధికారులు నిర్థారించారు. డెమోక్రాటిక్ పార్టీ , పలు సంఘాలు, అమెరికాకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి ఈ ఉద్యమానికి ప్రత్యక్ష పరోక్ష మద్దతు దక్కుతోంది. న్యూయార్క్‌లో నిరసనకారులు కొన్ని చోట్ల ట్రంప్‌ను చక్రవర్తి మాదిరిగా చూపే భారీ బొమ్మలను ప్రదర్శించారు. ఈ నిరసనల దశలో పలు నగరాలలో నేషనల్ గార్డ్‌ను ప్రధాన కూడళ్ల వద్ద మొహరించారు. అయితే అన్ని చోట్ల కలిపితే ఏడు లక్షల మందికి పైగా జనం నిరసనలలో పాల్గొన్నారని ఉద్యమ నిర్వాహకులు సామాజిక మాధ్యమాలలో తెలిపారు.
ఇది ఆరంభమే అనుకోవచ్చు, ఇకపై ఇతర చోట్ల, నగరాలలో కూడా మరింత వినూత్నంగా తాము వ్యవహరిస్తామని తెలిపారు. అమెరికా వ్యవస్థలోని ఫెడరల్ గవర్నమెంట్ల అంటే రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ప్రాంతీయ అధికారిక వ్యవస్థ అధికారాలను ట్రంప్ దెబ్బతీస్తున్నారనే అంశం చాలారోజులుగా రగులుకొంటోంది. ట్రంప్ ఎక్కువగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రత్యేకించి నోబెల్‌పై కన్ను వేసి ఉంచడం అంతర్గత పరిణామాలను సరిగ్గా గుర్తించని క్రమంలోనే ఇప్పుడు ఈ ఉద్యమం వెల్లువెత్తే అవకాశం ఏర్పడిందని అమెరికా పత్రిక ఒకటి రాసింది. నిరసనకారులు ఎక్కువగా అన్యాయంపై నిరసన, ఫాసిసంపై ప్రతిఘటననే గొప్ప దేశభక్తి అని నిరసనకారులు నినదించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరసనలతో కూడిన నో కింగ్ ఆందోళనలు చెలరేగడం ఇది మూడోసారి అయింది.
ట్రంప్ వర్గీయుల ఎదురుదాడి
అమెరికా వీధుల్లోకి నిరసనల పేరిట చేరుకుంటున్నది కేవలం హేట్ అమెరికావాదులు అని ట్రంప్ మద్దతుదార్లు కౌంటర్‌కు దిగారు. ఇది ఫాసిస్టు, అతి వామపక్ష వాద జెండాల కసరత్తు అని వ్యాఖ్యానించారు. అమెరికా ఫస్ట్ అని మేమంటాం, హేట్ అమెరికా అని వారంటున్నారు ఇదే తేడా అంటూ ట్రంప్ మనుష్యుల ద్వారా ఎఐ ఫోటో ఒకటి వెలువరించారు. ఇందులో ట్రంప్‌ను చక్రవర్తిగా చిత్రీకరించారు. నో కింగ్స్ నిర్వాహకులను కవ్వించేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇక ఇప్పటి ఉద్యమం నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ వీటిపై ఒకే ఒక్క మాటతో స్పందించారు. తన ఫోటో పెట్టి, తాను కింగ్‌ను కానని ( నాట్ ఏ కింగ్) అని వ్యాఖ్యానించారు. తరువాత ఫ్యాక్స్ బిజినెస్‌తో మాట్లాడుతూ తనను వారు కింగ్ అంటున్నారని, ఎంతైనా ఈ డెమోక్రాట్లు ఎప్పటికీ ప్రభుత్వ చలామణిలోకి రాబోరు. కాబట్టి డెమోక్రాట్ల ప్రాధాన్యతలను కాదంటూ అమెరికన్ల కోసం తానే కింగ్ అవుతానేమో అనే వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తరువాత ఎఐ ట్రిక్కు ఫోటోగ్రఫీలో భాగంగా ట్రంప్ తమ ట్రూత్ సోషల్ వేదికపై వెలువరించిన ఫోటోలో తాను కిరీటం ధరించి ఫైటర్ జెట్‌లో దూసుకువెళ్తున్నట్టుగా ఉంది.