సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

దీపావళికి ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పిఎల్‌ఆర్) స్కీం బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి 1.03 లక్షల రూపాయల బోనస్ ను చెల్లింపునకు సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయూత అందిస్తోందని పేర్కొన్నారు. దీపావళి బోనస్గా 400 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1.03 లక్షలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద 39,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 18న (శనివారం) కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ ,

ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరింత అంకితభవంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేయాలని లేదా ప్రభుత్వ పొదుపు సంస్థల్లో పొదుపు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి బోనస్ కేవలం కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. భూగర్భంలో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్‌లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారికి రూ 1.03 లక్షల పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ దినాలు పని చేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 30 మస్టర్లు పూర్తి చేసిన వారు ఈ బోనస్ పొందడానికి అర్హులు.

బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. ఇంటి యజమాని పై వివాహిత ఫిర్యాదు

బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి కటకటాలపాలయ్యడు ఇంటి యజమాని. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…జవహర్‌నగర్, మధురానగర్‌కు చెందిన అశోక్ ఇంటిలో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అక్టోబర్ 4వ తేదీన బాత్‌రూమ్‌లో బల్బు పాడైపోవడంతో ఇంటి యజమాని అశోక్, ఎలక్ట్రిషియన్ చింటూతో కలిసి కొత్తది ఏర్పాటు చేశాడు. హోల్డర్‌లో నిందితుడు సిసి కెమెరాలను అమర్చాడు. ఈ విషయం ఈ నెల 13వ తేదీన అద్దెకు ఉంటున్న దంపతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్టు చేయగా, ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎసిబి వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఎసిబి అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారిణి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ చిక్కుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం… మాదన్నపేట మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ 2023లో 124 మందికి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సభ్యత్వం ఖరారు కాకపోవడంతో అధికారులను ప్రశ్నించగా సభ్యత్వం నమోదు కావాలంటే హైదరాబాద్‌లోని పలు కార్యాలయాలతో ముడిపడి ఉందని మత్స్యశాఖ అధికారిణి నాగమణి తెలిపారు. కానీ నూతన సభ్యత్వాలు జిల్లాల పరిధిలోనే కేటాయించుకోవాలని 2025 ఆగస్టులో ప్రభుత్వం నుండి

సర్కులర్ రావడంతో విషయం తెలుసుకున్న మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ నర్సయ్య అధికారులను అడిగారు. నూతన సభ్యత్వాల కోసం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రూ.80 వేలు డిమాండ్ చేయగా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ నాగమణికి ఫిర్యాదు చేశాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన డబ్బులను ఇస్తేనే నూతన సభ్యత్వాలు ఇస్తానని అధికారిణి నాగమణి చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ రూ.75 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి కోరిక మేరకే తాను మత్స్యకారుల సంఘం నుంచి లంచం తీసుకున్నట్లు హరీష్ ఒప్పుకున్నాడని, దీంతో వీరిద్దరినీ శనివారం కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపారు.

హీరోయిన్లు కేవలం గ్లామర్ డాల్‌: రాధిక ఆప్టే

హిందీ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా రాణించిన రాధిక ఆప్టే హీరోయిన్ల పట్ల జరిగే అన్యాయాన్ని వివక్షతను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాధిక ఆప్టే హీరోలను బాగా చూపిస్తూ.. హీరోయిన్లను తక్కువ చేసి చూపించే వారిపై మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. “సినిమా కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్‌గా చూపించడం వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ఎప్పుడైనా సరే హీరోయిన్ హీరో వెనకాల ఉండేలా.. హీరోని కాపాడండి అని అడిగేలాంటి పాత్రల్లోనే చూపిస్తారు. హీరో ముందు ఉంటే హీరోయిన్ వెనకాల లేదా పక్కన నిల్చోవాలి అంతే. హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతారని అనుకుంటారు.. హీరోయిన్లను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియడం లేదు”అని అన్నారు.

అయితే రాధిక ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యల్లో 100% నిజం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా అందులో హీరోని ఎలివేట్ చేస్తూ హీరోయిజాన్ని చూపిస్తారు తప్ప హీరోయిన్ ని ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఐటమ్ సాంగ్ లకు లేదా రొమాన్స్ చేసే పాత్రలకు మాత్రమే వారిని తీసుకుంటారు. మిగతా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది.అందుకే రాధిక ఆప్టే ఇలాంటి కామెంట్స్ చేసింది.అయితే హీరోయిన్లను పెట్టి కూడా పవర్ ఫుల్ సినిమాలు తీయవచ్చని ప్రతిసారి ఈ అంశాన్ని ఎత్తి చూపుతుంది రాధిక ఆప్టే.

జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా కన్నుమూత

తన దేశ దురాక్రమణకు గురైన ఆసియా బాధితులకు 1995లో ‘మురాయమా ప్రకటన’ ద్వారా క్షమాపణలు చెప్పిన జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. జపాన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి మిజుహో ఫుకుషిమా ప్రకటన ప్రకారం, మురాయమా తన స్వస్థలమైన నైరుతి జపాన్‌లోని ఓయిటాలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. 1994 నుంచి 1996 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మురాయమా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చర్యలకు చారిత్రాత్మక క్షమాపణలు తెలిపారన్నది గమనార్హం. 

పరిగి అటవీ కార్యాలయంలో ఎసిబి దాడులు

వికారాబాద్ జిల్లా, పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఎసిబి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్‌పి ఆనంద్‌  కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో సీతాఫలాల టెండర్లకు అనంతసాగర్ సమీపంలోని ఓ కాంట్రాక్టర్ రూ.15 లక్షలకు టెండర్లు వేయగా జిఎస్‌టి ఇతర ఖర్చులతో కూడిన మొత్తం రూ.18 లక్షల వరకు టెండర్లు దక్కించుకున్నాడు. సీతాఫలాలు అడవి, ఇతర ప్రాంతాల నుంచి తెంపి తరలించేందుకు ప్రతిరోజూ పర్మిట్లు అటవీ శాఖ అధికారులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రూ.50 వేలు ఇవ్వాలని పరిగి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం సెక్షన్ ఆఫీసర్లు బి.సాయికుమార్,మహమ్మద్ మోహినుద్దీన్‌తో పాటు డ్రైవర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు.

ఇందులో కాంట్రాక్టర్ పండ్లు తీసుకువెళ్లేందుకు రోజు వారి అనుమతులు పొందేందుకు రూ.50 వేలు ఇవ్వాలని సెక్షన్ అధికారులు డిమాండ్ చేశారు. అయితే, అంత డబ్బులు లేవని పండ్లు మురిగిపోతున్నాయని, అవి కుళ్లిపోతే తమకు నష్టం వస్తుందని బాధితుడు వారికి చెప్పాడు. దీంతో కనీసం రూ.40 వేలు అయినా లంచం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు డబ్బులు తీసుకుని పరిగికి వచ్చినప్పుడు డ్రైవర్ సహాయంతో తీసుకున్నారు. వెంటనే సెక్షన్ అధికారులను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెక్షన్ అధికారులతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్టు ఎసిబి డిఎస్‌పి తెలిపారు.

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

 సిద్దిపేట జిల్లా, ములుగు తహసీల్దార్ కార్యాలయం వద్ద గల రాజీవ్ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారి డివైడర్‌పై గడ్డి కటింగ్ చేస్తున్న ఇద్దరు కార్మికులను ఆర్‌టిసి గరుడ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ములుగు మండలం, కమలాబాద్‌కి చెందిన బోయిని సాయిలు (65), మర్కుక్ మండలం, పాములపర్తికి చెందిన లెంకల రాజమల్లు (55) అనే ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. కార్మికులను ఢీకొన్న బస్ గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలిసింది. హైదరాబాద్ వైపు నుంచి గోదావరిఖనికి బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగంగా బస్ ను నడపడం ఈ ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఘటనా స్థలానికి చురుకున్న పోలీసులు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడతున్నారు.

మార్పు కోరుకుంటే రాదు.. ప్రయత్నిస్తే వస్తుంది: పవన్‌కళ్యాణ్

అమరావతి: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలో ‘సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది. మార్పు కోరుకుంటే రాదు – మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ రాసుకొచ్చారు.

వృద్ధురాలి నుంచి రూ. 35.23లక్షలు దోచుకున్న సైబర్ నేరస్థులు

లండన్‌లో కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని వృద్ధురాలిని బెదిరించి రూ.35.23లక్షలు సైబర్ నేరస్థులు దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన వృద్ధురాలు(61)కి వాట్సాప్ కాల్ వచ్చింది. బాధిత మహిళ కుమారుడు లండన్‌లో ఉంటున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి తాను డాక్టర్ స్టీవ్ రోడ్రీగుజ్ మాట్లాడుతున్నానని చెప్పాడు. సౌత్ మాంచెస్టర్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు. మహిళ కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తలకు తీవ్రగాయాలయ్యాయని, లగేజీ మిస్సయ్యిందని తెలిపాడు.

ఆస్పత్రిలో అధికారికంగా చేర్చలేదని, అనదికారికంగా చేర్చామని చికిత్స కోసం వెంటనే డబ్బులు పంపించాలని చెప్పాడు. సైబర్ నేరస్థుడు చెప్పిన మాటలు నమ్మిన బాధితురాలు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పలు మార్లు రూ.35,23,070 ట్రాన్ఫ్‌ర్ చేసింది. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తన కుమారుడు చికిత్స పొందుతున్న ఫొటో చూపించాలని కోరింది. దానికి నిరాకరించిన సైబర్ నేరస్థులు బాధితురాలితో వాట్సాప్‌లో చేసిన ఛాటింగ్‌ను డిలీట్ చేశాడు . దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ నేరస్థులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దానికి ఇంకా చాలా టైం ఉంది.. ఇప్పడే ఆలోచించేది లేదు: అగార్కర్

ఇటీవలే ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్… ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సిరీస్‌లో దాదాపు 7 నెలల గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో ఈ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్లు.. 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించారు. ప్రపంచకప్‌కి ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడే దాని గురించి ఆలోచించేది లేదని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టీంలో రోహిత్, విరాట్ సభ్యులు. వారిద్దరూ అద్భుత ఆటగాళ్లను చాలాసార్లు చెప్పాను. జట్టుకు ఏది ముఖ్యమో అదే చేస్తాం. వన్డే ప్రపంచకప్‌కి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. ఇది కేవలం వారిద్దరి విషయంలోనే కాదు.. కుర్రాళ్లకు వర్తిస్తుంది. ఇప్పటికే పరుగుల పరంగానే కాకుండా చాలా ట్రోఫీలు గెలిచిన చరిత్ర వారిద్దరికి ఉంది. ఒక్క సిరీస్‌లో పరుగులు చేయనంత మాత్రాన పక్కన పెట్టేది లేదు. అలా అని భారీగా రన్స్ చేసినా వరల్డ్ కప్ గురించి ఇప్పుడే ఆలోచించేది లేదు. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి’’ అని అగార్కర్ అన్నారు.